ఎరుపు పిట్ట పాఠం

ABN , First Publish Date - 2022-05-09T08:30:54+05:30 IST

వరికోలు గుచ్చుకుని గాయపడ్డ నా చూపుడు వేలుతో నుసాలు మీద ఎద్దుగిట్టల ముద్రల్లో నీ పేరు రాసుకుని మురిసిపోతూ నువ్వొస్తానన్నా...

ఎరుపు పిట్ట పాఠం

వరికోలు గుచ్చుకుని

గాయపడ్డ నా చూపుడు వేలుతో

నుసాలు మీద ఎద్దుగిట్టల ముద్రల్లో

నీ పేరు రాసుకుని మురిసిపోతూ


నువ్వొస్తానన్నా 

మిట్టమద్యానం మిడెండలో

మోదుగ చెట్టుకాడా చెమట చుక్కనవుతున్నాను


సెలప సెలపగా వున్న కాల్వ బురద నీళ్లలో

కొంగలు తానమాడి

మొబ్బులై ఆకాశానికి ఎగిరిపోతున్నాయి

సుట్రుగాలి దుమ్మెత్తి పోస్తూ దూరంగా పోయింది

నా ఎదురు చూపులను ఎక్కిరిస్తూ 

ఉత్తుత్తిపిట్ట మాత్రం ఉండుండీ పాడతావుంది


ఎక్కిరింపు పాడుతున్న పిట్టపై

కట్లు ధిక్కరించి గడపదాటి ఇంకా రాని నీపై

కోపం లేదు కానీ..

ఇప్పుడిప్పుడే ఇగుర్లేస్తున్న యీ మోదుగ నీడలో

పొడెండలాంటి నిరాశ మాత్రం ఉక్కపోతలా ఉంది.!


కాల్చిన చియ్యల మదురం యెటువంటిదో

చియ్యలు తిన్న పెదాల ముద్దురుచి ఎలా ఉంటుందో

నువు అదేపనిగా అడిగావని

ఏరికోరిమరీ ఎండుతునకల కూర వండుకు తెచ్చాను

‘కూడుపెట్టని కులమేముంది

గుండెల్లో పెట్టి సూసుకునే గుణంముందు’ అంటూ

నీ మనసు లేఖలో పంపిన నీ మాటకోసరమే

మాట తప్పకుండా చెరువుగట్టుమీద కూకోనున్నాను


నిన్న సరే రాలేదు

యీ పూటైనా కులంకట్టుముళ్లు తెంపుకుని

నా గుండె గట్టుమీదకు చేరుకుంటావా!?


కులందేముంది

కూరదేముంది అని వొట్టి మాటలు చెప్పడంమాని

నా ప్రేమకోటలో కొలువుదీరుతావా..!


ప్రేమలేని కుటీరాలలో కూటాలలో నువ్వూ

ప్రేమ దోసిళ్ళతో వాడల వాకిళ్లలో నేనూ

రోజూ తూర్పు కొమ్మమీద ఎరుపుపిట్టై ఎగిరి

పడమటచెట్టుపై వాలే సూర్యుణ్ణి చూస్తూ కూడా

తూర్పూ పడమర ముఖాలతో ఎంత కాలమిలా?

తూలి

కూలి

రాలిపోతున్న ఆకుల అరణ్యాలుగా

ఎన్ని యుగాలను ఇప్పటికే కంటిపాపల్లో గీసుకున్నాం

ఎన్నెన్ని గాయాలను కప్పుకొని తిరుగుతున్నాం


రేపైనా వస్తావు కదూ

వాడిపోతున్న ఆశలుతోటపై వానజల్లులా కురుస్తూ

చిల్లుల గొడుగుకింద 

తెగినబతుకుచెప్పులు కుట్టుకుంటూ

నువ్వొచ్చే దారిసాయ సూపులు పరిచిన నాకోసం..!

నువ్వొస్తున్నావు కదూ.!

చరిత్రకాలాన్ని చెప్పులుగా తొడిగి

మీపాదాలు కందకుండా కాపాడిన

ప్రేమికుడి కాయలు కాసిన చేతులు ముద్దాడటానికి!

పల్లిపట్టు నాగరాజు

99894 00881


Read more