గురువులు ఎక్కడ?

ABN , First Publish Date - 2022-01-17T04:54:48+05:30 IST

జిల్లాలోని కస్తూర్భా బాలికా విద్యాకేంద్రాలు (కేజీబీవీ)లో బోధనా సిబ్బంది భర్తీ ప్రక్రియ కొలిక్కి రాలేదు. తగినంతమంది గురువులు లేక రెండేళ్లుగా బోధన సక్రమంగా సాగడంలేదు. ఉన్నవారితోనే సర్దుబాటు చేసి మమ అన్పిస్తున్నారు.

గురువులు ఎక్కడ?
ఇచ్ఛాపురంలో కసూర్భా గాంధీ బాలికా విద్యాలయం

- కేజీబీవీల్లో కొలిక్కిరాని ఖాళీల భర్తీ

- ఆందోళన చెందుతున్న విద్యార్థులు

(ఇచ్ఛాపురం రూరల్‌)

జిల్లాలోని కస్తూర్భా బాలికా విద్యాకేంద్రాలు (కేజీబీవీ)లో బోధనా సిబ్బంది భర్తీ ప్రక్రియ కొలిక్కి రాలేదు. తగినంతమంది గురువులు లేక రెండేళ్లుగా బోధన సక్రమంగా సాగడంలేదు. ఉన్నవారితోనే సర్దుబాటు చేసి మమ అన్పిస్తున్నారు. ఔట్‌సోర్సింగ్‌ విధానంలో ఖాళీ పోస్టులను భర్తీ చేసేందుకు ప్రభుత్వం గత నెలలో నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఈ మేరకు అధికారులు జిల్లా సమగ్ర శిక్ష ద్వారా దరఖాస్తుల స్వీకరణ, మెరిట్‌ జాబితా తయారీ పూర్తిచేశారు. గత నెల 28 నాటికి ఉద్యోగాలకు ఎంపికైనవారికి ఉత్తర్వులు ఇస్తారని భావించారు. పీఈటీ పోస్టుల అర్హత విషయంలో మెలిక పడింది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం టెట్‌ రాసిన వారు వీటికి అర్హులు. 2018 తరువాత ఇది జరగలేదు. దీని వల్ల దరఖాస్తుదారుల్లో టెట్‌ రాయని వారందరినీ అనర్హుల జాబితాలో చేర్చారు. దీంతో అభ్యర్థులు విద్యాశాఖ ఉన్నతాధికారులను కలిశారు. టెట్‌ నిర్వహించకపోవడం వల్ల రాయలేదని, తమ దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. ఈ మేరకు వారి పేర్లు కూడా చేర్చారు. ఆ విధంగా కొన్ని రోజులు జాప్యమైంది. ఈ నెల 3న రోస్టర్‌ ప్రకారం ఎంపిక జాబితా విడుదల చేయాలని ఆదేశాలిచ్చారు. అంతా సిద్ధం చేశాక ఎస్‌పీడీ కార్యాలయం నుంచి తాము చెప్పిన తరువాతే ప్రకటించాలని ఆదేశాలొచ్చాయి. ఇక ప్రభుత్వానికి మరికొన్ని వినతులూ వెళ్లాయి. బ్యాక్‌లాగ్‌ పోస్టులు రోస్టర్‌ ప్రకారం ఇవ్వాలని అందులో కోరారు. ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌లో మాత్రం జనరల్‌ రోస్టర్‌ అనుసరించాలని పేర్కొంది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది చూడాల్సి ఉంది.


జిల్లాలో ఖాళీలు ఇలా.. 

జిల్లాలో 32 కస్తూర్భా విద్యాలయాల్లో పీజీటీలు 29, ఒకేషనల్‌ పోస్టులు 11, ఎస్‌వోలు 11, సీఆర్‌టీలు 35 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇవ్వగా 8008 మంది ధరఖాస్తులు చేసుకున్నారు. ప్రస్తుతం ఎస్‌ఏ-1 పరీక్షలకు షెడ్యూలు ప్రకటించారు. మరో రెండు నెలల్లో ఇంటర్‌ విద్యార్థులకు ప్రయోగ పరీక్షలు, తరువాత పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. ఫిబ్రవరి నాటికి సిలబస్‌ పూర్తి చేయాలి. ప్రస్తుతం 60 నుంచి 70 శాతం మధ్య సిలబస్‌ పూర్తయినట్లు సమాచారం. పోస్టుల భర్తీలో జాప్యమయ్యే కొద్దీ విద్యార్థులకు ఇబ్బందులు తప్పవు. ఇప్పటికైనా త్వరగా పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు.


జాబితా సిద్ధం 

కస్తూర్భా బాలికల విద్యాలయాల్లో ఖాళీ పోస్టులకు సంబంధించి జాబితా సిద్ధం చేశాం. ఎస్‌పీడీ కార్యాలయం నుంచి ఇంకా ఎటువంటి ఉత్తర్వులు రాలేదు. ఆదేశాలు వచ్చిన వెంటనే మెరిట్‌ కం రోస్టర్‌ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తాం.

- రోణింకి.జయప్రకాష్‌, ఏపీసీ, ఎస్‌ఎస్‌ఏ

Updated Date - 2022-01-17T04:54:48+05:30 IST