Abn logo
Jun 24 2021 @ 00:49AM

ప్రభుత్వం చేతిలోనే పరిశ్రమల పగ్గాలు

భారతదేశంలో ఆర్థికవ్యవస్థ ముందుకు సాగాలంటే పారిశ్రామికరంగమే ప్రధానమైనది. స్వతంత్రం రాకముందు వ్యవసాయరంగమే ఆర్థికవ్యవస్థకు పునాదిగా ఉండేది. ప్రస్తుతం ఆర్థికవ్యవస్థ 60 శాతం సేవారంగం పైనే ఆధారపడి ఉంది. కానీ, మనదేశం చైనా, అమెరికా ఆర్థికవ్యవస్థలకు దీటుగా ఎదగాలంటే పారిశ్రామికరంగమే శరణ్యం. అయితే, ఈ రంగం ముందుకు సాగడానికి వీలుగా ప్రభుత్వం తమ సంస్థలను పునర్వ్యవస్థీకరించకుండా ప్రైవేట్‌రంగం వైపు మొగ్గు చూపడంతో దేశంలో ఆర్థికవ్యవస్థ మెరుగుపడడంకన్నా క్రోనీ క్యాపిటలిజం (ఒక వ్యక్తి చేతిలోనే ఉండే పెట్టుబడి వ్యవస్థ) పెరిగిపోయింది. ప్రపంచీకరణ దృష్ట్యా ప్రైవేటురంగాన్ని ప్రోత్సహించడం అవసరమే కానీ ఏయే విభాగాలలో ప్రోత్సహించాలి? అదేవిధంగా ప్రభుత్వం పాత్ర కూడా ఏయే విభాగాలలో బలీయంగా ఉండాలి అనేది ముఖ్యమైన విషయం. ప్రస్తుతం ఆ పరిస్థితులు దేశంలో కనిపించడం లేదు.


మారుతున్న కాలానికి తగ్గట్లుగా ప్రజల్లో నైపుణ్యం పెరగడం ద్వారా స్వంతంగానే పరిశ్రమలను ప్రారంభించి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారనే ఆలోచనలో ప్రైవేట్‌ రంగాన్ని విస్తృతంగా ప్రోత్సహించడం మొదలయింది. ప్రపంచీకరరణ దృష్ట్యా భారీ నుంచి అతి భారీ పరిశ్రమలు మినహా చిన్న, మధ్యతరగతి పరిశ్రమలను ప్రైవేటీకరించారు. అందులో భాగంగా ఫార్మారంగం, విద్యుత్‌ పరికరాలు, ఆటోమొబైల్స్‌, ఎరువులు, వస్త్రపరిశ్రమ తదితర రంగాల్లో ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పుకుంది.


కాగా, 2014 నుంచి జరుగుతున్న ప్రైవేటీకరణ మరో దారిలో పయనిస్తోంది. దేశ ఆర్థికవ్యవస్థలో అత్యంత ప్రధానమైన పరిశ్రమలు ఎనిమిది ఉన్నాయి. వీటిలో బొగ్గు, అణు పరిశోధన, ఉక్కు, పెట్రోల్‌, ఎరువులు, రిఫైనరీ, సిమెంట్‌ తదితర పరిశ్రమలలోనే కాక, రైల్వేస్‌, బ్యాంకింగ్‌, బీమా రంగాలలో కూడా ప్రైవేటీకరణకు ప్రస్తుత ప్రభుత్వం మొగ్గు చూపుతోంది. ఫలితంగా మిశ్రమవ్యవస్థగా ఉన్న ఆర్థికరంగం రూపు మారిపోయి దేశం పూర్తి పెట్టుబడిదారీ వ్యవస్థగా మారిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల ప్రజలపైన అధిక భారం పడే అవకాశం ఉంది. ఇందుకు ఉదాహరణగా గత ఏడాది తీసుకొచ్చిన రైతుచట్టాలు, విద్యుత్‌చట్టాలు, రైల్వేలు, బీమా సంస్థలు, ఎయిర్‌ ఇండియా ప్రైవేటీకరణను చెప్పుకోవచ్చు. ఒక గొప్ప ఆశయంతో రెండవ పంచవర్ష ప్రణాళికా కాలంలో ప్రారంభించిన అనేక భారీపరిశ్రమలను నేడు నష్టాల సాకుతో ప్రైవేటీకరించాలనే ఆలోచన మానుకోవాలి. అత్యాధునిక సాంకేతిక విధానం అమలవుతున్న నేటి రోజుల్లో వాటిని ప్రభుత్వమే పునరుద్ధరించవచ్చు. కోర్‌ సెక్టార్‌లో స్థాపించిన పరిశ్రమలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండటం అవసరం. కాగా, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌, భద్రత, డిజిటల్‌ కరెన్సీ, సాఫ్ట్‌వేర్‌, లైఫ్‌సైన్సెస్‌, రోబోటిక్‌ తయారీ సంస్థలు, ఎలక్ట్రానిక్‌ హార్డ్‌వేర్‌, ఆటోమొబైల్‌ రంగాలలో ప్రైవేట్‌రంగాన్ని ప్రోత్సహించవచ్చు. దీనివల్ల ఆర్థికవ్యవస్థ బలోపేతం కావడంతో పాటు ప్రైవేటు, ప్రభుత్వరంగాల మధ్య పోటీతత్వం నెలకొన్నపుడు ఆ రంగాలకు, ప్రజలకు కూడా మేలు జరుగుతుంది. ప్రభుత్వరంగ పరిశ్రమలన్నీ ప్రైవేటుపరం చేయడం మూలంగా ఏదో అద్భుతం జరుగుతుందని భ్రమపడకుండా స్పష్టమైన ప్రణాళికలతో ముందుకెళ్ళినపుడు అనుకున్న విధంగా 2025 నాటికి మనదేశం అయిదు ట్రిలియన డాలర్ల (అయిదు వందల లక్షల కోట్లు) స్థూలజాతీయ ఉత్పత్తికి చేరుకుని ప్రపంచంలో ప్రస్తుతమున్న ఆరవ స్థానం నుంచి మూడవ స్థానానికి ఎగబాకుతుంది.

కన్నోజు మనోహరాచారి

ప్రత్యేకంమరిన్ని...