రగులుతున్న ఆంధ్రుడు

ABN , First Publish Date - 2021-02-18T06:05:09+05:30 IST

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి రెండేళ్ల పరిపాలనలో ఆంధ్రుడు నిత్యం రగులుతూనే ఉన్నాడు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల లోని...

రగులుతున్న ఆంధ్రుడు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌రెడ్డి రెండేళ్ల పరిపాలనలో ఆంధ్రుడు నిత్యం రగులుతూనే ఉన్నాడు. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల లోని అన్ని జిల్లాల్లోనూ ఏదో ఒక సంఘటన జరగడం, దానిపై ఆయా ప్రాంతాలలో ప్రజలు ఆందోళనలు చేయడం నిత్యకృత్యమయ్యాయి. 420 రోజులుగా కోస్తా ప్రాంతంలోని ప్రజా రాజధాని అమరావతిపై రైతులు చేపట్టిన దీక్షలకు కానీ, ఉద్యమాలకు కానీ పరిష్కారం కనిపించడం లేదు. ప్రభుత్వం అటువైపు తల కూడా తిప్పటం లేదు. తాజాగా ఆంధ్రుల హక్కుగా అర్ధశతాబ్దం క్రితం సాధించుకున్న విశాఖ ఉక్కు కార్మికులు కూడా రోడ్డెక్కక తప్పలేదు. జిల్లాల్లో ఏదో ఒక ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలపై జరిగిన, జరుగుతున్న దాడులకు, అకృత్యాలకు కొదవలేదు. ఇప్పటివరకు  141 దేవతా విగ్రహాలపై జరిగిన దాడులకు నిరసనగా అన్ని రాజకీయ పక్షాలు, హిందూ పీఠాధిపతులు ఆందోళనలు చేశారు. గత డిసెంబర్‌లో తొలివిడతగా ప్రకటించిన ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికల ప్రక్రియలో అధికార పార్టీ విచ్చలవిడిగా చేసిన రాక్షసకాండపై నిరసనలు వెలువెత్తాయి. న్యాయమూర్తులపై సోషల్‌ మీడియాలోనూ, బహిరంగంగానూ మంత్రుల వ్యాఖ్యలకు, వివాదాస్పద అంశాలకు కొదవలేదు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీతో పాటు సీపీఐ, కాంగ్రెస్‌, జనసేన, బీజేపీ వంటి పార్టీలను సైతం అధికార పక్షం టార్గెట్‌ చేసింది. ఎవరు ఎలాంటి ప్రజాందోళనలకు పిలుపునిచ్చినా వెంటనే అరెస్టులు చేయడం, 144 సెక్షన్లు, కేసులు బనాయించడం రివాజయ్యాయి. రాజధాని ప్రాంతంలో ప్రభుత్వ ప్రోత్సాహంతో పోటీ శిబిరాలు పెట్టారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించారు. ఒకటికి రెండుసార్లు డీజీపీ కోర్టు ముందు దోషిగా నిలబడ్డారు. వీటన్నిటికి ముందు ఇసుక, మద్యం రేట్లపై నిరసనలు జరిగాయి. తాజాగా ముఖ్యమంత్రి ఏర్పాటు చేసుకున్న వాలంటీర్లు సైతం జీతం పెంచాలని రోడ్డెక్కారు. ఇలా అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని పార్టీలు జగన్‌ నియంతృత్వ పాలనకు బాధితులుగా మిగిలారు. ఇక, రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? అంటే అదీ లేదు. ఖర్చులు తప్ప ఆదాయం లేని రాష్ట్రంగా మార్చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్న నవరత్నాలను సైతం అవినీతిమయం చేసేశారు. రెండేళ్లలో రాష్ట్రానికి వచ్చిన కొత్త పరిశ్రమలు ఏవీలేవు. ఉద్యోగ అవకాశాలు లేవు. ప్రత్యేక హోదా లేదు. విభజన హామీలు నెరవేరలేదు. 70 శాతం పూర్తయిన పోలవరాన్ని ప్రశ్నార్థకం చేశారు. తాగునీరు, పారిశుద్ధ్యాన్ని పట్టించుకునేవారే లేరు. ప్రజలు అభివృద్ధి అంశాల గురించి యోచించడమే లేదని ప్రభుత్వ భావన కాబోలు. కానీ ప్రజలు కళ్ళు తెరిచే ఉంటారు. ఈ నిజాన్ని గమనించకపోవడమే వైకాపా ప్రభుత్వ పతనానికి నాంది అవుతుంది. ఈ సంగతి తెలుసుకోకపోతే, సమీక్షించుకోకపోతే రాబోయేకాలంలో ప్రభుత్వానికి ప్రజల చేతుల్లో కఠిÄన శిక్షలు ఉంటాయి .

పోతుల బాలకోటయ్య

అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు

Updated Date - 2021-02-18T06:05:09+05:30 IST