కాబోయే కలెక్టర్‌ని.. ఏ పనైనా చేసి పెడతా..

ABN , First Publish Date - 2022-06-27T06:00:31+05:30 IST

హిందూపురంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

కాబోయే కలెక్టర్‌ని.. ఏ పనైనా చేసి పెడతా..
దుండగుడు సయ్యద్‌ జావీద్‌

నమ్మించి, ఓ దుండగుడి మోసం

డబ్బు వసూలు చేసుకుని పరార్‌.. 

ఆలస్యంగా వెలుగులోకి..


‘కాబోయే కలెక్టర్‌ని..

మీ ఊరికి వస్తున్నా.. 

ఎలాంటి పనైనా చేసిపెడతా..

స్కూల్‌లో ఫ్రీగా సీటు ఇప్పిస్తా..

రైల్వే స్టేషనలో క్యాంటీన ఇప్పిస్తా..

అంటూ ఓపెన ఆఫర్లు ఇచ్చాడు..’

చెప్పినట్లే వచ్చాడు కూడా..

ఆ మాయ మాటలు నమ్మి

స్కూల్‌ సీటు కోసం రూ.10 వేలు..

బెంగళూరు రైల్వేస్టేషనలో క్యాంటీన కోసం రూ.20 వేలు ఇచ్చుకున్నారు..

అంతే.. ఆ డబ్బు తీసుకుని

అర్జెంట్‌ పని ఉందంటూ

దుండగుడు ఉడాయించాడు.

తర్వాత ఫోన కూడా పని చేయలేదు. దీంతో బాధితులు కంగుతిన్నారు.


   (హిందూపురం టౌన)

    హిందూపురంలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కర్ణాటక రాష్ట్రం హాసన జిల్లా జోగల్‌ దర్గాకు చెందిన ఓ వ్యక్తితో హిందూపురానికి చెందిన రఫీక్‌, శ్రీనివాసరెడ్డికి పరిచయం ఏర్పడింది. ఆ వ్యక్తితో పరిచయం ఉన్న హాసన జిల్లాకు చెందిన సయ్యద్‌ జావీద్‌.. రఫీక్‌, శ్రీనివాసరెడ్డికి ఈనెల 19న ఫోన చేశాడు. తాను కాబోయే కలెక్టర్‌ననీ, హిందూపురానికి వస్తున్నానన్నాడు. ఏ పనైనా పనులు చేయిస్తానన్నాడు. చెప్పిన విధంగానే ఈనెల 21న హిందూపురంలోని ఓ లాడ్జిలో దిగాడు. శ్రీనివాసరెడ్డి, రఫీక్‌ను అక్కడికి పిలిపించుకుని, పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఉచితంగా అడ్మిషన ఇప్పిస్తానంటూ రూ.10 వేలు, బెంగళూరు రైల్వేస్టేషనలో క్యాంటీన ఇప్పిస్తానని రూ.20వేలు తీసుకున్నాడు. తన తండ్రికి ఆరోగ్యం బాగోలేదనీ, అర్జెంట్‌గా వెళ్లాలంటూ అక్కడి నుంచి ఉడాయించాడు. తరువాత అతడి నంబరుకు ఫోన చేయగా స్విచాప్‌ వస్తున్నట్లు బాధితులు తెలిపారు. దుండగుడు.. మరి కొందరికి కూడా ఇలాగే మోసం చేశాడన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు. దుండగుడి వెంట ఓ మహిళ కూడా ఉన్నట్లు చెప్పారు.






Updated Date - 2022-06-27T06:00:31+05:30 IST