Abn logo
Apr 10 2020 @ 02:49AM

కరోనా అనంతర సమాజం

రాజ్య నియంత్రణ లేని నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థని యథాతథంగా కొనసాగించడమా లేదా సారభూత ప్రజాస్వామ్యాన్ని మరింత విస్తృతపరచటమా? ఇదీ ఈనాడు ప్రపంచ మానవాళి ముందు పడగ విప్పిన ప్రధానమైన ప్రశ్న. కరోనా అనంతర సమాజం తీసుకునే నిర్ణయం మీదనే మానవాళి భవితవ్యం ఆధారపడి ఉంటుంది.


జనవరి 2020 కి ముందున్నది కరోనా పూర్వ సమాజం. తర్వాతిది కరోనా ప్రభావిత సమాజం.. కరోనా అనంతర సమాజం. ఈ అనంతర ప్రపంచం ముందటి ప్రపంచంలా ఉండదు.


సెప్టెంబర్, 2011లో అమెరికాలోని ట్విన్ టవర్స్ మీద ఉగ్ర దాడి జరిగింది. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా భద్రతా వ్యవస్థలో అనూహ్యమైన మార్పు వచ్చింది. ఇదే విధంగా వైరస్ అనంతర ప్రపంచంలోనూ ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి.


ఆరోగ్య, వైద్య రంగాలలో అత్యున్నత శిఖరాలను అధిరోహించామని భావించే అభివృద్ధి చెందిన దేశాలు కరోనా ముందు వెలతెలబోతున్నాయి. ఇరవయ్యో శతాబ్దం అజేయమైన శాస్త్ర, సాంకేతిక విజయాలను అనేకం సాధించిందని నమ్ముతున్నాం. ఈ అజేయం అని మనం విశ్వసిస్తూన్న శాస్త్ర సామర్థ్యం ఏ మేరకు అజేయం అన్నది కరోనా సంక్షోభమే తెలుపుతోంది. 


ప్రకృతి మనిషికన్నా శక్తిమంతమైనదా కాదా? నిజంగానే ఆధునిక మానవుడు అంతకుమించిన శక్తిని సంతరించుకున్నాడా? ప్రజాస్వామ్యం మంచిదా లేక నియంతృత్వం దిశగా అడుగులు వేయటం అనివార్యమా? ప్రపంచీకరణ మంచిదా లేదా జాతీయ, ప్రాంతీయవాదాలకు పరిమితం కావటమే మానవజాతికి శ్రేయస్కరమా? మానవాళి ఆలోచనకు కరోనా పెట్టిన ఇటువంటి అంశాలు, సంశయాలు అనంతం.


మానవ నాగరికత ఇకముందు యుద్ధం, కరువులు, మహమ్మారులకు ఎర కావలసిన అవసరం లేదని ఘంటాపథంగా చెప్పిన శాస్త్రవేత్తల కథనాలు కాకమ్మ కబుర్లేనా? హోమోసెపియన్స్ ఇపుడు హోమో డుయస్‌గా రూపాంతరం చెందాయనటం నిజమా కాదా?


ఎవరి బతుకులు వాళ్ళే బతకాలి. ఎవరి చావు వాళ్ళే చావాలని దేశాధినేతలు అందరూ అంటున్నారు. ప్రపంచం అంటే ఒక పెద్ద షాపింగ్ మాల్ తప్ప మరింకేమీ కాదని ఒప్పుకుంటున్నారు. ప్రజలకు సంబంధించిన బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. చైనా,- అమెరికాల మధ్య సాగుతోన్న మాటల యుద్ధం కన్నా దీనికి పెద్ద తార్కాణం అవసరం లేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, కరోనాని చైనా వైరస్ అంటున్నాడు. ఇది అమెరికా తలపెట్టిన ప్రయోగం తాలూకు వైఫల్యం అని చైనా అంటున్నది. ఈ వైరస్‌తో తమ దేశం పేరును జోడించటం పట్ల అభ్యంతరం చెబుతున్నది. 1918లో స్పానిష్ ఫ్లూ అనేవారు కాబట్టి దీనిని చైనా వైరస్ అనటంలో తప్పేంలేదని అమెరికన్ అధికారులు వాదిస్తున్నారు.


ఒక వైపున భయం, మరో వైపున నమ్మకం. ఒక విచిత్రమైన విరోధాభాసలో ఉన్నాం. బెట్రండ్ రస్సెల్ ‘ఇన్ఫ్రా రేడియోస్కోప్’ శీర్షికతో ప్రపంచం అణుయుద్ధ ప్రమాదం గురించి ఆందోళనకు గురి అయివున్న సందర్భంలో ఒక కథ రాశారు. మంగళ గ్రహ వాసులు భూమండలాన్ని ఆక్రమించుకునే యత్నంలో వున్నట్లు ‘ఇన్ఫ్రా రేడియోస్కోప్’ యంత్రం కనిపెడుతుంది. సైంటిస్టుల పేరుతో జరిగిన ఈ ప్రచారం అగ్ర రాజ్యాలు ఏకం అయ్యేలా చేస్తుంది. ఒక సదుద్దేశంతో రూపొందించిన ఈ పథకం ఒక దశలో బట్టబయలు అవుతుంది. అగ్రరాజ్య కూటములు తిరిగి మళ్ళీ ఘర్షణకు దిగుతాయి. మళ్ళీ యుద్ధాలు.. మారణ హోమాలు.. ప్రపంచ వినాశనం.. అని ఈ కథ ఒక హెచ్చరిక చేస్తుంది. తమ విధేయతలను, ప్రాధాన్యాలను కొత్త పద్ధతిలో తిరిగి నిర్వచించుకుని, దానికి అనుకూలంగా వ్యవహరించని పక్షంలో ఈ వినాశనాన్ని నివారించటం అసాధ్యం అని ప్రబోధిస్తుంది.


రాసేల్ కార్సన్ ‘ది సైలెంట్ స్ప్రింగ్’ కూడా ఇదే రకమైన హెచ్చరిక చేస్తుంది. క్రిమి సంహారకాలు, కీటక నాశనులతో కేవలం క్రిమికీటకాలే కాదు, మెలమెల్లగా ప్రాణికోటి, అంతిమంగా ప్రకృతి కూడా అంతం అవుతుందని చెబుతుంది. ఇటువంటి ప్రమాదాలనే జాన్ హర్సే రచన ‘హిరోషిమా’ కూడా ప్రస్తావించింది. రసాయనిక ఆయుధాలు కేవలం ప్రాణాంతకమైనవి మాత్రమే కాదు, అవి ప్రపంచ మానవాళి ముంగిట తెరుచుకుంటూన్న నరక ద్వారాలని వివరించింది. మానవ నిర్మిత ఆయుధాలు, రసాయనాలు లేదా ఇతర గ్రహాల ఆక్రమణల పరిణామాలను ఇప్పుడు ఈ కరోనా సంక్షోభం నేపథ్యంలో అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యం పునాదులు అత్యంత బలంగా ఉన్నాయనుకునే యూరప్ రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం నియంతృత్వ ప్రమాదం నుంచి చాలా ముందుకు వచ్చానని భావించింది. ప్రస్తుతం అక్కడ యువకులు, వృద్ధులకు అందించే వైద్యం విషయంలో చూపుతున్న వివక్ష, మానవ హక్కులు, మటుమాయం అవుతోన్న రాజ్య సంక్షేమ స్వభావం దాచేస్తే దాగని అనేకానేక సత్యాలను ఆవిష్కరిస్తున్నాయి.


కరోనా అనంతర సమాజం అనేక మౌలికమైన ప్రశ్నలను సంధించబోతున్నది. ప్రజాస్వామ్యం గురించీ, పౌరసత్వం గురించీ మళ్ళీ సరికొత్త ప్రశ్నలతో సంసిద్ధం అవుతున్నది. ఆరోగ్య పరిరక్షణ విషయంలో పౌరులకు రాజ్యం ఏ మేరకు స్వేచ్ఛ ఇస్తుంది, ఏ మేరకు నియంత్రిస్తుంది అనే అంశాన్ని చర్చకు తెస్తుంది. ఇటలీ వర్సెస్ చైనా, చైనా వర్సెస్ బ్రిటన్ వర్సెస్ రష్యా వంటి చర్చలు అనివార్యంగా ముందుకు వస్తాయి. కేవలం మార్కెట్ నియమ నిబంధనలను పరిరక్షించటమే ప్రధాన ధ్యేయంగా భావిస్తున్న రాజ్యం, ఉదారవాద ఆర్థిక విధానాల వైఫల్యం గురించిన చర్చలు,- వివాదాలు ఇకముందు మరిన్ని కొత్త పుంతలు తొక్కనున్నాయి.


కరోనా వైరస్ వూహాన్ ప్రయోగశాలలోంచి వచ్చిందా, గబ్బిలంలోంచి వచ్చిందా, ఆధునిక మానవుని మితిమీరిన స్వార్థం కారణంగా అదుపు తప్పిన జీవ రసాయనిక ప్రయోగాల దుష్ఫలితమా అనేది తక్షణం తేలే అంశం కాదు. అయితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం వలన కలిగిన నష్టంతో పోల్చితే అనేక రెట్లు ఎక్కువ నష్టం ఈ వైరస్ వల్ల కలగబోతోందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. అత్యంత అమానవీయమైన నయా ఉదారవాద ప్రపంచీకరణ నిజ స్వరూపాన్ని వైరస్ బట్టబయలు చేసింది. అయితే, ఈ ప్రపంచీకరణను ప్రవచించిన సిద్ధాంతకర్తలు పెట్టుబడి, పారిశ్రామిక ఆదానప్రదానాలు మంచివే అని మళ్ళీ చెప్పటానికి ప్రయత్నిస్తారు. నియం త్రణ లేని రీతిలో సాగుతూన్న మనుషుల రాకపోకల వల్లనే ముప్పు ఏర్పడనుందని సిద్ధాంతీకరిస్తారు. ప్రపంచీకరణ గతం కన్నా వేగంగా ముందుకు సాగేలా చేయటానికి ఎంతకైనా తెగిస్తారు.


ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు, సంస్కృతి, పని ప్రదేశాల స్థితిగతులు - వాతావరణం, వీటన్నింటికీ సంబంధించిన మౌలికమైన మార్పులు రేపటి ప్రపంచంలో అనివార్యం అవుతాయి. ఏ ఆర్థిక విధానాలు ప్రపంచాన్ని ఈ స్థితికి తీసుకు వచ్చాయనే మీమాంస ఊపిరి పోసుకుంటుంది. నయా ఉదారవాద విధానాల కారణంగా పెరుగుతూ వస్తూన్న అసమానతల్నీ, వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వాల్నీ, ఆ ప్రభుత్వాలలో వున్న అమానవత్వాన్నీ స్పష్టంగా అర్థం చేసుకునే సందర్భాన్నీ, అవకాశాన్నీ కరోనా కల్పించింది. నయా ఉదారవాదంలోని డొల్లతనాన్ని బలంగా బయటపెట్టింది. అమెరికా తిరుగులేని ఒక అగ్రరాజ్యం కనుక అది ఎటువంటి పరిస్థితినైనా అతి సునాయాసంగా ఎదుర్కోగలదని ప్రపంచ వ్యాప్తంగా అధిక సంఖ్యాకుల నమ్మకాన్ని ఇది వమ్ము చేసింది.


పెట్టుబడిదారీ విధానానికీ, మార్కెట్ ఎకానమీకీ అమెరికా అతి పెద్ద నమూనా. ప్రజల ధన, మాన, ప్రాణాల పరిరక్షణకు పూర్తి బాధ్యత వహించవలసిన అక్కడి ప్రభుత్వం అందుకు ఎంతమాత్రం సంసిద్ధంగా లేదు. అమెరికాలో ఏదీ తయారు కాదు. వస్తువుల ఉత్పత్తితో సంబంధం లేని వ్యవస్థను అది బలోపేతం చేసుకుంది. అమెరికాలో వెంటిలేటర్లు లేవు. కనీసం శానిటైజర్లు లేవు. అన్నీ చైనా నుంచి రావాలి. అమెరికాలో ఒక డిఫెన్స్ చట్టం వుంది. ఇటువంటి స్థితిలో ఆ చట్టాన్ని అమలు చేయవచ్చు. అన్ని పనులు నిలిపివేసి వెంటిలేటర్లు తయారు చేయమని ప్రైవేటు కంపెనీలను ఆదేశించవచ్చు. అది మార్కెట్ ప్రయోజనాలకు ప్రతికూలం కాబట్టి ట్రంప్ ఆ పని చేయడు. పైగా జనం పెద్ద సంఖ్యలో చనిపోతారని పబ్లిగ్గా అంగీకరిస్తున్నాడు. పరిశ్రమల జాతీయకరణకు అమెరికా పూర్తిగా వ్యతిరేకం అంటున్నాడు. అమెరికాలో మార్కెట్ ఫండమెంటలిజం పరాకాష్టకు చేరుకుంది. అందుకే అక్కడి ప్రభుత్వం మార్కెట్ జోలికి వెళ్ళజాలదు. మార్కెట్ ద్వారానే ఆర్థిక వ్యవస్థ నిర్వహణ జరిగేలా చూస్తుంది. దాని కోసం ఎటువంటి దారుణమైన నిర్ణయం తీసుకునేందుకైనా అది సంసిద్ధంగా వుంటుంది. ఇదీ ట్రంప్ ప్రకటన సారాంశం.


మార్కెట్ వ్యవస్థను అధిగమించి ఆలోచిస్తేనే తప్ప ప్రజల సమస్యలకు పరిష్కారం దొరకదు. ఒక ప్రదేశంలో నివసించే ప్రజలందరి ఆకాంక్షలు, అవసరాల వ్యక్తీకరణే ప్రజాస్వామ్యం. వాటిని తీర్చడానికి మార్కెట్ అనేది ఒక సాధనం. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమం. మార్కెట్ కాదు. మార్కెట్ అనేది కేవలం ఉన్నత వర్గాల ప్రయోజనాలను పరిరక్షించే ఒక వ్యవస్థ. మార్కెట్‌కు స్వేచ్ఛను ప్రసాదించటం అంటే ఉన్నత వర్గాలకు స్వేచ్ఛను ప్రసాదించడమే. అంటే ఆ మేరకు మిగిలిన వర్గాలకు స్వేచ్ఛను నిరాకరించడమే. ప్రజాస్వామ్యం నియంత్రణలో మార్కెట్ వుండాలి తప్ప మార్కెట్ నియంత్రణలో ప్రజాస్వామ్యం ఉండకూడదు. కానీ ఉదారవాద ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని మార్కెట్ వ్యవస్థ స్థాయికి కుదించి వేశాయి. ఈ ఆర్థిక విధానాల కారణంగా ప్రాతినిధ్య ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తగిన జవసత్వాలను సమకూర్చుకుంటూ నూతన ఉత్తేజాన్ని పొందే శక్తిని పూర్తిగా కోల్పోయాయి. భారత దేశం కూడా ఇదే మార్గంలో ప్రయాణం చేస్తోంది. కరోనా సంక్షోభం పరిష్కారం విషయంలో మన కేంద్ర ప్రభుత్వం కన్నా రాష్ట్రాలు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నాయనటం అసత్యం కాదు.


రాజ్యవ్యవస్థ నిర్మాణంలోనే బాధ్యతారాహిత్యం అనే అంశ అంతర్లీనంగా వుంటుందని నయా ఉదారవాద పితామహులు ఒక సిద్ధాంతం చేశారు. దీనికి భిన్నంగా మార్కెట్ వ్యవస్థలో, తన మనుగడను సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో భాగంగానే అయినప్పటికీ బాధ్యతను స్వీకరించే గుణం ఉంటుందని ప్రపంచాన్ని నమ్మించారు. సంక్షేమ రాజ్యవ్యవస్థలోని బాధ్యతా రాహిత్యానికీ, మార్కెట్ వ్యవస్థలోని బాధ్యతను స్వీకరించే గుణానికీ మధ్య పోటీ పెట్టారు. తమకు అనుకూలంగా ప్రపంచం మద్దతును కూడగట్టారు. శ్రేయోరాజ్య వ్యవస్థలో గూడుకట్టుకున్న బాధ్యతా రాహిత్యాన్ని ప్రభుత్వ అసమర్థతగా చిత్రించటం తప్ప వ్యవస్థాగత మూలాల్లోకి వెళ్లి పరిష్కారాన్ని అన్వేషించే గట్టి ప్రయత్నం ఇప్పటివరకూ జరగలేదు.


రాజ్య నియంత్రణ లేని నయా ఉదారవాద పెట్టుబడిదారీ వ్యవస్థని యథాతథంగా కొనసాగించడమా లేదా సారభూత ప్రజాస్వామ్యాన్ని మరింత విస్తృతపరచటమా? ఇదీ ఈనాడు ప్రపంచ మానవాళి ముందు పడగ విప్పిన ప్రధానమైన ప్రశ్న. కరోనా అనంతర సమాజం తీసుకునే నిర్ణయం మీదనే మానవాళి భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

ఖాదర్ మొహియుద్దీన్

Advertisement
Advertisement
Advertisement