ఎరువు..దరువు!

ABN , First Publish Date - 2022-08-18T04:21:01+05:30 IST

ఎరువుల ధరల స్థిరీకరణ అంటూ లేదు. గత ఏడాదితో పోల్చుకుంటే భారీగా వ్యత్యాసం కనిపిస్తోంది. 50 శాతానికిపైగా పెరిగిన ఎరువులు ఉన్నాయి. అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరల పెరుగుదలను సాకుగా చూపి సంబంధిత కంపెనీలు ఎరువుల ధరలు పెంచుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుండడంతో సంబంధిత కంపెనీలే ధరలను నిర్ణయిస్తున్నాయి. ఇటీవల ప్రకటించిన ధర

ఎరువు..దరువు!

అమాంతం పెరిగిన ధరలు

పొటాష్‌ రూ.700, డీఏపీ రూ.150 దాకా పెంపు

కాంప్లెక్స్‌ రూ.150 నుంచి రూ.300 వరకూ బాదుడు

ఆందోళనలో రైతులు

(టెక్కలి)

రైతు పండించిన పంటకు మద్దతు ధర దక్కడం లేదు. ముందు ఏడాది ఉన్న ధర కూడా పలకడం లేదు. కానీ సాగుకు సంబంధించి విత్తనాల నుంచి ఎరువుల దాకా మాత్రం ధరలు అమాంతం పెరుగుతున్నాయి. ముందు ఏడాదితో పోల్చుకుంటే 50 శాతానికిపైగా పెరుగుతున్నాయి. వ్యయప్రయాలసలకోర్చి పండించిన పంటుకు మాత్రం గిట్టుబాటు ధర దక్కడం లేదు. ప్రధానంగా ఎరువుల ధరల్లో భారీగా వ్యత్యాసం కనబడుతోంది. రైతుకు అందనంత దూరంలో ధరలు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. 

ఎరువుల ధరల స్థిరీకరణ అంటూ లేదు. గత ఏడాదితో పోల్చుకుంటే భారీగా వ్యత్యాసం కనిపిస్తోంది. 50 శాతానికిపైగా పెరిగిన ఎరువులు ఉన్నాయి. అంతర్జాతీయంగా ముడి సరుకుల ధరల పెరుగుదలను సాకుగా చూపి సంబంధిత కంపెనీలు ఎరువుల ధరలు పెంచుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తుండడంతో సంబంధిత కంపెనీలే ధరలను నిర్ణయిస్తున్నాయి. ఇటీవల ప్రకటించిన ధరలు విస్మయపరుస్తున్నాయి.  ఒకటీ, రెండు కంపెనీలు మినహా మిగతావన్నీ ఎమ్మార్పీ ధరలను పెంచాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాగు పెట్టుబడులు పెరుగుతున్న తరుణంలో ఎరువుల ధర పెరుగుదలతో ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు. 

 ఇదీ పరిస్థితి

వరి సాగులో పొటాష్‌ కీలకం. కానీ పొటాష్‌ బస్తా ఏకంగా రూ.700 వరకూ పెరిగింది.  కాంప్లెక్స్‌ ఎరువు అయితే రూ.150 నుంచి రూ.300 దాకా పెంచారు. అమ్మోనియం సల్ఫేట్‌ రూ.270, డీఏపీ రూ.150, సింగల్‌ సూపర్‌ ఫాస్ఫేట్‌ రూ.125 చొప్పున ధరలు పెరిగాయి. కొన్ని కంపెనీల ధరల్లో బస్తాకు రూ.50 దాకా వ్యత్యాసం ఉన్నా... రవాణా, ఇతరత్రా ఖర్చులు సాకుగా చూపి ధరలు పెంచి అమ్ముతున్నారు. అయితే యూరియా విషయంలో కాస్త ఉపశమనం. 50 కిలోల బస్తా రూ.266గా ఉంది. కానీ ఏటా ఖరీఫ్‌లో డిమాండ్‌ ఉన్నప్పుడు మాత్రం వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి రూ.350 వరకూ విక్రయిస్తున్నారు.   డీఏపీపై రాయితీ ఉన్నా.. ఇప్పుడు కాంప్లెక్స్‌ ఎరువుతో సమానంగానే ధర పలుకుతోంది. డీఏపీ బస్తా రూ.1,350 అమ్మాల్సి ఉండగా రూ.1,500 చొప్పున అమ్ముతున్నారు. మన జిల్లాలో ఎక్కువగా కాంప్లెక్స్‌ ఎరువులనే వినియోగిస్తుంటారు. 

 ప్రస్తుతం కీలకం..

జిల్లాలో వరి సాగు లక్ష్యం 1.65 లక్షల హెక్టార్లు. ఈ ఏడాది రైతులు ముందుగానే ఎదలు చల్లుకున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఉబాలు పూర్తిచేశారు. తొలి విడతగా ఎరువులు చల్లుతారు. ప్రస్తుతం ఎరువులు చాలా అవసరం. అటు ప్రైవేటు డీలర్లతో పాటు రైతుభరోసా కేంద్రాల ద్వారా ఇండెంట్‌ సైతం పెట్టారు.  ఎనిమిదివేల మెట్రిక్‌టన్నుల పొటాష్‌, 16వేల మెట్రిక్‌టన్నుల డీఏపీ, సుమారు నాలుగువేల మెట్రిక్‌టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులను అవసరమని అధికారులు చెబుతున్నారు. అయితే తాజా ఎరువుల ధర పెరుగుదలతో రూ.19.52 కోట్ల అదనపు భారం రైతులపై పడనుంది. ఒక్క పొటాష్‌పైనే రూ.12.80 కోట్లు, డీఏపీపై రూ.4.80 కోట్లు, కాంప్లెక్స్‌ ఎరువులపై రూ.1.92 కోట్ల భారం పడనుంది.  ఒక్క యూరియా మినహా మిగిలిన అన్నిరకాల ఎరువులపై ధర పెరిగింది. 

గందరగోళం

ఎరువుల సరఫరా విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రైతుభరోసా కేంద్రాల ద్వారా ఎరువులు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించడమే ఇందుకు కారణం. ఎరువుల కంపెనీలు ప్రైవేటు డీలర్లతో పాటు ఆర్బీకేలకు ఎరువులు అందించాలి. దీంతో తమకు అందకుండా ప్రభుత్వం అడ్డుకుంటోందని డీలర్లు ఆరోపిస్తున్నారు. అలాగని రైతుభరోసా కేంద్రాల్లో కూడా పూర్తిస్థాయిలో ఎరువుల లభ్యత లేదు. గత ఏడాది సకాలంలో ఎరువులు అందక జిల్లాలో చాలా మండలాలకు చెందిన రైతులు అవస్థలు పడ్డారు. ప్రైవేటు డీలర్ల వద్ద కొనుగోలు చేస్తామంటే దొరకలేదు. దీంతో పంటలకు సైతం నష్టం జరిగింది. రైతులంతా సొమ్ము ముందుగా జమ కడితే కానీ తెప్పించలేమని అప్పట్లో రైతుభరోసా కేంద్రం సిబ్బంది చేతులెత్తేశారు. 

దారుణం

గత ఏడాది కంటే ఎరువుల ధర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే సాగు భారంగా మారింది. ఈ తరుణంలో ఎరువుల ధరను తగ్గించాల్సింది పోయి పెంచడం దారుణం. కేంద్ర ప్రభుత్వం సైతం పట్టించుకోకపోవడం అన్యాయం. ఎరువుల ధర పెరిగినంతగా.. ధాన్యానికి గిట్టుబాటు ధర కల్పించకపోవడం శోచనీయం. ఎకరాకు ఎరువు రూపంలో రూ.4 వేల అదనపు భారం పడుతోంది. 

-పోలాకి షన్ముఖరావు, రైతు, నర్సింగపల్లి 

సాగు ఖర్చు అధికం

నాకు మూడు ఎకరాల భూమి ఉంది. పెరిగిన ఎరువుల ధరతో రూ.10 వేలు సాగు ఖర్చు పెరిగింది. గత ఏడాది రైతుభరోసా కేంద్రాల ద్వారా సక్రమంగా ఎరువులు అందలేదు. ఇప్పటికే సాగు పెట్టుబడులతో వ్యయప్రయాసలకు గురవుతున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి ఎరువుల ధరలను నియంత్రించాలి. 

- రట్టి కామరాజు, రైతు, నర్సింగపల్లి 


కొరత లేకుండా చూస్తాం

గత ఏడాదిని పోల్చిచూస్తే ఈ ఏడాది ఎరువుల ధర పెరుగుదల వాస్తవమే. డీఏపీ, కాంప్లెక్స్‌ వంటి ఎరువులపై కూడా కొంతమేర ధరలు పెరిగాయి. యూరియా ధర నిలకడగా ఉండడం ఉపశమనం.అయినా జిల్లాలో రైతులకు ఇబ్బంది లేకుండా ఎరువులు అందిస్తాం. రైతుభరోసా కేంద్రాల ద్వారా అందిస్తున్న ఎరువులను రైతులు సద్వినియోగం చేసుకోవాలి. 

- బీవీ తిరుమలరావు, వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు, టెక్కలి 



Updated Date - 2022-08-18T04:21:01+05:30 IST