‘పశ్చిమ’లో ప్రొటోకాల్‌ రగడ

ABN , First Publish Date - 2022-08-06T09:05:45+05:30 IST

‘పశ్చిమ’లో ప్రొటోకాల్‌ రగడ

‘పశ్చిమ’లో ప్రొటోకాల్‌ రగడ

టిడ్కో ఇళ్ల పంపిణీ కార్యక్రమం రసాభాస

వేదికపై నుంచి నిమ్మల, ఎమ్మెల్సీ అంగరను కిందకు నెట్టేసిన వైసీపీ కార్యకర్తలు 

కలెక్టర్‌ చాంబర్‌ వద్ద టీడీపీ శ్రేణుల నిరసన 


భీమవరం/పాలకొల్లు, ఆగస్టు 5: టిడ్కో ఇళ్ల పంపిణీలో ప్రొటోకాల్‌ వివాదం చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పట్టణ పేదల కోసం పెంకుళ్ళపాడులో నిర్మించిన టిడ్కో గృహాలను శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, మంత్రులు ఆదిమూలపు సురేష్‌, దాడిశెట్టి రాజా, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్‌ ముదునూరి ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొటోకాల్‌ ఉల్లంఘనకు పాల్పడ్డారని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మో హన్‌ ఆరోపించారు. వేదిక వద్ద వారిద్దరినీ వైసీపీ కార్యకర్తలు నెట్టివేయడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు భీమవరంలోని కలెక్టరేట్‌కు నిమ్మల వచ్చారు. అక్కడ కలెక్టర్‌ లేకపోవడంతో ఆమె చాంబర్‌ వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు నిమ్మల, మంతెన రామరాజు, ఎమ్మెల్సీ అంగర మీడియాతో మాట్లాడారు. టిడ్కో గృహాలను తమ ప్రభుత్వం 90శాతం పూర్తిచేస్తే ఈ మూడేళ్లలో 10శాతం కూడా పూర్తి చేయలేకపోయారని, పైగా జగన్‌ ఉచితంగా ఇల్లు ఇస్తాం అంటూ హామీ ఇచ్చి ఇప్పుడు లబ్ధిదారులపై రూ.8లక్షల భారం మోపారని నిమ్మల ఆరోపించారు. దీనిపై నిలదీస్తామనే ఉద్దేశంతోనే తమను వేదికపై నుంచి నెట్టివేశారని విమర్శించారు. గృహాల ప్రారంభోత్సవానికి సంబంధించిన శిలాఫలకంలోనూ తన పేరు చివరల్లో వేశారని, భీమవరంలో ఎమ్మెల్యే పేరు మంత్రి తర్వాత వేశారన్నారు. భీమవరంలో ఓ న్యాయం, పాలకొల్లులో ఒక న్యాయమా అని ప్రశ్నించారు. బాధ్యులైన అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. తమపై వైసీపీ మూకల దాడి, ప్రొటోకాల్‌ ఉల్లంఘనపై ప్రివిలేజ్‌ కమిటీకి ఫిర్యాదు చేస్తామన్నారు. కాగా, మధ్యాహ్నం 2.30నుంచి సాయంత్రం 7.30గంటల వరకు టీడీపీ నేతలు కలెక్టరేట్‌ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సోమవారం చర్యలు తీసుకుంటామని మూడువిడతలుగా జరిపిన చర్చల్లో కలెక్టర్‌ ప్రశాంతి హామీ ఇవ్వడంతో నేతలు నిరసన విరమించారు. 


Updated Date - 2022-08-06T09:05:45+05:30 IST