అధికారం మాదే

ABN , First Publish Date - 2021-09-18T07:30:02+05:30 IST

తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు.

అధికారం మాదే

  • సంజయ్‌ పాదయాత్రే నిదర్శనం.. ఇప్పటికే కేసీఆర్‌లో వణుకు
  • రాష్ట్రంలో అన్ని ఎంపీ సీట్లనూ బీజేపీయే గెలుస్తుంది
  • తెలంగాణకు ఎక్కువ కేంద్ర మంత్రి పదవులు వస్తాయి
  • అమరవీరుల కుటుంబాల కోసం ప్రత్యేక పథకం
  • రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ పాలన ఇక సాగదు
  • బీజేపీ ప్రభుత్వం రాగానే అధికారికంగా విమోచనం
  • ఈటల రాజేందర్‌ను గెలిపించాలని ప్రజలకు పిలుపు
  • నిర్మల్‌ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా
  • సీఎం తొలి సంతకం విమోచనంపైనే: కిషన్‌రెడ్డి
  • పాఠాలుగా కేసీఆర్‌ మోసపూరిత కుట్రలు: సంజయ్‌


సంజయ్‌ పాదయాత్రతో సీఎం కేసీఆర్‌లో వణుకు మొదలైంది. పాదయాత్రకు లభిస్తున్న స్పందనతోనే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తోందనే విషయం ఖాయమైంది. ఇక రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలను కూడా బీజేపీయే గెలుచుకోబోతుంది. 2024లో ఏర్పడబోయే కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ ఎంపీలకు అత్యధిక మంత్రి పదవులు దక్కనున్నాయి. బీజేపీ అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవాన్ని రాష్ట్రమంతటా అధికారికంగా నిర్వహించడమే కాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో బలిదానాలు చేసుకున్న యువకుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేక పథకాన్ని సైతం ప్రారంభిస్తాం.  

- హోం మంత్రి అమిత్‌ షా 


నిర్మల్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా అన్నారు. 2023 ఎన్నికల్లో రాష్ట్రంలో అన్ని సీట్లనూ బీజేపీయే గెలుస్తుందన్నారు. శుక్రవారం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్‌ పట్టణ శివారులోని ఎల్లపెల్లి వద్ద బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్‌ షా పాల్గొని ప్రసంగించారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబ పాలన కొనసాగుతోందని, ఇకపై ఈ పాలనను సాగనివ్వబోమని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామన్న సీఎం కేసీఆర్‌.. ఆ తరువాత ఆ ఊసే ఎత్తకుండా రాష్ట్ర ప్రజలను వంచిస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ విమోచన కోసం పోరాడి ప్రాణాలు బలిదానం చేసిన యోధులను విస్మరించినందుకు ప్రజలకు ముఖ్యమంత్రి జవాబు చెప్పాలన్నారు. కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల్లో విమోచన దినోత్సవాన్ని అక్కడి ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తుంటే.. తెలంగాణలో ఎంఐఎం పార్టీకి భయపడి కేసీఆర్‌ నిర్వహించడంలేదన్నారు. 


రాష్ట్రంలో కారు కేసీఆర్‌ది అయితే.. స్టీరింగ్‌ ఒవైసీ చేతిలో ఉందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని కేసీఆర్‌ ప్రకటించారని, అప్పుడు గుజరాత్‌లో మంత్రిగా ఉన్న తాను.. టీవీల్లో ఈ విషయాన్ని చూశానని అమిత్‌ షా తెలిపారు. బీజేపీ ఎవరికి భయపడే పార్టీ కాదని, ప్రజల అభివృద్ధి, సంక్షేమంతోపాటు దేశ సంస్కృతీ సంప్రదాయాలను కాపాడేందుకు తాము ఏ మాత్రం వెనుకాడబోమని స్పష్టం చేశారు. బీజేపీ అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవాన్ని రాష్ట్రమంతటా అధికారికంగా నిర్వహించడమే కాకుండా తెలంగాణ ఉద్యమ సమయంలో బలిదానాలు చేసుకున్న యువకుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రత్యేక పథకాన్ని సైతం ప్రారంభిస్తామని ప్రకటించారు. 


సంజయ్‌ పాదయాత్రతో కేసీఆర్‌కు వణుకు..

ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, వాటినుంచి విముక్తి చేసేందుకే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టారని అమిత్‌ షా తెలిపారు. సంజయ్‌ పాదయాత్రతో ముఖ్యమంత్రి కేసీఆర్‌లో వణుకు మొదలైందన్నారు. పాదయాత్రకు లభిస్తున్న స్పందనతోనే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తోందనే విషయం ఖాయమైపోయిందన్నారు. ఈ సందర్భంగా సంజయ్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ఇక రాష్ట్రంలోని అన్ని లోక్‌సభ స్థానాలను కూడా బీజేపీయే గెలుచుకోబోతుందని, 2024లో ఏర్పడబోయే కేంద్ర మంత్రివర్గంలో తెలంగాణ ఎంపీలకు అత్యధిక మంత్రి పదవులు దక్కనున్నాయని చెప్పారు. ఇక దేశంలో కాంగ్రెస్‌ పనైపోయిందని, ఆ పార్టీ ఉనికి కూడా కనుమరుగయిందని అన్నారు. నిర్మల్‌ సభా వేదిక పైనుంచే ప్రధాని మంత్రి నరేంద్రమోదీకి అమిత్‌ షా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రపంచంలోనే నరేంద్రమోదీ నంబర్‌వన్‌ ప్రధాని అని కొనియాడారు. అంతకుముందు సభ ప్రారంభం కాగానే.. వేదికపై తెలంగాణ అమరవీరులకు షా నివాళులర్పించారు. సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ కుమ్రం భీం, రాంజీ గోండు, చాకలి ఐలమ్మ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. హుజూరాబాద్‌ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఈటల రాజేందర్‌ను నిర్మల్‌ సభా వేదికపై నుంచి ప్రజలకు  షా పరిచయం చేశారు. ఈటలను గెలిపించాలని కోరారు.

 

బీజేపీ సీఎం తొలి సంతకం విమోచనంపైనే..

నిర్మల్‌ గడ్డపై నుంచి ఎంఐఎం నేత అక్బరుద్దీన్‌ ఒవైసి దేశానికి వ్యతిరేకంగా మాట్లాడి ఈ ప్రాంతాన్ని అపవిత్రం చేశారని, ఇప్పుడు అమిత్‌షా రాకతో ఈ ప్రాంతమంతా పవిత్రమైందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాగానే విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించే ఫైలుపైనే ముఖ్యమంత్రి తొలి సంతకం చేస్తారని తెలిపారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ అవినీతి సామ్రాజ్యాన్ని త్వరలోనే కూకటి వేళ్లతో పెకిలిస్తామన్నారు. ‘‘జరిగిపోయిన చరిత్ర గురించి ఎందుకంటూ ఎవరో మేధావి తనతో చెప్పారని కేసీఆర్‌ తరచూ ప్రసంగిస్తున్నారు. కానీ, చరిత్రను ఎవరూ మార్చలేరు. కేసీఆర్‌కు సలహా ఇచ్చిన ఆ మేధావి ఎవరో చెబితే ఈ బహిరంగ సభలోనే ఉరి తీస్తాం’’ అని సంజయ్‌ అన్నారు. తెలంగాణ సమాజానికి కేసీఆర్‌ చేసిన మోసపూరిత కుట్రలను తాము అధికారంలోకి రాగానే పాఠ్యపుస్తకాల్లో చేరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు సోయం బాపురావు, ధర్మపురి అర్వింద్‌, బీజేపీ జాతీయ కార్యదర్శి తరుణ్‌ చుగ్‌, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, రఘునందన్‌రావు పాల్గొన్నారు. 


సభ సక్సెస్‌ 

తెలంగాణ విమోచన దినోత్సవ నిర్వహణలో భాగంగా శుక్రవారం నిర్మల్‌లో నిర్వహించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా సభ విజయవంతమయింది. ఈ సభకు దాదాపు 70 వేల మంది హాజరు కావడం ఆ పార్టీ నేతల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ప్రత్యేకించి యువకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఎక్కడ చూసినా బీజేపీ జెండాలు, ఫ్లెక్సీలతో నిర్మల్‌ పట్టణమంతా కాషాయవర్ణంతో నిండిపోయింది. మొదటి నుంచి అమిత్‌ షా సభపై దృష్టి కేంద్రీకరించిన ఆదిలాబాద్‌ ఎంపీ సోయం బాపురావు నిర్మల్‌ జిల్లా నేతలందరినీ ఒకే తాటిపై నిలిపారు. పోలీసులు భారీ ఎత్తును బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎస్పీజీ, సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో పాటు స్థానిక పోలీసులు నిర్మల్‌ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకొని బందోబస్తు నిర్వహించారు. అమిత్‌షాతో పాటు నేతల ప్రసంగాలు ఆకట్టుకున్నాయి. ఈ సభపై రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు దృష్టి కేంద్రీకరించాయి. శుక్రవారం ఉదయం నుంచే సిబ్బంది సభకు వస్తున్న జనం సంఖ్యను విశ్లేషించడంలో నిమగ్నమయ్యారు. 

Updated Date - 2021-09-18T07:30:02+05:30 IST