జగత్తును నడిపించే శక్తి

ABN , First Publish Date - 2021-10-08T06:07:01+05:30 IST

జగన్మాత ఆరాధనను ‘రాత్రి వ్రతం’ అంటారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాశక్తి రూపనామాలతో తొమ్మిది రోజులు ఆమెను పూజిస్తారు కనుక దేవీ నవరాత్రులనీ, శరత్కాలంలో నిర్వహిస్తారు కాబట్టి శరన్నవరాత్రులనీ వ్యవహరిస్తారు.

జగత్తును నడిపించే శక్తి

గన్మాత ఆరాధనను ‘రాత్రి వ్రతం’ అంటారు. మహాకాళి, మహాలక్ష్మి, మహాశక్తి రూపనామాలతో తొమ్మిది రోజులు ఆమెను పూజిస్తారు కనుక దేవీ నవరాత్రులనీ, శరత్కాలంలో నిర్వహిస్తారు కాబట్టి శరన్నవరాత్రులనీ వ్యవహరిస్తారు. మనుషుల్లోని అవిద్య, అవినీతి, అహంకారం, అశాంతి, అసహనం, స్వార్ధపరత్వం లాంటి దుర్గుణాలను రూపుమాపి, శారీరక, మానసిక శక్తిని పెంపొందించి, జ్ఞానాన్ని పెంచే తల్లి ఆదిపరాశక్తి. నిర్మలమైన మనసుతో, భక్తి శ్రద్ధలతో నవరాత్రులలో ఆమెను ఆరాధిస్తే సర్వత్రా శుభం కలుగుతుంది.


యాదేవీ సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా

నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై నమో నమః

ఈ జగత్తును నడిపించే ఒక మహాశక్తి ఉంది. ఆ శక్తినే పూర్వులు ‘ఆదిశక్తి’, ‘పరాశక్తి’ అన్నారు. కంటికి కనిపించని ఆ శక్తి అన్నిటిలోనూ ఉంది. అందరిలోనూ ఉంది. ఆ శక్తిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడానికి అత్యంత అనువైన కాలంగా శరత్కాలాన్ని ఋషులు నిర్దేశించారు. 


ఆరాధన, ఉపాసన మార్గాల్లో కొంత వైవిధ్యం ఉన్నప్పటికీ, శక్తి స్వరూపాన్ని మాతృభావనతో పూజించడం అనాదిగా జరుగుతోంది. అలాగే కన్నతల్లిలా వాత్సల్యాన్ని, ప్రేమను, కారుణ్యాన్నీ ఆమె అనుగ్రహిస్తుంది. ఉపనిషత్తులు, ‘దేవీ భాగవతం’, ‘చండీ సప్తశతి’, ‘లలితా సహస్రం’, ‘సౌందర్య లహరి’ లాంటి ఎన్నో ఆ జగన్మాత గుణగణాలను విస్తృతంగా వర్ణించాయి. ఆమె జగత్కల్యాణం కోసం పలు సందర్భాలలో ఎందరో అసురులను సంహరించిన గాథలు పురాణాల్లో కనిపిస్తాయి. 


అర్చనకాలే రూపగతా సంస్తుతికాలే శబ్దగతా

చిన్తన కాలే ప్రాణగతా తత్త్వవిచారే సర్వగతా... 

అంటూ ఆ జగజ్జనని వైభవాన్ని ఉమాసహస్రంలో వశిష్ట గణపతి ముని వర్ణించారు:. పూజా సమయంలో ‘రూపం’తోనూ, స్తుతించేటప్పుడు ‘శబ్దం’లోనూ, చింతన చేసేటప్పుడు ‘ప్రాణం’లోనూ, విచారణ చేసేటప్పుడు సర్వత్రా... అంటే అన్నిటిలోనూ జగన్మాత గోచరిస్తుందట. అంతేకాదు- 


బ్రహ్మ ముఖాబ్దే వాగ్విరితా వక్షసి విష్ణోశ్రీర్లలితా

శంభు శరీరే భాగమితా విశ్వ శరీరే వ్యోమి తతా

‘‘బ్రహ్మ ముఖాన సరస్వతిగా, విష్ణువు వక్షాన శ్రీలక్ష్మిగా, శంభుని శరీరంలో అర్థభాగంగా, విశ్వ శరీరంలో ఆకాశ రూపంలో ఉన్నది పరాశక్తే’’ అని భావం. ఇలా అమ్మవారి నిర్గుణ, సగుణ రూపాలను గణపతి ముని నిర్వచించారు. పరాశక్తి బ్రహ్మ విష్ణు శివాత్మిక. సృష్టి, స్థితి, లయకారిణి. ఇచ్ఛా జ్ఞాన క్రియా శక్తి స్వరూపిణి. ఆమే మూల ప్రకృతి.... సర్వ జగత్తునూ నడిపించే శక్తి.


తొమ్మిది అంశా రూపాలు...

‘నవ’ అనే పదం పరమేశ్వరునికి, ‘రాత్రి’ అనే పదం పరాశక్తికి పర్యాయ పదాలుగా ‘నిర్ణయ సింధువు’ నిర్వచించింది. కాబట్టి శరన్నవరాత్రులను పార్వతీ పరమేశ్వరుల, శివ శక్తుల, ప్రకృతీ పురుషుల ఆరాధనగా భావించవచ్చు. ఈ నవరాత్రులలో త్రిమూర్తులతో పాటు సమస్త దేవతా శక్తులు జగన్మాత అధీనంలో ఉంటాయి. పరాశక్తికి వెయ్యికి పైగా నామాలు ఉన్నాయి. ప్రతి నామం అత్యంత శక్తిమంతం. మంత్రశక్తి, ప్రాణ శక్తి, కళా శక్తి, వాగ్వైభవ శక్తి, విశ్వ శక్తి, ధార్మిక శక్తి, విద్యా శక్తి... ఇలా ఎన్నో శక్తి రూపాలను చండీ సప్తశతి పేర్కొంది.


సర్వం రూపమయీ దేవీ, సర్వం దేవమయం జగత్‌

అతోహం విశ్వరూపాం, తాం నమామి పరమేశ్వరీమ్‌

నవరాత్రులలో ముగ్గురమ్మల మూలపుటమ్మకు తోడుగా ఆమెతో పాటు తొమ్మిది శక్తులు ఉంటాయని దేవీ పురాణం చెబుతోంది. అవి మహేశ్వరి, కౌమారి, వారాహి, మహాలక్ష్మి, వైష్ణవి, ఇంద్రాణి, బ్రహ్మీ, నారసింహ, చాముండి. శరన్నవరాత్రులలో దుర్గ, లక్ష్మి, సరస్వతులను మూడు రోజుల చొప్పున అర్చిస్తారు. తొలి మూడు రోజులు దుర్గ (మహాకాళి) అంశలుగా సంభావించే మహేశ్వరి, కౌమారి, వారాహి శక్తులను, తరువాత మూడు రోజులు మహాలక్ష్మి, వైష్ణవి, ఇంద్రాణిలను, చివరి మూడు రోజులు బ్రహ్మీ, నారసింహ, చాముండి శక్తులను ప్రధాన శక్తులతో పాటు ఆరాధిస్తారు. జగన్మాత ప్రమేయం లేనిదే సృష్టి, స్థితి, లయకారులు శక్తివిహీనులని ‘సౌందర్యలహరి’ తొలి శ్లోకంలోనే స్పష్టం చేశారు. శరన్నవరాత్రులు తొమ్మిది రోజుల ఉత్సవాలే అయినా, ఎందరో అసురులను సంహరించిన ఆదిపరాశక్తి... అపరాజితగా, రాజరాజేశ్వరిగా పదవ రోజున ప్రత్యేకంగా పూజలు అందుకుంటోంది. ఆ రోజును విజయదశమిగా నిర్వహించుకోవడం అనాదిగా వస్తోంది.

ఎ. సీతారామారావు

Updated Date - 2021-10-08T06:07:01+05:30 IST