సమాచార లోపంతోనే సమస్య

ABN , First Publish Date - 2022-08-19T08:19:24+05:30 IST

మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అసహనానికి గురయ్యారు.

సమాచార లోపంతోనే సమస్య

అందుకే సంఘాలతో సమావేశం: బొత్స  

‘ఆంధ్రజ్యోతి’పై మంత్రి అసహనం 

 అమరావతి, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్ర అసహనానికి గురయ్యారు. విద్యాశాఖలో వరుస వైఫల్యాలను కప్పిపుచ్చుకునే క్రమంలో విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు. ఉపాధ్యాయ సంఘాలతో చర్చల అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ హాజరు విషయంలో అధికారులు, టీచర్లకు మధ్య సమాచార లోపం ఏర్పడిందని, దానిని సరిదిద్దేందుకే తాను ఈ సమావేశం నిర్వహించినట్లు చెప్పారు. అయితే విద్యాశాఖలో ప్రతి విషయంలోనూ గ్యాప్‌ కనిపిస్తోందని, ఒకసారి నిర్ణయం తీసుకోవడం... వెనక్కి తగ్గడం తరచూ తలెత్తుతున్నాయని, ప్రతిసారీ ఇలా ఎందుకు జరుగుతోందని ప్రశ్నించగా... ఒక్కసారిగా తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రశ్న అడిగిన విలేకరిని ఏ సంస్థ అని ప్రశ్నించారు. ‘ఆంధ్రజ్యోతి’ అని చెప్పగానే మరింత అసహనం ప్రదర్శించారు. ‘ఎందుకు వచ్చిందో... ఉపాధ్యాయులు అర్థం చేసుకోలేకపోయారో ఏంటో.... లేకపోతే ‘ఆంధ్రజ్యోతి’కే కమ్యూనికేషన్‌ గ్యాప్‌ వచ్చిందేమో’ అంటూ సంబంధం లేదని సమాధానం చెప్పారు. 


‘గ్యాప్‌ వచ్చిందని ఇప్పుడు మీరే చెప్పారుగా’ అని ప్రశ్నించినా ‘అవును వచ్చిందనే చెబుతున్నా. దాన్ని పెద్ద ఇష్యూ చేయాలని చూస్తున్నారు’ అని అంతకుముందు ఆయన చెప్పినదానికి విరుద్ధంగా మాట్లాడారు.‘పాఠశాలల విలీనం, బాలికల కళాశాలల్లో కొన్నింటి విషయంలోనూ ఇలాగే వెనకడుగు వేశారు కదా’ అని ప్రశ్నించగా... మొదట విలీనంపై వెనకడుగు వేయలేదని చెప్పిన ఆయన తర్వాత ప్రజా ప్రతినిధుల నుంచి అభ్యంతరాలు వస్తే మార్చామంటూ పరస్పర విరుద్ధంగా మాట్లాడారు. అసలు ‘ఆంధ్రజ్యోతి’కి సమాధానమే చెప్పనన్నారు. అనంతరం వేసిన పలు  ప్రశ్నలకు స్పందించలేదు. గతంలోనూ తరగతుల విలీనం సమయంలో ఉపాధ్యాయ సంఘాలతో పలు దఫాలుగా సమావేశాలు నిర్వహించి అనేక హామీలు ఇచ్చారు. చివరికి రెండుహామీలపైనే ఉత్తర్వులొచ్చాయి. దీంతో మంత్రి హామీలకు ప్రాధాన్యం లేదని సంఘాలు ఒక అంచనాకు వచ్చాయి. ఆయన ఇచ్చే హామీలపై జీవోలు రావని టీచర్లు అభిప్రాయపడుతున్నారు. దీనిపై ఇటీవల ప్రశ్నించగా... విలేకరుల మనసులో దురాలోచన ఉం దేమోనంటూ ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు.

Updated Date - 2022-08-19T08:19:24+05:30 IST