వానలు కుమ్మేశాయ్‌!

ABN , First Publish Date - 2022-07-03T05:58:07+05:30 IST

జిల్లాలో ఈ సారి జూన్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది.

వానలు కుమ్మేశాయ్‌!
చేవెళ్ల ప్రాంతంలో గుంటుక తోలుతున్న రైతు


  • జూన్‌లో 126 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు
  • సాధారణం కంటే 34.3 మిల్లీ మీటర్లు అధికం
  • పొంగిన వాగులు, వంకలు
  • చెక్‌ డ్యాముల్లోకి చేరిన నీరు
  • పెరిగిన భూగర్భ జలమట్టం
  • పుష్కలంగా నీరు పోస్తున్న బోర్లు
  • జిల్లా వ్యాప్తంగా జోరందుకున్న వానాకాలం సాగుపనులు

జిల్లాలో ఈ సారి జూన్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. 91.7మిల్లీ మీటర్ల సాధారణ  వర్షపాతానికి గాను 126 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో 27 మండలాలుండగా దాదాపు అన్ని మండలాల్లో అధిక వర్షపాతమే నమోదైంది. నదులు, వాగులు పొంగాయి. చెక్‌ డ్యాముల్లోకి నీరు చేరింది. భూగర్భ జలమట్టం పెరిగింది. బోర్లు పుష్కలంగా నీరు పోస్తున్నాయి. రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులు సాగుపనుల్లో బిజీ అయ్యారు. మొలకల్లో కలుపు తీసుకుంటున్నారు. పంటలకు పైపాటు ఎరువులు వేస్తున్నారు. బోర్ల కింద వరి నాట్లు మొదలుపెట్టారు. తాజా వర్షాలకు మరి కొందరు విత్తనాలు వేస్తున్నారు.

రంగారెడ్డి అర్బన్‌, జూలై 2: వానాకాలం సీజన్‌ ప్రారంభంలో రైతులు వానల కోసం ఎదురు చూశారు. దుక్కులు దున్ని సిద్ధమయ్యారు. వారు ఆశించినట్టుగానే సీజన్‌ ప్రారంభంలో తొలకరి మురిపించింది. ఏరువాక పౌర్ణమి నాటి నుంచి వర్షాలు దంచి కొట్టాయి. నైరుతి రుతుపవనాల ఆగమనంతో వానలు భారీగానే కురిశాయి. కొన్నిచోట్ల కుండపోత వానలకు వాగులు, వంకలు పొంగి పొర్లాయి. ఈసీ, మూసీ నదుల్లో భారీగా నీరు పారింది. చెక్‌ డ్యాంలు, చెరువులు, కుంటల్లోకి నీరొచ్చి భూగర్భ జలమట్టాలు పెరిగాయి. ఈ సారి జూన్‌లో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. సాధారణ వర్షపాతం 91.7 మిల్లీ మీటర్లు కాగా 126 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. 2021 జూన్‌లో 90.3 మిల్లీ మీటర్ల వర్షమే  కురిసింది. గతేడాదితో పోలిస్తే ఈ సారి ఇప్పటి వరకు బాగానే పడ్డాయి. జిల్లాలో 27 మండలాలు ఉండగా వాటిల్లో 20 మండలాల్లో సాధారణం కంటే సరాసరి 20మిల్లీ మీటర్ల అధిక వర్షపాతం నమోదైంది. మరో నాలుగు మండలాల్లో 19 మిల్లీ మీటర్ల కంటే అధిక వర్షపాతం నమోదైంది. మూడు మండలాల్లో మాత్రం సాధారణం కంటే కాస్త తక్కువ వర్షపాతం నమోదైంది. 

ఊపందుకున్న వ్యవసాయ పనులు

గత మూడు రోజలుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో సాగు పనులు ఊపందుకున్నాయి. తొలకరి వర్షాలకు విత్తనాలు వేసిన రైతులు మొలక చేలల్లో కలుపు తీస్తున్నారు. మరి కొందరు ఈ వానలకు విత్తనాలు వేస్తున్నారు. మరి కొందరు పశువుల ఎరువు, ఇతర సేంద్రియ ఎరువులను డంప్‌ చేస్తూ నేలలో సారం పెంచే పనులు ముమ్మరం చేశారు. ప్రస్తుత వర్షాలతో రైతులు సాగుపనుల్లో బిజీ అయ్యారు. బోర్లలో నీరున్న రైతులు ఇప్పటికే పోసుకున్న వారి నారుతో ఏతకొచ్చిన చోట్ల నాట్లు వేసుకుంటున్నారు. వర్షాధార పంటలకు ఈ వర్షాలు ప్రాణం పోశాయి. కొన్నాళ్ల క్రితం వేసుకున్న పత్తి, కంది, మొక్కజొన్న, అముదం, జొన్న, సజ్జ తదితర పంటలు ఈ వర్షాలతో కళకళలాడుతున్నాయి. ఈ పదనలో రైతులు పంటలకు యూరియా, పాస్ఫేట్‌ తదితర పైపాటు ఎరువులు వేస్తున్నారు. 

గత ఆరేళ్లలో జూన్‌ నెలలో కురిసిన వర్షపాత వివరాలు (మిల్లీ మీటర్లలో..)

సంవత్సరం సాధారణ కురిసిన 

వర్షపాతం వర్షపాతం

2017-18     91.7 195.6

2018-19     91.7 86.4

2019-20     91.7 91.3

2020-21     91.7 155.0

2021-22     91.7 90.3

2022-23     91.7 126.0

2022 జూన్‌లో వర్షపాత వివరాలు

20 మిల్లీ మీటర్ల కంటే ఎక్కువ కురిసిన మండలాలు        20

19 మిల్లీ మీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైన మండలాలు     4

20 మిల్లీ మీటర్ల కంటే తక్కువ పడిన మండలాలు                    3

Updated Date - 2022-07-03T05:58:07+05:30 IST