Abn logo
Jun 23 2021 @ 02:38AM

నచ్చినవారి మేలుకే సౌర టెండర్ల ప్రక్రియ!

ఇది కేంద్ర చట్టానికి విరుద్ధం..  ప్రజాధనంపై జాగ్రత్తగా ఉండాలి

ఈఆర్‌సీకి సమాంతరంగా మరో వ్యవస్థా?.. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు


  • విద్యుత్‌ కొనుగోలు ధరల నిర్ణయం.. అందులో మార్పుచేర్పులు రెగ్యులేటరీ కమిషన్‌ ఆమోదంతోనే జరగాలి. దానిని పక్కన పెట్టి మరో సమాంతర వ్యవస్థను రూపొందించడం చట్ట విరుద్ధం. 
  • రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఏర్పాటు చేసిన వివాద పరిష్కార వ్యవస్థ.. పక్షపాతానికి, తమకు కావలసిన వారికి మేలు చేయడానికి అవకాశం ఇస్తుంది.
  • కేంద్ర చట్టం, రెగ్యులేటరీ కమిషన్‌ జారీ చేసిన ఆదేశాల ప్రకారం విద్యుత్‌ కొనుగోళ్లు, అమ్మకాలు, సరఫరాకు కచ్చితంగా లైసెన్సు పొంది ఉండాలి. లైసెన్సు లేకుండా ఈ పనులు చేసే హక్కు లేదు. గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌కు ఎటువంటి లైసెన్సులు లేవు.

- హైకోర్టు


అమరావతి, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): నచ్చిన వారికి (బ్లూ ఐడ్‌ బాయిస్‌) మేలు చేయడం కోసం విద్యుత్‌ సరఫరా పథకంలో కొంత భాగాన్ని కేంద్ర చట్ట పరిధి నుంచి తప్పించకూడదని హైకోర్టు స్పష్టం చేసింది. ఇం దులో భారీగా ప్రజా ధనం ఇమిడి ఉందని గుర్తించాల ని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం పిలిచిన సౌర విద్యుత్‌ టెండర్ల ప్రక్రియ కేంద్ర ప్రభుత్వ చట్టానికి విరుద్ధంగా ఉందని  వ్యాఖ్యానించింది. అందుకే ఈ టెండర్లకు సం బంధించిన ఆసక్తి వ్యక్తీకరణ డాక్యుమెంటును. ముసాయిదా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందా(పీపీఏ)లను కొట్టివేస్తున్నామని తెలిపింది. టెండర్లను సవాల్‌ చేస్తూ టాటా విద్యుత్‌ సంస్థ దాఖలుచేసిన పిటిషన్‌పై ఈ నెల 17న వెలువరించిన ఈ తీర్పు ప్రతిని న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.గంగారావు మంగళవారం బహిర్గతపరిచారు. 70 పేజీలకు పైగా ఉన్న ఈ తీర్పు ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టింది. ‘విద్యుత్‌ వ్యవహారాలకు సంబంధించి కేంద్ర చట్టమే ఫైనల్‌. విద్యుత్‌ కొనుగోళ్లు, అమ్మకాల్లో ఆ చట్టమే పాటించాలి. సుప్రీంకోర్టు కూడా దాని ని రధువపరచింది. కానీ, రాష్ట్ర సౌర విద్యుత్‌ టెండర్ల డాక్యుమెంటు, ముసాయిదా పీపీఏలు ఈ చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి. రెగ్యులేటరీ కమిషన్‌ ను పక్కన పెట్టి మరో సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి వచ్చినా.. దానికీ రెగ్యులేటరీ కమిషన్‌ ఆమో దం కావలసిందే. ఇక్కడ ఆ ఆమోదం తీసుకోలేదు. కేం ద్ర చట్టానికి అనుగుణంగా లేనందువల్ల తర్వాత వచ్చే ప్రభుత్వాలు ఒప్పందాలను కొనసాగిస్తాయా అన్నది అనుమానమే. టెండర్ల ప్రక్రియలో ఎక్కువ మంది బిడ్డర్లు పాల్గొనే అవకాశం తగ్గిపోతోంది. అందుకే వీటి ని కొట్టివేస్తున్నాం’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు. విద్యుత్‌ కొనుగోలు ధరల్లో మార్పుచేర్పులను పరస్పర సంప్రదింపులతోనో లేదా అధికారుల కమిటీ మధ్యవర్తిత్వంతోనే నిర్ణయించుకోవచ్చని పేర్కొనడం కేంద్ర చట్టానికి విరుద్ధమని టాటా సంస్థ చేసిన వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు.


తెలివైన పదాలు వాడినా..

విద్యుత్‌ ‘సరఫరా’ చేస్తే తమకు కేంద్ర చట్టం వర్తిస్తుందని, తాము కేవలం విద్యుత్‌ ‘అందుబాటులోకి తేవడం’ చేస్తున్నాం కాబట్టి ఆ చట్టం తమకు వర్తించదని టెండర్లు పిలిచిన సంస్థ గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌ చేసిన వాదనను కోర్టు తిరస్కరించింది. ఎంత తెలివైన పదాలు వాడినా పార్లమెంటు చేసిన చట్టాన్ని అతిక్రమించలేరని వ్యాఖ్యానించింది. ‘టెండర్‌ డాక్యుమెంటు లో సరఫరా అన్న పదమే వాడారు. లైసెన్స్‌ లేకుండా సరఫరా చేయకూడదు. రైతులకు ఇచ్చే సబ్సిడీ కేంద్ర చట్టం కిందకే వస్తుంది. రైతులకు ఉచిత విద్యుత్‌ ఇవ్వాలంటే వారికి ఆ విద్యుత్‌ సరఫరా చేసే పంపిణీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చెల్లింపులు చేయాలని కేంద్ర చట్టం ఆదేశిస్తోంది. తాము చేస్తోంది సరఫరా కాదని.. అందుబాటులోకి తేవడం మాత్రమేనని చేసిన వాదన తప్పు’ అని కోర్టు పేర్కొంది. రైతులకు తొమ్మిది గంటల ఉచిత విద్యుత్‌ సరఫరా పేరుతో వ్యూహాత్మకంగా ఈ పఽథకాన్ని రూ పొందించి విద్యుదుత్పత్తి, సరఫరా, కొనుగోళ్లు, చెల్లింపులు, ఉత్పత్తిదారు లు.. కేంద్ర చట్టం, రెగ్యులేటరీ కమిషన్‌ పరిధిలోకి రాకుండా చేశారని, ఇది అర్థం లేనిదని(ఎక్స్‌ట్రీనియస్‌ కన్సిడరేషన్స్‌) వ్యాఖ్యానించింది. రెగ్యులేటరీ కమిషన్‌ విధులకు ప్రభుత్వం దూరంగా ఉండాలని కేంద్ర  చట్టం చెబుతోందని, కానీ రాష్ట్ర టెండర్ల విషయంలో రెగ్యులేటరీ కమిషన్‌ స్థానంలోకి ప్రభుత్వం వస్తోంద ని.. ఇది చట్ట స్ఫూర్తికి విరుద్ధమని తెలిపింది.  


పరస్పర విరుద్ధంగా..

టెండర్లకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో అనేక పరస్పర విరుద్ధ అంశాలు చోటు చేసుకున్నాయని కోర్టు తెలిపింది. ‘గత ఏడాది జూన్‌లో జారీ చేసిన జీవో 18లో డిస్కం సంస్థలు ఈ ప్రక్రియకు రెగ్యులేటరీ కమిషన్‌ ఆమోదం తీసుకోవాలని ఆదేశించారు. తర్వాత ఈ కోర్టులో దాఖలు చేసిన కౌంటర్‌ అఫిడవిట్‌లో టెండర్ల ప్రక్రియ కేంద్ర చట్టం పరిధిలోకి రాదు కాబట్టి రెగ్యులేటరీ కమిషన్‌ అనుమతి అవసరం లేదని పేర్కొన్నారు. ఇదే టెండర్ల డాక్యుమెంటులో ఒక చోట కేంద్ర చట్ట నిబంధనలకు లోబడి పోటీ మార్గదర్శకాలను తయారు చేశామని రాశారు. తమ ప్రక్రియ రెగ్యులేటరీ కమిషన్‌ పరిధిలోకి రాదని కోర్టులో వాదించారు. టెండర్‌ డాక్యుమెంటులో కొన్ని చోట్ల రెగ్యులేటరీ కమిషన్‌ ఆదేశం ప్రకారం వ్యవహరించాలని పేర్కొన్నారు’ అని ప్రస్తావించింది. టెండర్లు పిలిచిన గ్రీన్‌ ఎనర్జీ కార్పొరేషన్‌కు ఆ అర్హత లేదని కోర్టు స్పష్టం చేసింది. ‘విద్యుత్‌ సరఫరాకు గానీ.. ట్రేడింగ్‌కు గానీ ఆ సంస్థ లైసెన్సులు పొందలేదు. ఉత్పత్తిదారుల వద్ద విద్యుత్‌ తీసుకుని రైతులకు దానిని అందుబాటులోకి తెస్తున్నామని ఈ సంస్థ చేసిన వాదన చట్ట ప్రకారం నిలవదు. ప్రభుత్వం వద్ద డబ్బు తీసుకుని ఉత్పత్తిదారులకు ఈ సంస్థ చెల్లింపులు చేస్తోంది. డిస్కంలు, ట్రాన్స్‌కో లైన్ల ద్వారా విద్యుత్‌ సరఫరా జరుగుతోంది. వీటికి లైసెన్సు కావలసిందే’ అని కోర్టు స్పష్టం చేసింది. కావాలంటే కేంద్ర చట్ట నిబంధనలకు లోబడి మళ్లీ టెండర్లు పిలుచుకోవచ్చని తెలిపింది.