నీలం టన్ను ధర రూ.50వేలు

ABN , First Publish Date - 2020-07-02T11:00:34+05:30 IST

ఒక వైపు కరోనా లాక్‌డౌన్‌తో పండిన పంటలకు కనీస గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతుంటే...

నీలం టన్ను ధర రూ.50వేలు

గత 20 ఏళ్లలో ఇదే అత్యధికం


రాజంపేట, జూలై1: ఒక వైపు కరోనా లాక్‌డౌన్‌తో పండిన పంటలకు కనీస గిట్టుబాటు ధర లేక రైతులు నష్టపోతుంటే... మరోవైపు నీలం రకం మామిడికి రికార్డు స్థాయిలో ధర పలుకుతోంది. గత 20ఏళ్లలో లేని విధంగా ఏకంగా టన్ను రూ.50వేలు పలుకుతోంది.  రైల్వేకోడూరు, రాజంపేట ప్రాంతంలోని వ్యాపారులు టన్ను నీలం కాయలను రూ.50వేలు పెట్టి కొంటున్నారు. చెన్నై, నెల్లూరు, బెంగళూరులలో టన్ను రూ.70వేలు పైబడి కొనుగోలు చేస్తున్నారు. 


జిల్లాలో ప్రధానంగా రాయలసీమ ప్రాంతంలో రైల్వేకోడూరు మామిడి పంటకు పెట్టింది పేరు. ఒక్క ఏడాదిలో రూ.200 కోట్ల వ్యాపారం సాగుతుంది. అయితే ఈ ఏడాది వాతావరణ పరిస్థితుల వల్ల కాయలు 20శాతం కూడా దిగుబడి రాలేదు. దీంతో రూ.50కోట్ల వ్యాపారం కూడా సాగలేదు. బేనీషా, బెంగళూరు, రుమాణి, మల్గూబా, ఖాదర్‌ తదితర 50రకాల మామిడి పండ్లు ఈ ప్రాంతంలో పండుతాయి. ప్రస్తుతం సీజన్‌ కూడా ముగిసే దశ ఉండటంతో చివరిదశలో నీలం కాయలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి కూడా అతితక్కువ స్థాయిలో దిగుబడి రావడంతో డిమాండ్‌ పెరిగి ఏకంగా టన్ను రూ.40వేలు పలుకుతున్నాయి.


సాధారణంగా నీలం రకం టన్ను రూ.10 వేలు పలికేది. ఇంత ధర పలకడం ఇదే మొదటిసారి. ఈ విషయమై రైల్వేకోడూరు మార్కెట్‌యార్డ్‌ మాజీ చైర్మన్‌ రామచంద్రనాయుడు మాట్లాడుతూ ఈ ఏడాది మామిడి దిగుబడి చాలా తక్కువగా వచ్చిందని, దీంతో సీజన్‌ అయిపోయే చివర్లో చిట్టిచివరన వచ్చే నీలం కాయలకు ఎక్కువ డిమాండ్‌ ఏర్పడిందన్నారు. టన్ను రూ.40వేలు పలకడం తాను ఎన్నడూ చూడలేదని ఇదే తొలిసారని అన్నారు.

Updated Date - 2020-07-02T11:00:34+05:30 IST