రాజకీయ పావుగా మిగిలిన రైతు !

ABN , First Publish Date - 2022-10-05T06:39:47+05:30 IST

తెలంగాణలో కేసీఆర్ రైతులను పూర్తిగా విస్మరించారు. మరోపక్క రాజకీయ ప్రయోజనాల కోసం ‘ఇక్కడ రైతులకు ఇన్ని చేసాం, ఇక దేశవ్యాప్తంగా రైతులకు మరెన్నో చేస్తాం’ అని మాట్లాడుతున్నారు...

రాజకీయ పావుగా మిగిలిన రైతు !

తెలంగాణలో కేసీఆర్ రైతులను పూర్తిగా విస్మరించారు. మరోపక్క రాజకీయ ప్రయోజనాల కోసం ‘ఇక్కడ రైతులకు ఇన్ని చేసాం, ఇక దేశవ్యాప్తంగా రైతులకు మరెన్నో చేస్తాం’ అని మాట్లాడుతున్నారు. ఇటీవల 26 రాష్ట్రాల నుంచి వందమందిని, రైతు ప్రతినిధుల పేరు మీద, ఇక్కడకు పిలిచి రాచమర్యాదలు చేశారు. వ్యవసాయంలో తెలంగాణ అమోఘం అని, రైతులు సంతోషంగా ఉన్నారని, ‘రైతు బంధు’, ‘రైతు బీమా’ పథకాలు సర్వరోగ నివారిణులని కేసీఆర్ నిత్యం చెప్పే మాటలనే అతిథులుగా వచ్చిన రైతు సంఘాల ప్రతినిధులూ వల్లించారు. వారి చేత ఆవిధంగా మాట్లాడించి వాళ్లను తన రాజకీయ క్రీడలో పావులుగా వాడుకున్నారు కేసీఆర్. ఎక్కడెక్కడి రైతులనో ఇక్కడకు రప్పించి పొగడ్తలు ఇప్పించుకున్న కేసీఆర్, ఇక్కడి రైతులతో ఆపాటి సమావేశం నిర్వహించకపోవటం గమనించదగిన విషయం. 


ఈ సంవత్సరం జూలైలో ప్రకృతి వైపరీత్యాల వల్ల భారీ వర్షాలు పడ్డాయి. పంట వేసిన మొదటి దశలోనే రైతులు నష్టపోయారు. దాదాపు 20 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు నీట మునిగాయి. 5 లక్షల ఎకరాల్లో ఇసుక మేటలు కట్టాయి, లేదా భూములు కోతకు గురయ్యాయి. మునుపెన్నడూ లేనివిధంగా బ్యారేజీల నిర్మాణం వలన బ్యాక్ వాటర్ వచ్చి తీవ్ర నష్టం జరిగింది. ప్రాణహిత, పెనుగంగ నదుల వరద రైతులను ఎన్నడూ లేనివిధంగా తాకింది. ఇంత జరిగినా కనీసం పంట నష్టాల అంచనాలను కూడా ప్రభుత్వం చేయించలేదు. రైతులను ఆదుకునే ప్రయత్నం చేయలేదు. కేంద్ర పర్యవేక్షణ బృందం వచ్చి వెళ్ళాక కూడా రైతులకు నయాపైసా లాభం జరగలేదు. రైతులను ఆదుకునే బాధ్యతను పూర్తిగా విస్మరించింది ప్రభుత్వం. ఇప్పుడే కాదు, ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఉమ్మడి వరంగల్లు జిల్లాలో అకాల వర్షాల వల్ల చేతికొచ్చిన పంటను రైతు నష్టపోతే వ్యవసాయ శాఖ మంత్రి గాలి మోటార్ల వచ్చి చూసి వెళ్లారే తప్ప రైతులకు పైసా నష్టపరిహారం కూడా ఇవ్వలేదు. 


తెలంగాణ రాష్ట్రంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగే పంట నష్టానికి పరిహారం అందని ద్రాక్షలా మారింది. ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రతి ఏటా అనేక రకాలుగా నష్టం జరుగుతున్నా ప్రభుత్వం పరిహారం ఇవ్వటం లేదు. 2020 ఆగస్టు, సెప్టెంబరు నెలల్లో వరదలు వచ్చినపుడు 15 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రభుత్వమే పూర్తి వివరాలతో కేంద్రానికి లేఖ రాసింది. కానీ ఇటీవల రైతు స్వరాజ్య వేదిక వారు కోర్టులో కేసు వేస్తే అసలు నష్టమే జరగలేదని చెబుతోంది. కేంద్ర ప్రభుత్వం 2021 నవంబరులో ప్రకృతి విపత్తు నిధి నుంచి రూ.188కోట్లు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. మరి ఆ డబ్బులను ఇప్పటి వరకు రైతులకు ఇవ్వలేదు. ఇలా ప్రతి ఏటా వర్షాల వల్ల కలుగుతున్న నష్టం నుంచి రైతులను ఆదుకొనే బాధ్యత ప్రభుత్వానిదేనని మరచిపోతున్నారు. ఈ సంవత్సరం పడిన వర్షాల వల్ల పంట నష్టపోయి ప్రభుత్వం ఆదుకోకపోవడంతో ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలో ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.


మరో వైపు, మిర్చి పంటకు వచ్చిన తెగులు కారణంగా లక్షల్లో పెట్టుబడి పెట్టినప్పటికీ పంట చేతికి రాక అప్పులు పెరిగి వందలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే, కనీసం వారి సమస్యకు కారణాలేమిటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయలేదు ఈ ప్రభుత్వం. ఏమైనా అంటే ‘రైతుబీమా’ ఇస్తున్నాం కదా అంటున్నారు. ఎవరికి ఇస్తున్నారు? 59 ఏళ్ల లోపు వయసు ఉండి భూమి వారి పేరు మీద ఉంటేనే ఇస్తున్నారు. ఆపై వయస్సు ఉన్న రైతులకు లేదు. కౌలు రైతులకు ఏమీ లేదు. విత్తనాలకు సబ్సిడీ తెలంగాణా ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ధరలు పెరిగి పెట్టుబడుల భారం పెరిగింది. బ్యాంకుల నుంచి పంట రుణాలు లేక ప్రైవేటు అప్పులు పెరిగాయి. ప్రకృతి వైపరీత్యాలతో పంటల దిగుబడి తగ్గి, వచ్చిన పంటకు కనీస మద్దతు ధర కూడా లభించక, అప్పులు పెరిగి దిక్కుతోచని స్థితిలో రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. బతికి ఉన్నప్పుడు ఆదుకునే ప్రయత్నం చేయని ప్రభుత్వం చనిపోయినాక రైతు బీమా ఇస్తున్నాం అని గొప్పలు చెప్పుకుంటుంది.


అయితే, రైతు బీమా మొదలు పెట్టిన నాటి నుంచి 194 జీవోను అమలు చేయడం లేదు. రైతు ఆత్మహత్యలను గుర్తించడం లేదు. దేశంలో ఎక్కడో చనిపోయిన రైతులకు డబ్బులు ఇచ్చారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ చూడడానికి వచ్చి గుండెపోటుతో మరణించిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన రైతు నాయకుడికి అక్కడికి వెళ్లి ప్రభుత్వం తరపున రూ.10లక్షలు ఇచ్చారు. అలాంటి ప్రభుత్వానికి ఇక్కడి రైతుల మరణాలు కనపడుతలేవు.


తెలంగాణ రాష్ట్రంలో 2020 వానాకాలం సీజన్ నుంచి పంటల బీమా పథకాలు అమలు చేయడం లేదు. 2015 వరకు నేషనల్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ స్కీమ్, మాడిఫైడ్ నేషనల్ అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ స్కీమ్, వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్ రైతులకు అందుబాటులో ఉండేవి. రైతులు పంటల బీమా చేసుకుని ప్రకృతి విపత్తులు వస్తే నష్టపరిహారం పొంది ఊరట చెందేవారు. ఇప్పుడలాంటి పరిస్థితులు రాష్ట్రంలో లేవు.


2016 సంవత్సరం నుంచి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకం అమలు చేస్తున్నారు. కేవలం మూడేళ్ల ఏళ్ళ తర్వాత తన వాటా ప్రీమియం చెల్లించటం ఆర్థిక భారంగా మారుతోందని భావించి తెలంగాణ రాష్ట్రం ఈ పథకం నుంచి వైదొలిగింది. కేంద్రప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రభుత్వాల ఇష్టానికి వదిలేయడంతో ఇక్కడి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. 


2018–19, 2019–20 సంవత్సరాలకు సంబంధించిన రైతులకు చెల్లించాల్సిన రూ.841కోట్ల పంట నష్టం బకాయిలు అలాగే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ధనం చెల్లించకపోవటంతో బీమా నష్టపరిహారం చెల్లింపులు కావడం లేదు. గత అసెంబ్లీ సమావేశాల సమయంలో పాత బకాయిలు చెల్లిస్తామని ప్రకటించారు. ఒత్తిడి మేరకు 2018–19కి సంబంధించి సగం మంది రైతులకు మాత్రమే ఇచ్చారు. 


2018 ముందస్తు ఎన్నికల సమయంలో లక్ష రూపాయల వరకు పంట రుణాలు ఒకే వాయిదాలో మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ ఇంతవరకు నెరవేర్చలేదు. ఈ పథకం అమలైతే రాష్ట్రవ్యాప్తంగా 40.66 లక్షల మంది లబ్ధిదారులు ఉండేవారు. 


2019–20 వార్షిక బడ్జెట్టులో రూ. ఆరువేల కోట్లు, 2020–21 బడ్జెట్టులో రూ.6,225 కోట్లు, 2021–22 బడ్జెట్టులో రూ.5,225 కోట్లు, 2022–23 బడ్జెట్టులో రూ.2,939.20 కోట్లు కలిపి మొత్తం నాలుగు బడ్జెట్లలో రూ.20,389.20 కోట్లు కేటాయించారు. కానీ కేవలం 36 వేల వరకే ఋణం ఉన్న రైతులకు ఋణ మాఫీ చేసి మిగిలిన వారిని గాలికొదిలేసారు. మొత్తం ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.25,936కోట్ల పంట ఋణాలు ఉంటే ప్రభుత్వ బడ్జెట్ కేటాయింపులతో 90 శాతం రైతులకు ఋణమాఫీ జరిగేది. ఇలా చేయకపోవడం వలన వడ్డీ పెరిగి 16 లక్షల మందికి పైగా రైతులు ఋణం కట్టలేని స్థితిలోకి వెళ్లారు, మళ్లీ ఋణం పొందకుండా బ్లాక్‌లిస్టులో చేర్చబడ్డారు. బ్యాంకు వారు ఒత్తిడి పెంచి నోటీసులు ఇవ్వడం, భూములు వేలం వేస్తామనడంతో భూపాలపల్లి జిల్లాలో రేగొండ మండలం, మహబూబాబాద్ మండలాలలో ఇద్దరు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.


రైతులకు జీవనాధారమైన భూమిని కూడా ఆగమాగం చేశారు. భూ రికార్డుల ప్రక్షాళన పేరుతో భూమి హక్కును కూడా కోల్పోయే విధంగా చేశారు. ధరణి పేరుతో చేపట్టిన సంస్కరణలు ప్రయోజనాల కంటే సమస్యలనే ఎక్కువగా కొనితెచ్చాయి. ఇన్ని విధాలుగా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్న ముఖ్యమంత్రి రైతులకు ఎలా దేవుడు అవుతాడో రాష్ట్రానికి వచ్చిన రైతు సంఘాల నాయకులు ఆలోచించాలి.

అన్వేష్ రెడ్డి సుంకేట

చైర్మన్, తెలంగాణా కిసాన్ కాంగ్రెస్

Updated Date - 2022-10-05T06:39:47+05:30 IST