ఎట్టకేలకు ముగించారు..!

ABN , First Publish Date - 2020-10-24T11:58:43+05:30 IST

: టీచర్ల పదోన్నతుల ప్రక్రియను ఎట్టకేలకు శుక్రవారంతో ముగించారు. చివరి రెండ్రోజులు ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి పర్యవేక్షణలో ప్రక్రియ వేగంగా పూర్తయ్యింది.

ఎట్టకేలకు ముగించారు..!

చివరి రోజున ఎల్పీలు, 

డీఈవో ఫూల్‌ టీచర్ల నిరసన

నిబంధనలు, జీవోల మేరకే 

టీచర్లకు పదోన్నతులు: ఆర్జేడీ 


చిత్తూరు (సెంట్రల్‌), అక్టోబరు 23: టీచర్ల పదోన్నతుల ప్రక్రియను ఎట్టకేలకు శుక్రవారంతో ముగించారు. చివరి రెండ్రోజులు ఆర్జేడీ వెంకటకృష్ణారెడ్డి పర్యవేక్షణలో ప్రక్రియ వేగంగా పూర్తయ్యింది. స్కూల్‌ అసిస్టెంట్‌(ఎస్‌ఏ)ల నుంచి హెచ్‌ఎంలుగా, ఎస్జీటీల నుంచి ఎస్‌ఏలుగా, పీఈటీల నుంచి పీడీలుగా వివిధ సబ్జెక్టుల టీచర్లకు పదోన్నతుల లభించాయి. మొత్తం 436 మందికి పదోన్నతులు కల్పించారు. ఇందులో 69 మంది ప్రభుత్వ, 367 మంది జడ్పీ యాజమాన్యంలోని టీచర్లున్నారు. ఎస్‌ఏల నుంచి 47 మందికి హెచ్‌ఎంలుగా పదోన్నతులు కల్పించగా, ఎస్జీటీ సోషియల్‌ నుంచి 93 మందికి ఎస్‌ఏలుగా పదోన్నతి ఇచ్చారు. చివరి రోజున ఎస్జీటీ.. ఇంగ్లీష్‌, తెలుగు, ఫిజికల్‌ సైన్స్‌, బయలాజికల్‌ సైన్స్‌, మ్యాథ్స్‌, ఉర్దూ, తమిళం, తదితర 17 కేటగిరీల టీచర్లకు పదోన్నతులు లభించాయి.


కాగా.. సీనియారిటీ జాబితాలో తప్పులను ఆర్జేడీ రంగంలోకి దిగి సవరించారు. అయినా చివరి రోజున లాంగ్వేజ్‌ పండిట్‌ (ఎల్పీ)లు, డీఈవో పూల్‌లోని టీచర్లు నిరసనలకు దిగారు. ‘మా పోస్టులు మాకే కేటాయించాలి’ అని ఎల్పీలు కలెక్టర్‌ను ఆశ్రయించగా.. తమకు న్యాయం చేయాలని డీఈవో పూల్‌లోని టీచర్లు డిమాండ్‌ చేశారు. వీటిపై స్పందించిన ఆర్జేడీ మాట్లాడుతూ.. విద్యాశాఖ ఉత్తర్వులు, నిబంధనలు, జీవోలు, సడలింపులు, సవరణల ఆధారంగానే పదోన్నతులు ఇచ్చామన్నారు. ఎక్కడా కూడా వీటిని విస్మరించలేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. త్వరలో జరగనున్న బదిలీల తర్వాత ఏర్పడిన ఖాళీల్లో ప్రస్తుతం పదోన్నతులు పొందిన వారికి స్థానాలు కేటాయించనున్నారు. దీనిపై టీచర్లు పెద్ద సంఖ్యలో అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. తొలి రోజు నుంచి నాట్‌విల్లింగ్‌ ఇస్తూ వచ్చారు. వీరి స్థానాల్లో సీనియారిటీ జాబితాలో తదుపరి ఉన్నవారికి అవకాశమిచ్చారు. డీఈవో నరసింహారెడ్డి, ఏడీ పురుషోత్తం, విద్యాశాఖ సిబ్బంది, ఫ్యాప్టో సంఘ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ప్రకాష్‌, నాదముని, ఎస్టీయూ నాయకులు గంటా మోహన్‌, జగన్మోహన్‌, ఏపీటీఎఫ్‌ నాయకులు గోపినాథ్‌, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-24T11:58:43+05:30 IST