గ్రంథాలయ చైర్మన్ల తొలగింపు చెల్లదు

ABN , First Publish Date - 2021-05-09T08:30:54+05:30 IST

ఏపీ గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్‌లను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు రద్దు చేసింది

గ్రంథాలయ చైర్మన్ల తొలగింపు చెల్లదు

తొలగింపులో రాజకీయ కోణం

గవర్నర్‌ అధికారం పరిమితమే

ప్రభుత్వ నిర్ణయం ఏకపక్షంగా సాగింది

నామినేటెడ్‌ చైర్మన్లుగా కొనసాగనివ్వండి

జీవోలు రద్దు చేసిన హైకోర్టు


అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): ఏపీ గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌తో పాటు జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్‌లను తొలగిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం 2019 సెప్టెంబరులో జారీ చేసిన జీవోలను చట్టవిరుద్ధమైనవిగా ప్రకటించింది. నామినేటెడ్‌ చైర్మన్లుగా పిటిషనర్లను పదవుల్లో కొనసాగనివ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఏపీ పబ్లిక్‌ లైబ్రరీస్‌ యాక్ట్‌లోని సెక్షన్‌ 7(2), 11(3) మేరకు పిటిషనర్ల తొలగింపు విషయంలో గవర్నర్‌ అధికారం పరిమితమైనదేనని, సంపూర్ణమైనది కాదని స్పష్టం చేసింది. సెక్షన్‌ 18(ఏ) నిబంధనలు అనుసరించకుండా, ఎలాంటి విచారణ చేయకుండా, వివ రణ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వకుండా చైర్మన్లను తొలగించడం సహజ న్యాయసూత్రాలకు ఉల్లంఘంచడమేనని పేర్కొంది. రాష్ట్రంలో అధికారం మార్పుతో పిటిషనర్లను తొలగిస్తూ ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని అభిప్రాయపడింది.  గ్రంథాలయ సంస్థలకు పర్సన్‌ ఇంచార్జులుగా అధికారులను నియమించడాన్ని తప్పుబట్టింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం. సత్యనారాయణమూర్తి తీర్పు వెలువరించారు. ఏపీ గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌తో పాటు శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమగోదావరి, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల గ్రంథాలయ సంస్థల చైర్మన్లను తొలగించడంతో పాటు గ్రంథాలయ సంస్థలకు పర్సన్‌ ఇంఛార్జులను నియమిస్తూ 2019 సెప్టెంబరులో  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 


ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ ఏపీ గ్రంథాలయ పరిషత్‌ చైర్మన్‌ దాసరి రాజా మాస్టారు, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్లు 10 మంది హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ, ప్రభుత్వం తరఫున అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. పబ్లిక్‌ లైబ్రరీస్‌ యాక్ట్‌ లోని సెక్షన్‌ 18 ఏ(1) ప్రకారం చైర్మన్లను తొలగించే అధికారం ప్రభుత్వానికి ఉందని అడిషనల్‌ అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరఫున సీనియర్‌ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు నిర్వహించేది నామినేటెడ్‌ పోస్టులని తెలిపారు. వారి తొలగింపు సందర్భంగా నోటీసులు ఇచ్చి వివరణ కూడా తీసుకోలేదని కోర్టు దృష్టికి తెచ్చారు. తొలగింపు ఉత్తర్వుల్లో కారణాలు తెలుపలేదన్నారు.  సెక్షన్‌ 18(ఏ)లోని విధానాన్ని పాటించకుండా.. గవర్నర్‌ తన అధికారాన్ని ఉపయోగించి పిటిషనర్లను తొలగించలేరని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి.. రాష్ట్ర ప్రభుత్వం కోర్టు ముందు ఉంచిన రికార్డులను పరిశీలించి.. రాజకీయపార్టీ అధికారం మార డం తప్ప.. పిటిషనర్ల తొలగింపునకు సరైన కారణాలు కనపడడం లేదని అన్నారు. ఏపీ గ్రంథాలయ చైర్మన్‌ విషయంలో ఎలాంటి విచారణ లేకుండా గవర్నర్‌ తన విచక్షణాధికారంతో తొలగించవచ్చన్నారు. సహజ న్యా యసూత్రాలు పాటిస్తూ ప్రజాహితం కోసం విచక్షణాధికారం ఉపయోగించవచ్చన్నారు. అయితే వివరణ తీసుకోకుండా తొలగింపు చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు.  

Updated Date - 2021-05-09T08:30:54+05:30 IST