3 తరాలను మింగిన చెరువు

ABN , First Publish Date - 2022-03-14T09:09:07+05:30 IST

వరంగల్‌ జిల్లాలో విషాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఒక బాలుడు చెరువులో పడితే కాపాడేందుకు మరొకొరు..

3 తరాలను మింగిన చెరువు

  • కాళ్లు కడుక్కునేందుకు వెళ్లి నీట మునిగిన బాలుడు
  • కాపాడే ప్రయత్నంలో తండ్రి, తాత కూడా మృతి
  • వరంగల్‌ జిల్లాలో విషాదం


చెన్నారావుపేట, మార్చి 13: వరంగల్‌ జిల్లాలో విషాదం జరిగింది. ప్రమాదవశాత్తు ఒక బాలుడు చెరువులో పడితే కాపాడేందుకు మరొకొరు.. ఆ ఇద్దరిని కాపాడేందుకు ఇంకో వ్యక్తి నీళ్లలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ముగ్గురూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడం మరీ విషాదం. వరంగల్‌ జిల్లాల దుగ్గొండి మండలం అడవిరంగాపురం గ్రామం లో ఈ ఘటన జరిగింది. పోలీసులు, గ్రామస్థుల కథనం ప్రకారం వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలం చిన్నగురిజాల గ్రామానికి చెందిన వెంగళదాసు కృష్ణమూర్తి (55) విజయ దంపతులు వ్యవసాయం చేస్తారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు నాగరాజు(32) ఉన్నారు. అందరికీ పెళ్లిళ్లయ్యాయి. నాగరాజుకు భార్య సంధ్యారాణి, దీపక్‌, నాగరాజు అనే 12 ఏళ్ల వయసున్న కవలలు ఉన్నారు.


వీరికి దుగ్గొండి మండలం అడవి రంగాపురం గ్రామ శివారులోని సాగుభూమి ఉంది ఆదివారం కుటుంబసభ్యులందరూ కలిసి అక్కడికి వెళ్లి పండించిన మొక్కజొన్నను బస్తాల్లో నింపారు. మధ్యాహ్నం భోజనం కోసం పక్కనే ఉన్న రాళ్లకుంట చెరువు వద్దకు కాళ్లు చేతులు కడుక్కునేందుకు వెళ్లారు. ఈ క్రమంలోనే దీపక్‌ ప్రమాదవశాత్తు జారి చెరువులో పడ్డాడు.  గమనించిన తాత  కృష్ణమూర్తి, దీపక్‌ను కాపాడేందుకు నీళ్లలోకి దిగారు. ఇద్దరూ చెరువులో పడిపోయి కేకలు వేయడంలో ఆ ఇద్దరిని కాపాడేందుకు నాగరాజు లోపలికి దిగాడు. ముగ్గురూ చెరువులో మునిగిపోయారు. ఇదంతా నాగరాజు భార్య సంధ్యారాణి చూస్తుండగానే జరిగింది. ఆందోళనకు గురైన ఆమె వెంటనే ఫోన్‌లో గ్రామస్థులకు సమాచారం అందించింది. వారొచ్చేసరికే ఆలస్యమైపోయింది. చెరువులో నుంచి ముగ్గురి మృతదేహాలను బయటకు తీసి పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంధ్యారాణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతుల కుటుంబసభ్యులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు పరామర్శించారు. 

Updated Date - 2022-03-14T09:09:07+05:30 IST