ధర దడ

ABN , First Publish Date - 2022-08-19T05:16:21+05:30 IST

అన్నదాతపై మరోసారి ధరల భారం పడింది.

ధర దడ

అమాంతంగా పెరిగిన ఎరువుల ధరలు
పొటాష్‌ బస్తా రూ.700, కాంప్లెక్స్‌ రూ.150-300 పెంపు
ఉమ్మడి జిల్లా రైతులపై రూ.163 కోట్ల అదనపు భారం


అన్నదాతపై మరోసారి ధరల భారం పడింది. అమాంతంగా పెరిగిన ఎరువుల ధరలతో  రైతన్న గుండె గుభేల్‌మంటోంది. అప్పు చేసి ఎరువులు తెచ్చి సాగు చేసినా .. పంటకు గిట్టుబాటు ధర వస్తుందన్న నమ్మకం లేదు. తాజాగా కాంప్లెక్స్‌ ఎరువు బస్తాపై రూ.150-300, డీపీపీ బస్తాపై రూ.150, పొటాష్‌పై రూ.700 పెంచారు. పెరిగిన ధరల వల్ల ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులపై రూ.163 కోట్ల అదనపు భారం తప్పదని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు.  

-(కర్నూలు-ఆంధ్రజ్యోతి)

ఉమ్మడి జిల్లాలో ఖరీఫ్‌ సాధారణ సాగు విస్తీర్ణం 6.38 లక్షల హెక్టార్లు. అందులో కర్నూలు జిల్లాలో 4.10 లక్షల హెక్టార్లలో పంటలు సాగవుతుండగా 3.03 లక్షల హెక్టార్లలో పత్తి సాగు చేయవచ్చని అంచనా. నంద్యాల జిల్లాలో 2.28 లక్షల హెక్టార్లు ఖరీఫ్‌ సాగు విస్తీర్ణం కాగా.. అందులో వరి 1.10 లక్షల హెక్టార్లు సాగు చేస్తారని అంచనా. రెండు జిల్లాల్లోనూ మిరప, ఉల్లి, మొక్కజొన్న, కంది, టమోటా వంటి ప్రధాన పంటలు సాగు చేస్తున్నారు. కర్నూలు జిల్లాల్లో 1,97,853 మెట్రిక్‌ టన్నులు, నంద్యాల జిల్లాల్లో 1,92,336 మెట్రిక్‌ టన్నులు కలిపి 4,90,189 మెట్రిక్‌ టన్నులు రసాయన ఎరువులు అవసరమని అధికారులు అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఇండెంట్‌ ఇచ్చారు. అందులో మెజార్టీ ఎరువులు రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ద్వారా సరఫరా చేయనున్నారు.
 
అన్నదాతపై ఎరువు బరువు

రసాయన ఎరువుల ధరలు భారీగా పెంచేశారు. పొటాష్‌ 50 కిలోల బస్తాపై రూ.700 పెరిగితే.. డీఏపీ బస్తాపై రూ.150, కాంప్లెక్స్‌ బస్తాపై రూ.150-300 పెరిగిందని అంటున్నారు. ఉమ్మడి జిల్లాలో 1.75 లక్షల మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు వినియోగిస్తారు. టన్నుకు రూ.4,500 పెరిగింది. ఈ లెక్కన రూ.78.25 కోట్లు అదనపు భారం పడనుంది. డీఏపీ టన్నుపై రూ.3 వేలు పెరుగుతుంది. 75 వేలు మెట్రిక్‌ టన్నులు డీఏపీ వినియోగిస్తారని అంచనా. ఈ లెక్కన రూ.22.50 కోట్లు డీఏపీ రూపంలో భారం తప్పడం లేదు. పొటాష్‌ టన్నుపై రూ.14 వేల వరకు పెరిగింది. 45 వేల మెట్రిక్‌ టన్నులు వాడతారని, పెరిగిన ధర ప్రకారం రూ.63 కోట్ల అదనపు భారం పడుతుంది. ఉమ్మడి కర్నూలు జిల్లా రైతులపై కాంప్లెక్స్‌, డీఏపీ, పొటాష్‌ రూపంలో రూ.163.75 కోట్ల అదనపు భారం తప్పడం లేదు. పత్తి, వరి సాగు చేసే ఐదు ఎకరాల రైతుపై ఎరువుల రూపంలో రూ.10 వేలకు పైగా అదనపు పెట్టుబడి భారం భరించాల్సి వస్తుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతు భరోసా పేరుతో ఓ చేత్తో ఇచ్చి.. ఎరువుల ధరలు పెంచి మరో చేత్తో ప్రభుత్వం లాగేసుకుంటోందని ఎమ్మిగనూరు మండలానికి చెందిన పత్తి రైతు వెంకటేశ్వర్లు ఆవేదన వ్యక్తం చేశారు.

మూడేళ్లలో ఎరువుల ధరలు బస్తాపై (రూ.లలో)

ఎరువు        2020    2021    2022   
20:20:0:13    880    1,108    1,490
10:26:26        1,140    1,260    1,570   
28:28:0        1,275    1,474    1,700
14:35:14        1,225    1,526    1,750
16:20:00:17    --    1,175    1,450
పొటాష్‌        820    900    1,700   
డీఏపీ        1,210    1,210    1,350
యూరియా    266.5    266.5    266.5

వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు

పెరిగిన ఎరువుల ధరలు, విత్తనాల ధరలతో వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. అతివృష్టి, అనావృష్ఠి వల్ల పంటలు చేతికి అందక తీవ్రంగా నష్టపోతున్నాం. దీంతోపాటు సాగు ఖర్చు పెరిగింది.    వ్యవసాయం చేయడం కష్టంగా మారింది. ప్రభుత్వం రాయితీపై ఎరువులను అందించాలి.
 
-చిన్న అయ్యన్న, రైతు పెద్ద పాండవగల్‌ గ్రామం

ఎరువుల ధరలను నియంత్రించాలి


ఎరువుల ధరలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ రోజు ఉన్న ధర రేపు ఉంటుందో లేదో తెలియని పరిస్థితి. గతంతో పోల్చుకుంటే 50శాతం పైగా ఎరువుల ధరలు పెరిగిపోయాయి. ధరలను ప్రభుత్వం నియంత్రించకపోతే భవిష్యత్తులో వ్యవసాయం చేయడం కష్టం.  

-ఏసయ్య రైతు, పెద్దతుంబళం గ్రామం, ఆదోని మండలం

ఇలా  పెంచితే రైతుల పరిస్థితి ఏమిటి?

విచ్చలవిడిగా ఎరువుల ధరలు పెంచితే రైతుల పరిస్థితి ఏమవ్వాలి? 50కేజీల బస్తాపై రూ.150 నుంచి రూ.350 వరకు పెంచడం వల్ల రైతుపై తీవ్ర భారం పడుతుంది. ఇప్పటికే వ్యవసాయంలో నష్టాలు రావడంతో ఎంతో మంది సాగుకు దూరవుతున్నారు. వ్యవసాయానికి ప్రోత్సాహాన్ని అందించాల్సిన పాలకులు ధరల పెంపుతో రైతులను ఇబ్బందులకు గురిచేయడం సమంజసం కాదు. ఎరువుల ధరలపై పెంపుపై కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలి.

 - రాజశేఖర్‌, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు, ఆత్మకూరు

ఎరువుల ధరలు తగ్గించాలి

రోజురోజుకూ పెరుగుతున్న ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల ధరలతో వ్యవసాయం గుదిబండగా మారుతోంది. ప్రకృతి వైపరీత్యాలతో పంటలను నష్టపోవడమే కాకుండా వచ్చిన కొద్దిపాటి దిగుబడులకు కూడా గిట్టుబాటు ధరల్లేక రైతులు అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో రైతులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వాలు ఎరువుల ధరలను మరింత పెంచడం అన్యాయం. పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలి.
 
- శంకర్‌, రైతు, గుంతకందాల, వెలుగోడు మండలం

Updated Date - 2022-08-19T05:16:21+05:30 IST