శ్రీశ్రీని ఆదుకున్న ప్రజావైద్యుడు

ABN , First Publish Date - 2021-10-15T07:50:37+05:30 IST

కొన్నిసార్లు చరిత్రకు తీరిక ఉండదు. జీవితాలను జనశ్రేయస్సుకు అంకితం చేసిన మహనీయులను గుర్తుంచుకోదు. జనాలకు స్మరించుకునే తీరికా ఉండదు. అలాంటి విస్మృత మహనీయుల్లో ఒకరు ప్రజా వైద్యుడు డా.బాలకిష్టయ్య....

శ్రీశ్రీని ఆదుకున్న ప్రజావైద్యుడు

కొన్నిసార్లు చరిత్రకు తీరిక ఉండదు. జీవితాలను జనశ్రేయస్సుకు అంకితం చేసిన మహనీయులను గుర్తుంచుకోదు. జనాలకు స్మరించుకునే తీరికా ఉండదు. అలాంటి విస్మృత మహనీయుల్లో ఒకరు ప్రజా వైద్యుడు డా.బాలకిష్టయ్య. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సుప్రసిద్ధ వైద్యుడాయన. 21 ఏళ్ళకే ఎంబిబిఎస్ పూర్తి చేసి వనపర్తి పట్టణం కేంద్రంగా వైద్యసేవలు అందించిన ప్రాతః స్మరణీయుడు. తన వృత్తి జీవితమంతా సామాన్య ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించిన ఉదారుడు. డాక్టర్ దగ్గరకు రోగి కాదు, రోగి వద్దకు డాక్టరే వెళ్ళాలనే ఆదర్శాన్ని శిరసావహించిన వైద్యుడు బాలకిష్టయ్య. ఇంటింటికి వెళ్లి ఉచిత వైద్య సేవలు అందించి, ఎందరి ప్రాణాలనో కాపాడిన వైద్య నారాయణుడాయన. వామపక్ష భావాలు, ఆదర్శాలతో వైద్యవృత్తిని ఆచరించిన మానవోత్తముడు. ఇది వారిలో కనిపించే ఒక పార్శ్వం మాత్రమే. 


మరో పార్శ్వం ఏమిటంటే అభ్యుదయ సాహిత్య సేవ. తాను కవీ, రచయిత కాకున్నా సమాజానికి మేలు చేసి, చైతన్యాన్ని రగిల్చే సాహిత్యానికి అండదండగా నిలిచారు. కవులనూ, కళాకారులనూ ఆదరించారు. వారి హృదయాలలో కవి జన బాంధవుడు. మహాకవి శ్రీశ్రీ తన కవితా మహాప్రస్థానంతో విప్లవాలను రగిలిస్తున్న కాలంలో, ఆయన అప్పులపాలై ఇల్లు వేలానికి వచ్చిన వార్త డా. బాలకిష్టయ్యను కలచివేసింది. తన మిత్రులు, సహచరులతో సమావేశమై జిల్లా అంతటా తిరిగి విరాళాలు సేకరించి, తన వంతు సహాయం చేసి లక్షా ఇరవై ఐదు వేల రూపాయలు ప్రజా సమక్షంలో శ్రీశ్రీకి అందించారు. ఆనాటి బహిరంగసభలో జ్వాలాముఖి అనర్గళోపన్యాసం చేశారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో పాలుపంచుకున్న వారిలో రాజేంద్ర బాబు, సి.రాంమోహన్, హిమజ్వాల, అంపయ్య, నాగవరం బలరాం, గుండోజు యాదగిరి, కాతోజు వెంకటేశ్వర్లు, క్రిష్ణమాచారి మొదలైన కవులు, రచయితలు ఉన్నారు. మహాకవిని ఆదుకున్న మహనీయుడు డా. బాలకిష్టయ్య విగ్రహాన్ని నేడు వనపర్తిలో రాష్ట్ర మునిసిపల్ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సమక్షంలో రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆవిష్కరించడం ఉత్తమ చరిత్రను నిత్యం స్మరించుకోవడమే. 

కోట్ల వెంకటేశ్వర రెడ్డి

Updated Date - 2021-10-15T07:50:37+05:30 IST