దేవాలయ ప్రతిష్టను ఇనుమడింపజేయండి

ABN , First Publish Date - 2022-01-08T04:41:38+05:30 IST

పైడితల్లి అమ్మవారి ఆలయ ప్రతిష్ఠను ఇనుమడింపజేయాలని అనువంశిక ధర్మకర్త, మాన్సాస్‌ చైర్మన్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం పైడిమాంబ కళ్యాణ మండపంలో నూతన ట్రస్ట్‌ బోర్డు ప్రమాణ స్వీకారం జరిగింది. అశోక్‌గజపతిరాజుతో పాటు జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.

దేవాలయ ప్రతిష్టను ఇనుమడింపజేయండి
మాట్లాడుతున్న అశోక్‌గజపతిరాజు


మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌ అశోక్‌గజపతిరాజు

ప్రశాంతంగా పైడిమాంబ ట్రస్ట్‌ బోర్డు ప్రమాణ స్వీకారం

భారీగా పోలీస్‌ బందోబస్తు

కార్యక్రమం వద్ద కానరాని ‘కొవిడ్‌’ నిబంధనలు

విజయనగరం-ఆంధ్రజ్యోతి/విజయనగరం రూరల్‌, జనవరి 7: పైడితల్లి అమ్మవారి ఆలయ ప్రతిష్ఠను ఇనుమడింపజేయాలని అనువంశిక ధర్మకర్త, మాన్సాస్‌ చైర్మన్‌ పూసపాటి అశోక్‌ గజపతిరాజు పిలుపునిచ్చారు. శుక్రవారం పైడిమాంబ కళ్యాణ మండపంలో నూతన ట్రస్ట్‌ బోర్డు ప్రమాణ స్వీకారం జరిగింది. అశోక్‌గజపతిరాజుతో పాటు జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామిలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. అశోక్‌గజపతిరాజు మాట్లాడుతూ ఆలయ ఆచార, సంప్రదాయాలను గౌరవిస్తూ ముందుకు సాగుదామన్నారు. ఆలయ అభివృద్ధికి అంకితభావంతో కృషిచేయాలని సభ్యులకు సూచించారు. భక్తుల మనోభావాలను గౌరవించాలని హితవు పలికారు.   ఎటువంటి ఆరోపణలకు తావివ్వకుండా వ్యవహరించాలన్నారు. మరింత పారదర్శక సేవల కోసమే ట్రస్ట్‌ బోర్డు ఏర్పాటు చేశానని భావిస్తున్నట్టు తెలిపారు. జడ్పీ చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు మాట్లాడుతూ పైడితల్లమ్మకు సేవ చేయటం ఆదృష్టంగా భావించాలన్నారు. బాధ్యతగా పని చేయాలని సూచించారు. ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ దేవుడి సేవకు వచ్చిన అవకాశాన్ని సభ్యులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆలయ ట్రస్ట్‌ బోర్డు చైర్మన్‌గా పూసపాటి ఆశోక్‌గజపతిరాజు, దేవాస్థానంలో ఆర్చకుడిగా పనిచేస్తున్న దూసి కృష్ణమూర్తితో పాటు ఎనిమిది మంది ట్రస్టుబోర్డు సభ్యులుగా, నలుగురు ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో ఈవో కిశోర్‌కుమార్‌,   సిబ్బంది పాల్గొన్నారు.

అడుగడుగునా పోలీసులు

ట్రస్ట్‌ బోర్డు ప్రమాణ స్వీకారానికి పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేయడం చర్చనీయాంశమైంది. కార్యక్రమం జరిగిన శివాలయం వీధిలో షాపులను మూయించేశారు. ఉదయం నుంచే ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ వీధి గుండా రాకపోకలను సైతం నిలిపివేశారు. బారికేడ్లు ఏర్పాటుచేశారు. మాన్సాస్‌ ట్రస్ట్‌, రామతీర్థం ఘటనల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ పరిణామాలు జరుగకుండా ముందస్తు చర్యల్లో భాగంగానే పోలీసులు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. ప్రశాంతంగా కార్యక్రమం ముగియడంతో అటు అధికారులు, ఇటు పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. మరో వైపు ప్రమాణ స్వీకార వేదికగా నిలిచిన పైడిమాంబ కల్యాణ మండలంలో ఎక్కడా కొవిడ్‌ నిబంధనలు పాటించిన దాఖలాలు లేవు. పెద్దఎత్తున ప్రజలు తరలివచ్చారు. కానీ భౌతిక దూరం పాటించే ఏర్పాట్లు చేయలేదు. ఇది విమర్శలకు తావిచ్చింది. 





Updated Date - 2022-01-08T04:41:38+05:30 IST