సుందరకాండ పారాయణం చారిత్రాత్మకం

ABN , First Publish Date - 2021-07-25T07:14:20+05:30 IST

కరోనా మహమ్మారిని దూరం చేయాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టీటీడీ ప్రతిష్టాత్మకంగా తిరుమలలో చేపట్టిన సుందరకాండ పారాయణం చారిత్రాత్మకమని అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు.

సుందరకాండ పారాయణం చారిత్రాత్మకం
పారాయణంలో పాల్గొన్న ధర్మారెడ్డి, రాజేంద్రప్రసాద్‌

టీటీడీ అదనపుఈవో ధర్మారెడ్డి



తిరుమల, జూలై 24 (ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారిని దూరం చేయాలని శ్రీవారిని ప్రార్థిస్తూ టీటీడీ ప్రతిష్టాత్మకంగా తిరుమలలో చేపట్టిన సుందరకాండ పారాయణం చారిత్రాత్మకమని అదనపు ఈవో ధర్మారెడ్డి అన్నారు. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై జరుగుతున్న సుందరకాండ పారాయణం శనివారం ముగిసింది. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తిరుమల చరిత్రలో ప్రప్రథమంగా చేపట్టిన సుందరకాండ ఎంతో ప్రత్యేకమన్నారు. శ్లోకార్థంతోపాటు ప్రస్తుత సమాజానికి అన్వయించి.. ఆ సారాన్ని భక్తుల హృదయాల్లోకి తీసుకెళ్లగలిగామన్నారు. కరోనా నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సులు కోరుతూ ఏడాది క్రితం యోగవాశిష్టం-విషూచికా మంత్రంతో పారాయణ కార్యక్రమాలు ప్రారంభించామని చెప్పారు. ఆ తర్వాత సుందరకాండ పారాయణం చేపట్టామన్నారు. ఇందులోని 68 సర్గల్లోని 2,821 శ్లోకాలను 409 రోజుల పాటు పారాయణం చేశామన్నారు. రామనామస్మరణ ఎక్కడ జరిగితే అక్కడ హనుమంతుడు ఉంటారని వాల్మీకి మహర్షి తెలియజేశారన్నారు. ఆ విధంగా ఇన్నిరోజులు ఆంజనేయుడు మనమధ్యే ఉన్నాడని, ఆయన ఆశీస్సులతో కరోనా త్వరగా దూరం కావాలని ఆకాంక్షించారు. పారాయణానికి సహకరించిన కేఎస్‌ఎస్‌ అవధాని, ఆకెళ్ల విభీషణశర్మ, మారుతి, చలపతి, శేషాచలం, రామానుజం పండితులకు, కోట్లాది మంది భక్తులకు చేరువ చేసిన ఎస్వీబీసీ సీఈవో సురేష్‌కుమార్‌, కీర్తనలు ఆలపించిన అన్నమాచార్య ప్రాజెక్ట్‌ కళాకారులకు ధన్యవాదాలు తెలిపి, సన్మానించారు. ఇక చివరి రోజున 229 శ్లోకాలను పారాయణం చేశారు. వేదవిజ్ఞానపీఠం ప్రిన్సిపాల్‌ అవధాని మాట్లాడుతూ.. సుందరకాండ పారాయణం 409 రోజులు పూర్తిచేసుకుని గురుపౌర్ణమి రోజున ముగియడం శుభసూచికమన్నారు. ఆదివారం నుంచి నాదనీరాజనం వేదికపై బాలకాండ పారాయణం ప్రారంభంకానుంది. బాలకాండలోని 2,228 శ్లోకాలను పండితులు పారాయణం చేయనున్నారు. సినీ నటుడు రాజేంద్రప్రసాద్‌, భక్తులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T07:14:20+05:30 IST