త్రిపుర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం వెనుక...

ABN , First Publish Date - 2021-11-30T19:02:00+05:30 IST

త్రిపుర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించింది

త్రిపుర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం వెనుక...

న్యూఢిల్లీ : త్రిపుర స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం సాధించింది. 334 స్థానాల్లో 329 స్థానాలు ఆ పార్టీకే దక్కాయి. ఇదంతా ఆ పార్టీకి ప్రజల్లో గొప్ప ఆదరణ ఉండటం వల్ల జరిగిందనుకుంటే పొరపాటేనని ప్రతిపక్షాలు, కొందరు ప్రజాస్వామికవాదులు చెప్తున్నారు. ఈ విజయానికి కారణం అందరినీ ఆ పార్టీ బెదిరించడమేనని ఆరోపిస్తున్నారు. 


కొందరు అభ్యర్థులు మీడియా ముందు తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అధికారంలోని బీజేపీ నేతలు పోలీసులను తమకు అనుకూలంగా మార్చుకున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను, ఓటర్లను మాత్రమే కాకుండా ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులను కూడా బెదిరించారని చెప్పారు. పోలీసుల సమక్షంలోనే బెదిరింపులకు పాల్పడినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. యథేచ్ఛగా పోలింగ్ బూత్‌లను స్వాధీనం చేసుకుని, రిగ్గింగ్ చేసుకున్నారని, ఎన్నికలు జరిగిన నవంబరు 25 రాత్రి కొందరు ఓటర్లు, అభ్యర్థుల ఇళ్ళను ధ్వంసం చేశారని తెలిపారు. ఈ విధ్వంసకాండకు పాల్పడినవారు స్థానికులు కాదని చెప్పారు. 


ముఖ్యమంత్రిదే బాధ్యత

అగర్తల నగర పాలక సంస్థలో కొందరు స్థానికులతో మీడియా మాట్లాడినపుడు, ఈ విధ్వంసకాండపై ముఖ్యమంత్రి బిప్లబ్ దేబ్ స్పందించాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి, పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోతే, ఈ దారుణాలన్నీ వారి కనుసన్నల్లోనే జరిగాయని భావించవలసి వస్తుందన్నారు. 


అక్టోబరులో ఓ వర్గానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా హింసాకాండ జరిగిందని, ఆ తర్వాత అధికారంలో ఉన్న బీజేపీ నేతలు ప్రతిపక్షాల మద్దతుదారులను బెదిరించడం ప్రారంభించారని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఈ హింసాకాండ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని సుప్రీంకోర్టును టీఎంసీ ఎంపీల ప్రతినిధి బృందం కోరిందని, అదేవిధంగా ఈ దారుణాలపై దృష్టి సారించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కూడా కోరిందని తెలిపాయి. అయితే ఈ ఎన్నికలను నిలిపేసేందుకు సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలని త్రిపుర డీజీపీ, ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌లను నవంబరు 23న ఆదేశించింది. 


నామినేషన్ల ఉపసంహరణకు నిర్బంధం

త్రిపుర స్థానిక సంస్థల్లో 334 స్థానాలు ఉన్నాయి. వీటిలో 112 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. దీనికి కారణం బీజేపీ గూండాలు ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులను బెదిరించి, వారి నామినేషన్లను ఉపసంహరింపజేయడమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జితేంద్ర చౌదరి చెప్పారు. మిగిలిన 222 స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఎన్నికలు నవంబరు 25న జరగవలసి ఉండగా, నవంబరు 23 నుంచే బీజేపీ మద్దతుదారులు తమను బెదిరించారని కొందరు ఓటర్లు మీడియాకు చెప్పారు. ‘‘మీ కుటుంబంలో ఎవరైనా పోలింగ్ బూత్ దగ్గర కనిపించారో, అందుకు పర్యవసానాలను ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ఎదుర్కొంటారు జాగ్రత్త’’ అని బెదిరించారన్నారు. 


పోలీసుల ప్రేక్షక పాత్ర 

ప్రతిపక్ష పార్టీల అభ్యర్థుల వినతులను పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ధర్మనగర్ 14వ వార్డు టీఎంసీ అభ్యర్థి హుమయూన్ అహ్మద్ మాట్లాడుతూ, ఎన్నికల పోలింగ్ రోజున తనపై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని, పోలీసులు ఈ దారుణాన్ని చూసినప్పటికీ మౌనంగా ఉన్నారని చెప్పారు. తాను నవంబరు 25న ఉదయం ఆరు గంటలకు పోలింగ్ బూత్ వద్దకు వెళ్ళానని, పరిస్థితులు సజావుగా ఉన్నాయో, లేదో తెలుసుకోవడానికి వెళ్ళానని తెలిపారు. ఆ సమయంలో సుమారు 10 మంది గూండాలు తనను బూత్ నుంచి బయటకు లాగేశారని, పోలీసులు చూస్తూ ఊరుకున్నారని చెప్పారు. తాను సబ్ డివిజినల్ పోలీస్ ఆఫీసర్‌కు ఫోన్ చేసి, ఈ వివరాలను తెలిపానని చెప్పారు. తాను పరిస్థితిని చక్కదిద్దుతానని ఆ అధికారి హామీ ఇచ్చారని, అయితే వాస్తవంలో జరిగింది శూన్యమని వివరించారు. 


సుప్రీంకోర్టు సత్వర స్పందన

నవంబరు 25న పోలింగ్ జరుగుతుండగా బయటపడిన హింసాకాండపై సుప్రీంకోర్టు తక్షణమే స్పందించింది. ఈ ఎన్నికల ప్రక్రియను నిరంతరాయంగా కవర్ చేసేందుకు మీడియాకు అవకాశం కల్పించాలని ఉదయం 11.30 గంటలకు ఆదేశించింది. అన్ని పోలింగ్ బూత్‌లలోనూ సీసీటీవీ కెమెరాలను అమర్చాలని ఆదేశించింది. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగేందుకు, పోలింగ్ బూత్‌ల వద్ద భద్రత కోసం రెండు అదనపు కంపెనీల సీఆర్‌పీఎఫ్ దళాలను మోహరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. 


సుప్రీంకోర్టు ఆదేశించినా... 

సుప్రీంకోర్టు ఆదేశాలను బీజేపీ గూండాలు బేఖాతరు చేశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఓటర్లను బెదిరించడం, పోలింగ్ బూత్‌లను ఆక్రమించుకోవడం బీజేపీ కొనసాగించిందని చెప్పారు. కేవలం కైలాశహర్ పురపాలక సంఘం ఎన్నికలు మాత్రమే న్యాయంగా జరిగాయని, సెక్టర్ ఆఫీసర్ అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించడమే దీనికి కారణమని స్థానికులు చెప్పారు. 


పాత్రికేయులను సైతం... 

బీజేపీ గూండాలు పాత్రికేయులను సైతం వదిలిపెట్టలేదని టీఎంసీ అభ్యర్థులు చెప్పారు. పాత్రికేయుడు తమల్ సాహా నవంబరు 25న ఇచ్చిన ట్వీట్‌లో తనకు ప్రాణభయం ఉందని తెలిపారు. తనతోపాటు కెమెరామ్యాన్‌పై కొందరు దాడి చేశారని తెలిపారు. 


ముందుకు రాని ఓటర్లు

మరింత హింస జరిగే అవకాశం ఉందనే భయంతో చాలా మంది ఓటర్లు ఇళ్ల నుంచి బయటకు రాలేదని, ఓట్లు వేయలేదని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. ఉత్తర త్రిపుర ఎస్పీని వివరణ కోరగా, మీడియాతో మాట్లాడటానికి తనకు అనుమతి లేదన్నారు. మరోవైపు త్రిపుర పోలీసుల ట్విటర్ హ్యాండిల్ నవంబరు 20 నుంచి ఇన్‌యాక్టివ్‌గా ఉండటం గమనార్హం. 


బీజేపీ వైఖరి

నవంబరు 25న పోలింగ్ ముగిసిన తర్వాత బీజేపీ ఎమ్మెల్యే సుశాంత చౌదరి మీడియాతో మాట్లాడుతూ, కనీసం ఒక హత్య అయినా జరగలేదని, ఈ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందని ప్రతిపక్షాలు ఎలా ఆరోపిస్తాయని ప్రశ్నించారు. దీనినిబట్టి బీజేపీ వైఖరిని అర్థం చేసుకోవచ్చు. 


Updated Date - 2021-11-30T19:02:00+05:30 IST