మ‘ఠా’న్‌!

ABN , First Publish Date - 2021-01-18T05:08:54+05:30 IST

జిల్లా వ్యాప్తంగా మటన్‌ అమ్మకాలు భారీగా జరిగాయి...

మ‘ఠా’న్‌!
శ్రీకాకుళంలో మటన్‌ దుకాణం వద్ద క్యూకట్టిన కొనుగోలుదారులు

అమాంతం పెరిగిన మటన్‌ ధర
జిల్లా వ్యాప్తంగా భారీగా విక్రయాలు
వేకువజాము నుంచే దుకాణాల వద్ద బారులు
కిలో రూ.800 పైమాటే, కొన్నిచోట్ల రూ.1,000
జిల్లాలో రూ.5 కోట్ల వ్యాపారం జరిగినట్టు అంచనా
చేపల కోసం ఎగబడిన జనాలు
బర్డ్‌ఫ్లూతో తగ్గిన చికెన్‌ అమ్మకాలు


(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి): జిల్లా వ్యాప్తంగా మటన్‌ అమ్మకాలు భారీగా జరిగాయి. సుమారు రూ.5 కోట్ల వ్యాపారం జరిగి ఉంటుందని అంచనా. చాలాచోట్ల విక్రయదారులు ధర పెంచి అమ్మకాలు సాగించారు. పండుగ పూట కావడంతో భారమైనా ఎక్కువ మంది మటన్‌ కొనుగోలు చేయడం కనిపించింది. ప్రజల పండుగ అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని కొందరు వ్యాపారులు సొమ్ము చేసుకున్నారు. చాలాచోట్ల కిలో మటన్‌ను రూ.1,000ల వరకూ విక్రయించారు. శ్రీకాకుళం నగరంలో ప్రధాన మార్కెట్లలో మటన్‌ విక్రయాలు రూ.లక్షల్లో జరిగాయి. ఇచ్ఛాపురం, పలాస-కాశీబుగ్గ, ఆమదాలవ లస మునిసిపాల్టీలు, పాలకొండ, రాజాం నగర పంచాయతీలతో పాటు సోంపేట, టెక్కలి, నరసన్నపేట, పాతపట్నంలో మటన్‌ ధరలు చుక్కలనంటాయి. మండల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలో సైతం విపరీతమైన గిరాకీ. గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది బృందంగా ఏర్పడి ముందుగానే మేక, పొట్టేళ్లను ముందస్తుగానే సంతల్లో కొనుగోలు చేసుకున్నారు. కోళ్ల విక్రయాలు మాత్రం గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్‌ ఇందుకు కారణం. కోడి మాంసంతో బర్డ్‌ఫ్లూ ప్రబలుతోందన్న వదంతుల నేపథ్యంలో చాలామంది భయపడిపోయారు. సామాన్య, మధ్యత రగతి ప్రజలు సైతం ప్రత్యామ్నాయంగా చేపలు, మటన్‌పైనే ఆసక్తికనబరిచారు. ఫలితంగా అమ్మకాలు లేక కోడి మాంసం విక్రయదారులు డిలా పడిపోయారు. నాటుకోళ్ల అమ్మకాలు మాత్రం ఆశాజనకంగా జరిగాయి. ఇక చేపల విక్రయాలదీ అదే తీరు. నీటి చేపల కోసం జనాలు ఎగబడ్డారు. లైవ్‌ ఫిష్‌ పేరిట ఏర్పాటుచేసి దుకాణాల వద్ద ఉదయానికే మోహరించారు.

మందుబాబుల సందడి
మందుబాబుల సందడి అంతాఇంతా కాదు. ఆదివారం పండుగ చేసుకున్నారు. ఉదయం 11 గంటలకు షాపులు తెరవగా..ముందుగానే క్యూకట్టారు. సాయంత్రం వరకూ షాపులు కిటకిటలాడుతూ కనిపించాయి. గ్రామీణ ప్రాంతాల్లో అయితే చెప్పనక్కర్లేదు. దీంతో జిల్లావ్యాప్తంగా మద్యం అమ్మకాలు గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా బీర్ల విక్రయాలు జోరుగా సాగాయి. కాగా మద్యం దుకాణాల వద్ద కరోనా నిబంధనలు పాటించకపోవడం విమర్శలకు తావిచ్చింది.
 



Updated Date - 2021-01-18T05:08:54+05:30 IST