ఓటుకు ఆధార్‌

ABN , First Publish Date - 2022-07-31T05:46:09+05:30 IST

ఓటు కార్డుకు ఆధార్‌ నెంబరును అనుసంధానం చేసే ప్రక్రియ ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం ఆగస్టు 4 నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది.

ఓటుకు ఆధార్‌

   నాలుగు నుంచి అనుసంధానం ప్రక్రియ 

దొంగ ఓట్లకు చెక్‌

(పార్వతీపురం - ఆంధ్రజ్యోతి)

 ఓటు కార్డుకు ఆధార్‌ నెంబరును అనుసంధానం చేసే ప్రక్రియ ప్రారంభం కానుంది. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం ఆగస్టు 4 నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి బీఎల్‌వోలకు బాధ్యతలు అప్పగిస్తూ ఎలక్షన్‌ కమిషన్‌ ఆదేశాలు జారీచేసింది. వచ్చే ఏడాది మార్చి 31లోగా పూర్తిచేయాలని స్పష్టం చేసింది. జిల్లాలో బూత్‌లెవల్‌ అధికారులు  క్షేత్రస్థాయిలో ఇంటింటికీ వెళ్లి ఆఽధార్‌తో ఓటరుకార్డు అనుసంధానం చేయనున్నారు. ఆన్‌లైన్‌లో కూడా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫారం-6బీ ద్వారా ఆధార్‌ లింకైన వెంటనే మొబైల్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ నమోదు చేయగానే అథంటికేషన్‌ ద్వారా అనుసంధానించవచ్చు. ఆధార్‌ అనుసంధానం వల్ల దొంగ ఓట్లు, ఒకే వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉండడం వంటి వాటికి చెక్‌ పడనుంది. ఇక పోలింగ్‌ సమయంలో ఘర్షణలకు తావుండదు. 

జిల్లాలో ఓటర్లు ఇలా... 

జిల్లాలోని పాలకొండ నియోజకవర్గంలో 283 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వాటి పరిధిలో పురుష ఓటర్లు 97,410, మహిళా ఓటర్లు 1,01,760 మంది, ఇతరులు 9 మంది, సర్వీస్‌ ఓటర్లు 602 మంది, ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు ముగ్గురు ఉన్నారు. కురుపాంలో 268 పోలింగ్‌ కేంద్రాలు,  93,633 మంది పురుష ఓటర్లు, 98.410 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 37 మంది ఉన్నారు. పార్వతీపురం నియోజకవర్గం పరిధిలో మొత్తం ఓటర్లు 1,88,554 మంది ఉన్నారు. పురుష ఓటర్లు 92,832 మంది, మహిళా ఓటర్లు 95,708 మంది, ఇతరులు 14 మంది ఉన్నారు. సాలూరు నియోజకవర్గంలో 1,99,806 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో పురుష ఓటర్లు 97,461 మంది, 1,02,341 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. కాగా జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో ప్రతి ఒక్క ఓటును ఆధార్‌తో అనుసంధానం చేయనున్నారు. కొత్తగా ఓటు హక్కు కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. కొంతమందికి రెండు ప్రాంతాల్లో ఓట్లు ఉంటే ఏదో ఒక ప్రాంతంలో ఓటు హక్కును ఉంచి మరొక ప్రాంతంలో తొలగిస్తారు.

షెడ్యూల్‌ ప్రకారం ..  

జిల్లాలో ఓటుకు ఆధార్‌ అనుసంధానం కార్యక్రమాన్ని షెడ్యూల్‌ ప్రకారం ప్రారంభించి పూర్తి చేస్తాం.   ఈ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు ప్రజలు సహకరించాలి. కేంద్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల ప్రకారం మరణాలు, డబుల్‌ ఎంట్రీలు ఉంటే వాటిని తొలగిస్తాం. 

- నిశాంత్‌కుమార్‌, కలెక్టర్‌, పార్వతీపురం


Updated Date - 2022-07-31T05:46:09+05:30 IST