ఎలాబతకాలి ఈశ్వరా..!

ABN , First Publish Date - 2021-12-04T05:21:12+05:30 IST

ఈశ్వరుని జఠాజూటం(కొప్పు)లో గంగమ్మ ఉంటుందంటారు. అటువంటి గంగమ్మ ఉప్పొంగి ఏకంగా పరమశివుడే కొట్టుకుపోయాడు. శి

ఎలాబతకాలి ఈశ్వరా..!
వరదలో 9 మందిని పోగొట్టుకున్న శివాలయం పూజారి తంబళ్ల కుటుంబ సభ్యులు దిగులుగా కూర్చున్న దృశ్యం

కన్నీటిని దిగమింగుకుంటూ పూజారి కుటుంబం

రాజంపేట, డిసెంబరు3 : ఈశ్వరుని జఠాజూటం(కొప్పు)లో గంగమ్మ ఉంటుందంటారు. అటువంటి గంగమ్మ ఉప్పొంగి ఏకంగా పరమశివుడే కొట్టుకుపోయాడు. శివుడు కొలువు దీరిన పాలేశ్వరాలయమే పూర్తిగా గంగలో కలిసిపోయింది. నిత్యం పూజలు అందుకునే శివుని ఆవాసం నేడు బండరాళ్లకు నిలయమై వెక్కిరిస్తోంది. ఎప్పుడూ శివుని సేవలో తరంచిన పూజారి కుటుంబంలో ఏకంగా 9 మంది శివాలయం, శివలింగంతో పాటు గంగలో కలిసిపోయారు. వందలాది ఏళ్లుగా కార్తీక మాసంలో శివనామస్మరణతో మార్మోగే పాలేశ్వరాలయం నేడు నామరూపాల్లేకుండా పోయింది. కేవలం ఒకే ఒక్క సుబ్రమణ్యస్వామి గోపురం తప్ప అన్నీ కొట్టుకుపోయాయి. అయినా కొందరొచ్చి అక్కడున్న ఆ రాళ్లకే మొక్కుకొని పోతున్నారు. దేవ దేవా... నీ ఆలయానికి, నీకే దిక్కులేనప్పుడు ఇక మాకు దిక్కెవరని భక్తులు బాధపడుతున్నారు. నిత్యం నిన్ను కొలిచే పూజారి కుటుంబానికి ఎందుకింత విషాదం మిగిలించావని దేవున్ని కన్నీటితో ప్రశ్నిస్తున్నారు. ఈ చుట్టుపక్కల గ్రామాలు తంబళ్ల పూజారి కుటుంబానికి తమ బాధలు చెప్పుకునేవారు. స్వామికి పూజాపునస్కారాలతో వారి బాధలను వీరు తీర్చేవారు. అటువంటి కుటుంబాన్ని నేడు అదే భక్తులు ఓదార్చాల్సిన దుస్థితి వచ్చింది. ఈ విధ్వంసం జరిగి ఇప్పటికి 15 రోజులు దాటింది. ఆలయంలో 9 మందిని పోగొట్టుకున్న పూజారి కుటుంబాన్ని ఆంధ్రజ్యోతి పలకరించింది. వారిని ఇంకా ఆనాటి విషాదం వెంటాడుతోంది. గంగలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన వారి జ్ఞాపకాలే వారిని వెంబడిస్తున్నాయి. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం, ముఖ్యమంత్రి ఓదార్పు, దాతల సహాయాలు వారి కన్నీటిని మాన్పడం లేదు. వారిని కదిలిస్తే తామెందుకు బతికున్నామన్న వేదన తప్ప వారిలో ఏమీ కనిపించడం లేదు. ఉన్న ఇల్లు కూడా పాడవ్వడంతో పక్కనున్న ఓ చిన్నపాటి గదిలో ఉన్నారు. నిద్రపోదామన్నా కుదరడం లేదని, పోయిన వారే గుర్తొస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


మిగిలిన వారి కోసం బతికున్నా

- కొర్రపాటి రామమూర్తి, పూజారి కుటుంబ పెద్ద

పోయినోళ్లు ఒకెత్తయితే.. మిగిలినోళ్లకోసమన్నా బతకాలని బతికున్నా.. ఇద్దరు కోడళ్లు, ఒక కూతురు, ఆరుగురు మనవళ్లు, మనవరాళ్లు పోయారు. అయినా నేను కుటుంబ పెద్దను. నేనే ఏదైనా చేసుకుంటే మిగిలిన కుటుంబమంతా ఏమైపోతుంది.. భార్య, ముగ్గురు బిడ్డలను కోల్పోయిన ఒక కొడుకు.. భార్యను బిడ్డను కోల్పోయిన మరోకొడుకు, నా భార్య కోసం బతకాల్సి వస్తోంది. లేకపోతే ఈ బతుకు అవసరం లేదు. పెద్దోన్ని కనుక చిన్నోళ్లను మరింత క్షోభపెట్టలేక గుండె నిబ్బరం చేసుకొని పైకి ధైర్యంగా కనిపిస్తున్నా. బతకలేక బతుకుతున్నా.

 

నలుగురిని పొగొట్టుకొని నేను బతికేం ఉపయోగం..

- గిరిప్రసాద్‌, పూజారి, శ్రీ పాలేశ్వరాలయం

దేవున్ని పూజించడానికి వెళ్లిన నా కుటుంబమంతా ఏటిపాలైతే నేను బతికేం ఉపయోగం. 15 రోజులుగా ఎంత కళ్లు మూసుకుందామనుకున్నా నిద్ర రావడం లేదు. ఎప్పుడూ దైవచింతనలో ఉండే మేము.. ఇలా అనాధలవుతామని అనుకోలేదు. మా ఇంటిలో 9 మంది చనిపోతే అందులో నా భార్యతో పాటు నా ముగ్గురు సంతానం నీటిలో కొట్టుకుపోయారు. నా తమ్ముడి భార్య, బిడ్డ కొట్టుకొనిపోయారు. నా అక్కతో పాటు ఆమె బిడ్డ కొట్టుకుపోయారు. ఇంతమందిని పోగొట్టుకున్న నేను ఇంక ఎవరికోసం బతకాల..?


కొట్టుకొని పోయినవారే నాకు కనిపిస్తా ఉన్నారు 

- కొర్రపాటి హేమంతకుమార్‌, వరదలో బయటపడ్డ పూజారి కుటుంబ బిడ్డ

నా ముందర కొట్టుకుపోయిన మా అమ్మ, పిన్నమ్మ, మా తమ్ముడు, అక్కచెల్లెళ్లు, మా అత్త, బిడ్డలు కనిపిస్తా ఉన్నారు. గడ్డివామి మీద పడి రెండు కిలోమీటర్లు కొట్టుకుపోయి  బయటపడినాను. అక్కడున్నోళ్లు నాకు బట్టలు తొడిగించి చేరదీసినారు. కళ్లు తెరిచినా, మూసినా నా ముందు కొట్టుకుపోయినోళ్లే కనిపిస్తావున్నారు. ఇటు రోజూ నిద్రలేకుండా బాధపడే మా నాన్న, చిన్నాన్న, తాత, అవ్వల బాధను చూడలేకపోతున్నా.. ఎటు చూసినా బాధే కనిపిస్తావుంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. మా పెద్దోళ్ల బాధను చూసి నరకం అనుభవిస్తా ఉన్నాను.


పిడస దిగడం లేదు

- కొర్రపాటి చెంగమ్మ, పూజారి కుటుంబ పెద్ద

ఇంటికి పెద్దలమైన నా భర్త రామ్మూర్తి, నేను ఈ బాధలు భరించలేకున్నాం. పోయినోళ్ల గురించి తలుచుకుంటే పిడస తినడానికి కూడా బుద్దిపుట్టడం లేదు. తినాలన్నా వాంతికి వస్తావుంది. చాలా ఇబ్బందిగా ఉంది. వారిని తలుచుకొని మేము పడుతున్న బాధ పరులకు కూడా వద్దు. బతికున్న నా బిడ్డలు, కొట్టుకుపోయిన వారి భార్య, బిడ్డలను తలుచుకొని వెక్కివెక్కి ఏడుస్తున్నారు. మాకు ప్రతి రాత్రి కాళరాత్రిగానే కనిపిస్తావుంది. అస్సలు మేము కుదుటపడతామా అన్న నమ్మకం లేదు.


ఏ మనిషికీ రాకూడని బాధ

- కొర్రపాటి మల్లికార్జున, పూజారి కుటుంబీకుడు

ఎప్పుడూ శివనామస్మరణతో పాలేశ్వరుని సేవలో తరించే మేము ఇలా పాడైపోతామని అనుకోలేదు. నా భార్య, బిడ్డ పోయారు. నా తమ్ముని భార్యతో పాటు ముగ్గురు బిడ్డలు పోయారు. మా అక్క, వారి బిడ్డలు పోయారు. అందరూ పోయారు. ఉన్న ఇల్లు కూడా పాడైపోయి ఈ చిన్న ఇంటిలో తలదాచుకుంటున్నాం. జీవచ్ఛవంలా కాలం గడుపుతున్నాం. ఎవరికోసం ఈ జీవనం సాగిస్తున్నామో మాకే తెలియడం లేదు. ఈ బాధ భరించలేనిది. ఏ మనిషికీ రాకూడనిది.

Updated Date - 2021-12-04T05:21:12+05:30 IST