పీఆర్సీని పునః సమీక్షించాలి

ABN , First Publish Date - 2022-01-27T05:44:24+05:30 IST

పీఆర్సీని ప్రభుత్వం పునః సమీక్షించాలని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌కు సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు.

పీఆర్సీని పునః సమీక్షించాలి
అంబేడ్కర్‌ విగ్రహానికి వినతిపత్రం అందజేస్తున్న ఉద్యోగులు

 సాధన సమితి ప్రతినిధుల డిమాండ్‌

గుజరాతీపేట, జనవరి 26: పీఆర్సీని ప్రభుత్వం పునః సమీక్షించాలని పీఆర్సీ సాధన సమితి ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బుధవారం స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌కు సమీపంలోని అంబేడ్కర్‌ విగ్రహానికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఏపీజేఏసీ చైర్మన్‌ హనుమంతు సాయిరాం, ఏపీఎన్జీవో రాష్ట్ర ఉపాధ్యక్షుడు చౌదరి పురుషోత్తంనాయుడు మాట్లాడుతూ... ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన పీఆర్సీ ప్రకారం ఈ నెల జీతాల బిల్లులు విడుదల చేయొద్దని ట్రెజరీ అధికారులను కోరారు. ఉద్యోగులకు జీతాలు పెంచేందుకు కేటాయించిన రూ.10వేల కోట్లను ప్రభుత్వమే మిగుల్చుకోవాలని అన్నారు. చీకటి జీవోలను రద్దు చేసేవరకు ఉద్యోగుల ఉద్యమం ఆగదని హెచ్చరించారు. కార్యక్రమంలో పెద్దసంఖ్యలో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కార్మికులతోపాటు  ఏపీజేఏసీ(అమరావతి) జిల్లా చైర్మన్‌ బి.శ్రీరాములు, యూటీఎఫ్‌ నాయకులు ఎస్‌.కిషోర్‌, రవీంద్ర, జి.గిరిధర్‌, ఇతర సంఘాలకు చెందిన కోత ధర్మారావు, పి.మురళి, రాజశేఖర్‌, ఫోర్టో చైర్మన్‌ పిసిని వసంతరావు, టెంక చలపతిరావు, గోవిందపట్నాయక్‌, రాజ్‌కుమార్‌, శశిభూషణ్‌, సురేంద్ర, బీవీఎం రాజు, చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. 


నేటి నుంచి రిలే నిరాహార దీక్ష

పీఆర్సీ సాధన ఉద్యమ కార్యాచరణలో భాగంగా గురువారం నుంచి  నాలుగు రోజుల పాటు స్థానిక ఏపీఎన్జీవో హోమ్‌ వద్ద రిలేనిరాహార దీక్ష చేపట్టనున్నట్టు ఉద్యోగ సంఘ నాయకులు తెలిపారు. ఈ మేరకు బుధవారం స్థానిక రెవెన్యూ గెస్ట్‌హౌస్‌లో రిలే నిరాహార దీక్షల సన్నాహక సమావేశాన్ని పీఆర్సీ సాధన సమితి ఆధ్యర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీజేఏసీ జిల్లా చైర్మన్‌ హనుమంతు సాయిరాం, ఏపీఎన్జీవో రాష్ట్ర సహాధ్యక్షుడు చౌదరి పురుషోత్తంనాయుడు మాట్లాడుతూ... జిల్లా స్థాయిలో శ్రీకాకుళంలోని ఏపీఎన్జీవో హోమ్‌ వద్ద నిర్వహించనున్న రిలే నిరాహార దీక్షల్లో 100 నుంచి 150 మంది ఉద్యోగులు పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతి రోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దీక్ష కొనసాగుతుందన్నారు.   మద్దతుగా జిల్లా నలుమూలల నుంచి ఉద్యోగులు తరలిరానున్నట్టు స్పష్టం చేశారు. సమావేశంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం నుంచి పప్పల వేణుగోపాల్‌, బి.శ్రీరాములు, యూటీఎఫ్‌, డీటీఎఫ్‌ ప్రతినిదులు అప్పారావు, కోత ధర్మారావు, ఎన్జీవో సంఘ జిల్లా కార్యదర్శి పూర్ణచంద్రరావు  పాల్గొన్నారు.  

Updated Date - 2022-01-27T05:44:24+05:30 IST