ప్రశ్నిస్తే ఉగ్రవాదమా?

ABN , First Publish Date - 2021-06-19T05:30:00+05:30 IST

‘‘నిరసనను తెలిపే మా ప్రజాస్వామిక హక్కును ఉపయోగించుకోవడం, ప్రభుత్వం నుంచి జవాబుదారీతనాన్ని ఆశించడం తప్పెలా అవుతుంది? అంటారు జెఎన్‌యు విద్యార్థి నేతలు దేవాంగన కలిత, నటాషా నర్వాల్‌. కిందటి ఏడాది ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఆందోళలనను

ప్రశ్నిస్తే ఉగ్రవాదమా?

‘‘నిరసనను తెలిపే మా ప్రజాస్వామిక హక్కును ఉపయోగించుకోవడం, ప్రభుత్వం నుంచి జవాబుదారీతనాన్ని ఆశించడం తప్పెలా అవుతుంది? అంటారు జెఎన్‌యు విద్యార్థి నేతలు దేవాంగన కలిత, నటాషా నర్వాల్‌. కిందటి ఏడాది ఢిల్లీలో జరిగిన హింసాత్మక ఆందోళలనను ప్రేరేపించారన్న ఆరోపణతో ఉపా చట్టం కింద అరెస్టై, ఏడాదికి పైగా జైల్లో ఉన్న వీరు ఇటీవల బెయిల్‌పై విడుదలయ్యారు. వారి బెయిల్‌పై పోలీసుల అభ్యంతరాలను సుప్రీం కోర్టు సైతం తోసిపుచ్చింది. ‘‘ఇది ఇక్కడితో ముగిసిపోయిందని అనుకోవడం లేదు. మా మీద తప్పుడు ఆరోపణలతో కేసులు పెట్టారు. అది మళ్ళీ జరగొచ్చు. కానీ మా లక్ష్యం, ఉద్యమించే మా తత్త్వం స్థిరంగా ఉంటాయి’’ అంటున్నారు దేవాంగన, నటాషా. 


ఉద్యమాలతో మమేకం...

నిలదీసే నైజం, ఉద్యమించే ధైర్యం కలిస్తే దేవాంగన కలిత (30) అంటారు ఆమెతో పరిచయం ఉన్న వాళ్ళు. ఢిల్లీలోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్‌యు)లో ఎంఫిల్‌ విద్యార్థిని అయిన దేవాంగన ఢిల్లీ యూనివర్సిటీలోని మిరండా హౌస్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. ‘జెండర్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌’ అనే అంశంపై బ్రిటన్‌లో మాస్టర్స్‌ కోర్సు చేశారు. అనంతరం ఢిల్లీ జెఎన్‌యులో మరో మాస్టర్స్‌ డిగ్రీలో చేరారు. యూనివర్సిటీలో విద్యార్థులు ఎదుర్కొంటున్న భద్రతా, సామాజిక సమస్యలపై జరిగిన ఆందోళనల్లో పాలుపంచుకున్నారు. విద్యార్థి మండలి వైస్‌ ఛైర్మన్‌గానూ పని చేశారు.


బయటకు వచ్చామంటే నమ్మశక్యంగా లేదు...

సామాజిక పోరాటాల్లో మహిళలకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయంటారు దేవాంగన. ‘‘అసమంజసం అనిపించిన దేన్నయినా వ్యతిరేకిస్తూ మహిళలు కలిసికట్టుగా పోరాటానికి దిగితే సమాజం వాళ్ళపై విమర్శలతో దాడి చేస్తుంది. అవమానిస్తుంది, అవహేళన చేస్తుంది. ఉగ్రవాదులనీ, నీతి లేని వాళ్ళనీ ముద్రలు వేసేస్తుంది. శాంతియుతమైన ఆందోళన కానీ, నిరసన తెలపడం కానీ ఉగ్రవాదం కాదన్నది మా నమ్మకం. ఢిల్లీ హైకోర్టు కూడా ఆ మాటే చెప్పింది. ప్రజాస్వామ్యానికి పునాదుల్లో... నిరసన తెలిపే హక్కు ఒకటి. కానీ ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసే మాలాంటి వారు ఎందరో జైలుపాలవుతున్నారు’’ అన్నారామె. ‘‘జైల్లోంచి మేము బయటకు వచ్చామంటే ఇప్పటికీ నమ్మకం కుదరడం లేదు. బెయిల్‌ ఆర్డర్‌ వచ్చినా, ఫార్మాలిటీస్‌ పేరిట రెండు రోజులు జాప్యం చేశారు. జైలు గేటు దాటి బయటకు వచ్చి, ఆకాశాన్ని చూస్తూంటే అంతా వింతగా అనిపిస్తోంది’’ అని చెప్పారు.


అమ్మే అండా దండా...

అసమానతలపై పోరాడే ధైర్యాన్ని తనలో నింపిన వ్యక్తి తన తల్లేనని చెబుతారు దేవాంగన. ‘‘ఈ రోజు ఇక్కడ నేను ఉన్నానంటే ఆమె నాకు నేర్పిన విలువలే కారణం. ఒక స్వతంత్ర మహిళగా ఉండాలనీ, ఎవరికీ తల వంచకూడదనీ, నాదైన ఆలోచన నాకు ఉండాలనీ చెబుతూ నన్ను పెంచింది. మా అమ్మ నాకు అండగా నిలవకపోతే జైల్లో గడపడం కష్టమైపోయేది. నాకు మద్దతు ఇస్తూ, అభినందిస్తూ వచ్చిన ఉత్తరాలను ఆమె నాకు పంపేది’’ అని ఆమె గుర్తు చేసుకున్నారు. ‘‘జైల్లో మా చుట్టూ ఉన్న వ్యక్తుల నిస్సహాయత చూసి ఎంతో ఆవేదన కలిగింది. తమ తరఫున వాదించడానికి న్యాయవాదులను పెట్టుకోవడానికీ, బెయిల్‌ పొందడానికీ తగిన ఆర్థిక స్థోమత వాళ్ళకి లేదు. వాళ్ళు అక్కడే మగ్గిపోతారు. తమ వాళ్ళకోసం ఎంతో వేదన పడతారు. ఈ పరిస్థితి మారాలి’’ అంటున్నారు దేవాంగన. 


పోరాటం కొనసాగుతుంది...

‘‘జైలుకు వెళ్ళాల్సివచ్చినందుకు నో రిగ్రెట్స్‌. అయితే, ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళలేకపోయామన్నదే మా ఆవేదన. దాన్ని క్రూరంగా అణచివేశారు. అయితే, ఇతర రూపాల్లో పోరాటం కొనసాగుతుందనీ, బాధిత పౌరులకు న్యాయం లభిస్తుందనీ ఆశిస్తున్నా’’ అని చెబుతున్న నటాషా నల్వాల్‌ (32) ప్రస్తుతం జెఎన్‌యులోని సెంటర్‌ ఫర్‌ హిస్టారికల్‌ స్టడీ్‌సలో పిహెచ్‌డి చేస్తున్నారు. ఢిల్లీలో పుట్టి, పెరిగిన నటాషాకు పదమూడేళ్ళ వయసులో తల్లి మరణించారు.


ఆమె సంరక్షణ అంతా తండ్రి మహావీర్‌ చూసుకున్నారు. వ్యవసాయ శాస్త్రవేత్త అయిన మహావీర్‌ సిపిఎంలో సీనియర్‌ కార్యకర్త. పౌర ఉద్యమాల్లో చురుగ్గా ఉండేవారు. ఎమర్జెన్సీని వ్యతిరేకించి, జైలుకు వెళ్ళారు. జెఎన్‌యులో విద్యార్థి ఉద్యమాల్లోనూ, సామాజిక సమస్యలపై చేపట్టే పోరాటాల్లోనూ తాను పాల్గొనడానికి ప్రేరణ తండ్రేనంటారు నటాషా. అయితే ‘‘చివరి క్షణాల్లో మా నాన్న పక్కన లేకపోవడం జీవితంలో మరచిపోలేని విషాదం’’ అని చెబుతున్నారు..


అందరి బాధనూ అనుభూతి చెందుతున్నా...

‘‘నేను జైల్లో ఉన్నప్పుడు మా నాన్నకు కొవిడ్‌ సోకింది. ఆ తరువాత ఆరోగ్యం క్షీణించింది. ఆ సమయంలో నా అవసరం నాన్నకు ఎంతో ఉంది. నాన్న పక్కనే ఉండి, సంరక్షణ చెయ్యడానికి బెయిల్‌ కోసం ఎంతగానో ప్రయత్నించాను. కానీ కిందటి నెలలో, ఆయన మరణించిన తరువాత కాని నన్ను బయటకు వెళ్ళనివ్వలేదు. నాన్న ఆఖరి క్షణాల్లో ఆయనతో ఉండలేకపోయాను. చివరకు మూడు వారాల పాటు బెయిల్‌ దొరకడంతో, ఆయన అంత్యక్రియలకు వెళ్ళగలిగాను’’ అన్నారామె ఆవేదనగా. ‘‘ఇదంతా తలచుకుంటే, వ్యవస్థ మీద అంతులేని కోపం వస్తోంది. సరైన వైద్య సదుపాయాలను ప్రభుత్వాలు అందించకపోవడం వల్లే ఎంతో మంది కొవిడ్‌ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. తమకు ఆప్తులైన వారిని పోగొట్టుకున్న ప్రతి ఒక్కరి బాధనూ నేను అర్థం చేసుకోగలను’’ అని చెప్పారామె.


అరెస్ట్‌ నేపథ్యం ఇదీ

ఢిల్లీలోని మిరండా హౌస్‌ ఉమెన్స్‌ కాలేజీలో చదువుతున్నప్పుడు... 2015లో, మహిళా హాస్టల్‌లో విధించిన కర్ఫ్యూను నిరసిస్తూ నటాషా నర్వాల్‌ తదితరులతో కలిసి ‘పింజ్రా టాడ్‌: బ్రేక్‌ ది హాస్టల్‌ లాక్స్‌’ అనే ఫేస్‌బుక్‌ పేజీని దేవాంగన ప్రారంభించారు. ఆ తరువాత ‘పింజ్రా టాడ్‌’ను మహిళా సమస్యలపై పోరాడే ఒక ఉద్యమ సంస్థగా మలిచారు. పౌరసత్వ సవరణ చట్టం (సిఎఎ), జాతీయ పౌరుల జాబితా (ఎన్‌ఆర్‌సి)లను వ్యతిరేకిస్తూ కిందటి ఏడాది ఢిల్లీలో జరిగిన నిరసన కార్యక్రమాల్లో దేవాంగన, నటాషా చురుగ్గా పాల్గొన్నారు. ఈ ఉద్యమ నేపథ్యంలో తలెత్తిన ఆందోళనల్లో 53 మంది మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు. ఆ ఆందోళనలు హింసాత్మకంగా మారేలా రెచ్చగొట్టడంలో ‘పింజ్రా టాడ్‌’ది ప్రధాన పాత్ర అనే ఆరోపణతో, చట్ట వ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (ఉపా) కింద దేవాంగన, నటాషాలతో పాటు జామియా మిలియా ఇస్లామియా యూనివర్శిటీ విద్యార్థి నాయకుడు ఆసిఫ్‌ ఇక్బాల్‌ తన్హాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం వీరందరూ బెయిల్‌పై విడుదలయ్యారు. 


ఖైదీలు ఆశ్చర్యపోయారు...

జైలుకు వెళ్ళడం వల్ల అక్కడి పరిస్థితుల్ని మరింత దగ్గరగా గమనించే అవకాశం దొరికిందంటారు నటాషా. ‘‘జైలు గోడల మధ్య ఉండే వ్యవస్థ మనుషుల్ని అమానవీయంగా మార్చేస్తుంది. నేను కనీసం బయటకు వచ్చి, నా కుటుంబ సభ్యుల్ని కలుసుకొనే అవకాశమైనా వచ్చింది. కానీ చాలా మందికి అదీ లేదు.  వాళ్ళ తరఫున సరైన న్యాయ ప్రాతినిధ్యం ఉండదు’’ అని చెప్పారామె. ‘‘ఏడాదికి పైగా కుటుంబాలకూ, స్నేహితులకూ దూరంగా ఉన్నామనే బాధ ఉంది. కానీ మా కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. అన్ని వర్గాల నుంచి మద్దతు లభించింది. ఎంతోకాలం ప్రయత్నించాక, బెయిల్‌ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు మాకు ఎంతో ఆశనీ, బలాన్నీ ఇచ్చాయి. భారత న్యాయ వ్యవస్థ మీద మా విశ్వాసాన్ని పునరుద్ధరించాయి. ఇక మీదట కూడా ప్రజల హక్కుల కోసం పోరాడతాం, ప్రజాస్వామ్య యుతంగా నిరసన తెలియజేస్తాం’’ అని స్పష్టం చేశారు నటాషా.



Updated Date - 2021-06-19T05:30:00+05:30 IST