మహిళా ప్రయాణికురాలిని బస్టాండ్‌లో దింపి వెళ్లిపోయిన ఆటో డ్రైవర్.. కొద్ది సేపటి తర్వాత పోలీసులు అతని వద్దకు వెళ్లి..

ABN , First Publish Date - 2022-04-05T16:06:54+05:30 IST

అతను ఓ ఆటో డ్రైవర్.. సోమవారం మధ్యాహ్నం ఓ మహిళా ప్రయాణికురాలిని బస్టాండ్‌లో దించి వెళ్లిపోయాడు..

మహిళా ప్రయాణికురాలిని బస్టాండ్‌లో దింపి వెళ్లిపోయిన ఆటో డ్రైవర్.. కొద్ది సేపటి తర్వాత పోలీసులు అతని వద్దకు వెళ్లి..

అతను ఓ ఆటో డ్రైవర్.. సోమవారం మధ్యాహ్నం ఓ మహిళా ప్రయాణికురాలిని బస్టాండ్‌లో దించి వెళ్లిపోయాడు.. దిగే సమయంలో ఆ మహిళ తన పర్సును ఆటోలోనే మర్చిపోయింది.. కొద్ది సేపటి తర్వాత ఆ విషయం గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేసింది.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆటో నెంబర్ తెలుసుకుని పోలీసులు డ్రైవర్ ఇంటికి వెళ్లారు.. బంగారం, డబ్బులు ఉన్న పర్సు ఏదని అడిగారు.. షాకైన అతను తనకేమీ తెలియదని చెప్పడంతో ఆటోలో వెతికారు.. వెనకాల సీటు కింద ఆ పర్సు దొరకడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 


మధ్యప్రదేశ్‌లోని సాగర్ జిల్లాకు చందిన సంగీత చౌక్సే అనే మహిళ సోమవారం మధ్యాహ్నం ఆటో ఎక్కి కట్రా బస్టాండ్‌కు చేరుకుంది. అయితే దిగే హడావుడిలో తన పర్సును ఆటోలోనే మరచిపోయింది. కొద్ది సేపటి తర్వాత ఆ విషయం గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు వెంటనే బస్టాండ్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. ఆమె దిగిన ఆటో నెంబర్ తెలుసుకుని కాల్ చేశారు. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో అడ్రస్ ఆధారంగా నేరుగా ఇంటికి వెళ్లారు. 


ఇంట్లో ఉన్న ఆటో డ్రైవర్‌ను బయటకు పిలిచి విచారించారు. పర్సు గురించి తనకేమీ తెలియదని అతను చెప్పడంతో పోలీసులు ఆటోను శోధించారు. ఆటో వెనుక సీటు కింద పర్సు కనిపించింది. పర్సులో రూ.15 వేలు, బంగారు ఆభరణాలు, ఏటీఎమ్ కార్డు సురక్షితంగా ఉన్నాయి. ఆ పర్సును ఆటో డ్రైవర్ చేతే ఆ మహిళకు పోలీసులు ఇప్పించారు. గంటల వ్యవధిలోనే తన ఫిర్యాదు పరిష్కరించిన పోలీసులకు సంగీత కృతజ్ఞతలు తెలిపింది. 

Updated Date - 2022-04-05T16:06:54+05:30 IST