కోయక ముందే కన్నీళ్లు

ABN , First Publish Date - 2020-10-01T10:44:25+05:30 IST

ఉల్లి లేని కూర రుచించదు. ఉల్లి చేయని మేలు తల్లి కూడా చేయదని అంటుంటారు. కానీ ఇప్పుడు ఉల్లిగడ్డ కోయకముందే సామాన్యుల కంట్లో కన్నీళ్లు

కోయక ముందే కన్నీళ్లు

ఘాటెక్కిన ఉల్లి ధర 

ఎర్ర రకం రూ. 50 కిలో.. తెల్లగడ్డ రూ. 60 నుంచి 70

మహారాష్ట్ర నుంచి దిగుమతి బంద్‌తోనే ధరల పెరుగుదల 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

ఉల్లి లేని కూర రుచించదు. ఉల్లి చేయని మేలు తల్లి కూడా చేయదని అంటుంటారు. కానీ  ఇప్పుడు ఉల్లిగడ్డ కోయకముందే సామాన్యుల కంట్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి. కొవిడ్‌ ఎఫెక్ట్‌తో ఇప్పటికే వ్యాపారాలు నడవక, పనులు లేక తల్లడిల్లుతున్న ప్రజలకు నిత్యావసర సరుకులతో పాటు ఉల్లిగడ్డ ధర కూడా పెరిగిపోయింది. అధిక వర్షాల వల్ల మహారాష్ట్రలో ఉల్లి పంట దెబ్బతినడమే కాకుండా రవాణా నిలిచిపోవడంతో ఉల్లి ధర పెరిగిపోయింది. ఒక్కో లారీలో 20 టన్నుల వరకు ఉల్లిగడ్డ వస్తుంది. ప్రస్తుతం జిల్లాకు వారానికి ఒకటి రెండు లారీలు మాత్రమే వస్తుండడంతో ఉల్లిధర పెరుగుతూ వస్తోంది. ఎర్ర రకం ఉల్లిగడ్డ రూ. 50 ధర పలుకు తుండగా తెల్ల రకం గడ్డ రూ. 60 నుంచి 70 వరకు అమ్ముతున్నారు.


లాక్‌డౌన్‌లో ఉల్లి ధర రూ. 20 నుంచి రూ. 25 కిలో ధర పలికింది. కొందరు వ్యాపారులు వంద రూపాయలకే ఆరు కిలోల వరకు అందించేవారు. ప్రస్తుతం వినియోగం తక్కువగా ఉన్నప్పటికీ ధర పెరగడంతో సామాన్యులు ఆందోళన చెందుతున్నారు. హోటళ్లు, పెళ్లిళ్లు, ఇతర కార్యక్రమా లకు తక్కువ వినియోగం ఉన్నప్పటికీ ఉల్లి ధర మాత్రం ఆకాశాన్ని అంటుతోంది. మహరాష్ట్రలో భారీ వర్షాల కారణంగానే ఉల్లి ధర పెరగడానికి కారణంగా మారిందని భావిస్తున్నారు. మహారాష్ట్రలోనే రేటు పెంచారని అక్కడ పెరగడానికి తోడు రవాణా లేకపోవడం వల్లనే ఉల్లి ధర పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఉల్లి ధర మరింత పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు వ్యాపారులు అంటున్నారు. 


కూరగాయలదీ అదే పరిస్థితి..

జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే అధిక వర్షం కురిసింది. అధిక వర్షాలతో పంటలు నీట మునిగాయి. దీంతో కూరగాయల ధరలు అమాంతం పెరిగాయి.  కూరగాయలు ఏవి కొన్న కిలో 80 రూపాయల వరకు  పలుకుతున్నాయి. కూరగాయల కు తోడు ఉల్లి ధర కూడా భారీగా పెరగడంతో సామాన్యులు విలవిలలాడుతున్నారు.  సిరిసిల్లలోని నేత కార్మికుల కుటుంబాలు ఉల్లి కొనడమే మానుకున్నారు. కాస్తా ధనిక వర్గాలు కూడా వెనకడుగు వేయడం కనిపిస్తోంది. 


సబ్సిడీపై ఉల్లి అందించాలి..కల్లెపు జైపాల్‌, సిరిసిల్ల

ఉల్లి గడ్డ ధర భారీగా పెరిగింది. కొనుగోలు చేయాలంటేనే భయమేస్తోంది. ప్రభుత్వం సబ్సిడీపై ఉల్లిగడ్డను అందించాలి. ఇతర రాష్ట్రాల నుంచి ఉల్లిగడ్డను దిగుమతి చేసుకోవడానికి చర్యలు చేపట్టాలి. 


ఉల్లిగడ్డను తగ్గించాం..చల్ల సుమ, సిరిసిల్ల

ఉల్లిగడ్డను కొనలేకపోతున్నాం. కూరల్లో ఉల్లిగడ్డ వినియోగాన్ని తగ్గించుకున్నాం. గతంలో ఈ సమయంలో ఎప్పుడూ ఉల్లిగడ్డ ఇంత భారీగా పెరగలేదు. ఉల్లిగడ్డ అరోగ్యానికి మంచిది అయినా ధర అందుబాటులో లేకపోవడంతో కొనుగోలు తగ్గించాం. 

Updated Date - 2020-10-01T10:44:25+05:30 IST