కొండెక్కిన కోడి గుడ్డు

ABN , First Publish Date - 2020-09-23T09:42:09+05:30 IST

రాష్ట్రంలో కోడిగుడ్ల ధర కొండెక్కింది. రిటైల్‌గా ఒక్కో గుడ్డు రూ.7 వరకు పలుకుతోంది.

కొండెక్కిన కోడి గుడ్డు

‘కరోనా’తో పెరిగిన ధర


అమరావతి, సెప్టెంబరు 22(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కోడిగుడ్ల ధర కొండెక్కింది. రిటైల్‌గా ఒక్కో గుడ్డు రూ.7 వరకు పలుకుతోంది. నెక్‌ ధర ప్రకారం హోల్‌సేల్‌గా 100గుడ్లు రూ.515 వరకు పలుకుతున్నాయి. గుడ్ల ఉత్పత్తి పడిపోవడం వల్లే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఈ నెల మొదటి వారంలో తెలంగాణ లో 100గుడ్లు రూ.420లోపు ఉంటే, ఏపీలో రూ.450దాకా ఉంది. రెండో వారంలో రూ.500కు చేరింది. ఈ వారం రోజుల్లో మరింతగా పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 100గుడ్లు రూ.500పలుకుతోంది. విశాఖలో రూ.515ఉంది. విజయవాడ, గోదావరి, తిరుపతి ప్రాంతాల్లో రూ.507దాకా పలుకుతోంది. ఫారంలో గుడ్డు రూ.6చొప్పున డజను రూ.72పలుకుతుండగా చిరు వ్యాపారులు రూ.7కి అమ్ముతున్నారు. 


ఖర్చులు పెరిగి.. ఉత్పత్తి తగ్గి: రాష్ట్రంలో ఏటా సుమారు వెయ్యి కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యేవి. కానీ గత ఆరు నెలల్లో సగానికి సగం ఉత్పత్తి పడిపోయింది. దీనికి ప్రధాన కారణంగా పౌల్ర్టీల్లో కోళ్లు కూడా సగానికి పైగా తగ్గడమే. కొవిడ్‌-19నేపథ్యంలో లాక్‌డౌన్‌తో చికెన్‌ దుకాణాలు లేకపోవడం, కోడిగుడ్ల రవాణా జరగకపోవడంతో పౌల్ర్టీ వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు. దానికి తోడు కోళ్లకు వైద్యం అందక, ఎండలకు లక్షల్లో చనిపోయాయి. చాలామంది పౌల్ర్టీ యజమానులు.. ఉన్న కోళ్లతోనే పౌల్ర్టీలు కొనసాగించారు తప్ప.. కొత్తగా పిల్లల్ని తెచ్చి పెంచలేదు. లాక్‌డౌన్‌ ఎత్తేశాక చికెన్‌ అమ్మకాలు సాగుతున్నా, కరోనా నేపథ్యంలో రోగ నిరోధక శక్తికి కోడిగుడ్డు మంచిదన్న ప్రచారంతో చికెన్‌ కంటే అవే ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. దీంతో ఉత్పత్తి, వినియోగానికి మధ్య వ్యత్యాసం వల్ల డిమాండ్‌ వచ్చి ధరలు పెంచాల్సి వస్తోందని పౌల్ర్టీ వ్యాపారులు చెప్తున్నారు. 

Updated Date - 2020-09-23T09:42:09+05:30 IST