బతుకు సాగేదెలా...

ABN , First Publish Date - 2020-03-29T10:40:32+05:30 IST

రెక్కాడితే కాని డొక్కాడని వేతన జీవులంతా లాక్‌డౌన్‌ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేయడానికి

బతుకు సాగేదెలా...

పనికి పిలిచే వాళ్లే లేరు

ఇలాంటి రోజు వస్తుందనుకోలేదు

వడ్డీ వ్యాపారుల ఒత్తిడి


ఒంగోలు(జడ్పీ), మార్చి 28 : రెక్కాడితే కాని డొక్కాడని వేతన జీవులంతా లాక్‌డౌన్‌ నేపథ్యంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చేయడానికి పనిలేదు. జేబులో చిల్లిగవ్వ లేదు. నెలల పాటు తిని కూర్చునే ఆర్థిక స్థోమతా లేదు. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ప్రస్తుతం బతుకు పోరాటం సాగిస్తున్నారు కూలీనాలీ చేసుకుని బతికే శ్రమజీవులు. భవన నిర్మాణ కార్మికులు, హోటల్స్‌లో పనిచేసేవారు, థియేటర్స్‌ వర్కర్లు, ఆటోవాలాలు, రిక్షా నడుపుకునే బతికేవారు, బుట్టలు అల్లేవారు ఇలా ఒకటేమిటి కరోనా ఎఫెక్ట్‌ పడని రంగమే లేదు. ఈ రంగాలమీద ఆధారపడి బతికే వారంతా అసంఘటిత కార్మికులే.  వీరంతా యూనియన్లు, సంఘాలు, నెలవారీ జీతాలు లేకుండా రోజువారీ వచ్చే వేతనం మీద బతికే బక్క జీవులు. వీరందరి నెత్తిన కరోనా రూపంలో అనుకోని పిడుగు పడ్డట్టయింది.


ప్రభుత్వాలు ఇలాంటి వారి మీద ప్రత్యేక దృష్టిపెట్టాలి

రాష్ట్రప్రభుత్వం ఇలాంటి వారిని ఆదుకోవడానికి నిర్మాణాత్మక ప్రతిపాదనలేవి ఇంతవరకు తేలేదు. ఒక నెల రేషన్‌, రూ.వెయ్యి నగదును ఇస్తామని మాత్రమే ప్రకటించింది. ఇవి మాత్రమే వేతన జీవులకు ఊరట కలిగిస్తాయనుకోవడం పొరపాటే అవుతుంది. అందుకే ప్రభుత్వాలు ఈ కష్టకాలంలో తమను ఆదుకోవాలని కూలీలు, కార్మికులు వేడుకుంటున్నారు. పని చేద్దామన్న దొరకని ఒక వింత పరిస్థితిని తాము ప్రస్తుతం ఎదుర్కొంటున్నామని ఇలాంటి రోజు ఒకటి వస్తుందని తాము ఊహించలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పదిరోజుల నుంచి ఖాళీగా ఉంటున్నామని ఇంకా ఎన్నిరోజులు కొనసాగుతుందో తెలియడం లేదని వారు ఆందోళన చెందుతున్నారు. 


వడ్డీ వ్యాపారుల ఒత్తిడి

అవసరాల కోసం ఎక్కువగా ఈ రోజువారీ కార్మికులలో చాలామంది వడ్డీ వ్యాపారుల దగ్గర నుంచి అప్పులు తీసుకుంటూ ఉంటారు. రోజుకు ఇంత అని జమచేస్తూ ఉంటారు. వడ్డీ వ్యాపారులు కూడా ఇలాంటి వారికే అప్పులు ఎక్కువగా ఇస్తూ ఉంటారు. కరోనా వల్ల తింటానికే ఇబ్బందులు పడుతుంటే అప్పులు ఎలా కట్టాలి అని వారు బాధపడుతున్నారు. పరిస్థితి ఏదయినా కానీ తమ అప్పులు కట్టాల్సిందేనని వడ్డీ వ్యాపారుల నుంచి ఒత్తిళ్లు అధికమవుతున్నాయిని వారు చెబుతున్నారు.



Updated Date - 2020-03-29T10:40:32+05:30 IST