మొక్కను సంరక్షిస్తేనే ప్రయోజనం

ABN , First Publish Date - 2021-06-21T06:48:17+05:30 IST

రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం జిల్లాలో ఓ అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే చేపట్టిన ఆరు దశల్లో పథక అమలు తీరుపై పలు విమర్శలు వస్తు న్నాయి. కానీ అధికారులు మాత్రం అదే తీరుతో కనిపిస్తున్నారు.

మొక్కను సంరక్షిస్తేనే ప్రయోజనం

ఏడో విడత హరితహారానికి సిద్ధమవుతున్న అధికారులు

ముగిసిన ఆరు దశల్లో అంతంత మాత్రంగానే పథకం నిర్వహణ

జూలై మొదటి వారంలో హరితహారం కార్యక్రమానికి శ్రీకారం

జిల్లా వ్యాప్తంగా 43లక్షల 64వేల మొక్కల పెంపకమే లక్ష్యం

ఆదిలాబాద్‌, జూన్‌ 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం పథకం జిల్లాలో ఓ అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి అన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే చేపట్టిన ఆరు దశల్లో పథక అమలు తీరుపై పలు విమర్శలు వస్తు న్నాయి. కానీ అధికారులు మాత్రం అదే తీరుతో కనిపిస్తున్నారు. ఏటా మొక్కలు నాటడం, నిర్లక్ష్యంగా వదిలేయడంతో కనిపించకుండానే పోతున్నాయి. నాటిన ప్రతి మొక్కనూ సంరక్షిస్తేనే ప్రయోజనం ఉంటుంద న్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హరితహారం కింద మొక్కల పెంపకానికి రాష్ట్ర ప్రభుత్వం ఏటా లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నా క్షేత్ర స్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. 4153 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఉన్న జిల్లాలో లక్షా 874 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఈ లెక్కన జిల్లాలో 47శాతం అటవీ ప్రాంతం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కానీ ఏటా అంతరించిపోతున్న అడవులపై అధికారుల వద్ద స్పష్టమైన లెక్కలు లేక పోవడం అనుమానాలకు దారితీస్తోంది. ఏడో విడత హరితహరం కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా 43 లక్షల 64వేల మొక్కల పెంపకాన్ని లక్ష్యంగా పెట్టుకు న్న అధికారులు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని 468 గ్రామ పంచాయతీలకు గాను ఒక్కో గ్రామ పంచాయతీలో 10వేల మొక్కలను నాటేందుకు ఏర్పాట్లను చేస్తున్నారు. ఈ సారి వేప, చింత, మర్రి మొక్కలతోపాటు పండ్ల మొక్కలు ఉసిరి, మర్రి, తెల్ల మద్ది, గుల్మర్గ, వేప, ఈత, ఖర్జుర వనాలను పెంచేం దుకు అధికారులు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. సంరక్షణ సాధ్యమయ్యే ప్రదేశాలపైనే మొక్కలను నా టేందుకు ప్రత్యేక దృష్టిని సారిస్తున్నారు. ఇప్పటికే ప లు ప్రాంతాల్లో మొక్కలు నాటేందుకు గుంతలు, ట్రీ గార్డ్స్‌ను సిద్ధం చేస్తున్నారు. జూలై 5,6 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమయ్యే ఏడో విడత హరితహరం కార్యక్రమంలో భాగంగా జిల్లా అంతటా మొక్కలు నాటేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

శాఖల వారీగా లక్ష్యం..

ఈ ఏడు జిల్లా వ్యాప్తంగా 43లక్షల 64వేల మొక్కల పెంపకాన్ని లక్ష్యంగా పెట్టుకున్న అధికారులు శాఖల వారీగా లక్ష్యాన్ని నిర్ణయించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో 8లక్షలు, గ్రామీణాభివృద్ధి శాఖ 25లక్షలు, మున్సిపాలిటీ పరిధిలో 5లక్షలు, విద్యాశాఖ, వ్యవసాయ శాఖ, పోలీసు శాఖ లక్ష చొప్పున మిగతా ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అయితే గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ప్రతీ గ్రామ పంచాయతీలో నర్సరీలను ఏర్పాటు చేసి సరిపడా మొక్కలను పెంచుతున్నా రు.

 కానీ క్షేత్ర స్థాయిలో చూస్తే పరిస్థితులు మాత్రం భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 60శాతం కూడా మొక్కల పెంపకాన్ని చేపట్టలేదంటున్నారు. దీంతో గతేడు పరిస్థితులే పునరావృతమయ్యే అవకాశాలు ఉన్నాయి. మొక్కలు సరిపోవడం లేదంటూ కొందరు సర్పంచ్‌లు ఇతర ప్రాతాల నుంచి మొక్కలను కొనుగోలు చేయడం పరిపాటిగానే మారుతోంది. ఈ క్రమంలోనే నిధుల గోల్‌మాల్‌ జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

సంరక్షణ కరువు..

హరితహరం అనగానే హడావిడిగా మొక్కలు నాటేయడం, ఆపై చేతులు దులుపు కోవడమే తప్ప.. అనుకున్న స్థాయిలో మొక్కల పెంపకం జరగడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హరితహరం కార్యక్రమంలో నాటిన మొక్కలను సంరక్షించేందుకు ప్రత్యేక సిబ్బందిని నియమించాల్సి ఉంటుంది. కానీ అలాంటి పరిస్థితులు ఎక్కడ కనిపించడం లేదు. ఒక్కో మొక్క రక్షణకు రూ.5 చెల్లించి 400 మొక్కల బాధ్యతను ఒక్కో వ్యక్తికి అప్పగించాల్సి ఉంది. కానీ నిర్వహణ, కూలీ బిల్లులు సకాలంలో చేతికి అందక పోవడంతో గాలికొదిలేశారు. నిత్యం అధికారులు మొక్కల ఎదు గుదలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాల్సి ఉంటుంది. అధికారులు కార్యాల యాలకే పరిమితం కావడంతో కింది స్థాయి సిబ్బంది చెప్పిందే లెక్క అన్నట్లుగా మారుతోంది. రికార్డుల్లో ఉన్న మొక్కల లెక్కలకు క్షేత్ర స్థాయిలో ఉన్న మొక్కలకు  ఎలాంటి పొంతన లేకుం డా పోతోంది. అసలు సరిపడా నీటి వసతి, సంరక్షణ సౌకర్యం ఉన్నచోట మొక్కలను నాటాల్సి ఉంటుంది. అయితే అధికారులకు ముందు చూపు కరువవడంతో ఇష్టారాజ్యంగా మొక్కలను నాటి వదిలేస్తున్నారు.



పకడ్బందీగా చేపడతాం..

- కిషన్‌ (డీఆర్డీఏ పీడీ,ఆదిలాబాద్‌)

ఏడవ హరితహారం కార్యక్రమానికి సిద్ధం కావాలని ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈ సారి హరితహారం కార్యక్రమాన్ని పకడ్బంధీగా చేపడుతాం. జిల్లా వ్యాప్తంగా 43లక్షల 64వేల మొక్కలను నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. వర్షాలు సమృద్ధిగానే కురవడంతో హరితహారానికి అనుకూలంగానే ఉంటుంది. జూలై మొదటి వారంలో హరతహారం కార్యక్రమాన్ని ప్రారంభించే అవకాశం ఉంటుంది. సంరక్షణ గల ప్రాంతాల్లోనే మొక్కలు నాటాలని సూచిస్తున్నాం. అలాగే ప్రధాన రహదారుల వెంట పచ్చదనం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం.

Updated Date - 2021-06-21T06:48:17+05:30 IST