ఎస్సారెస్పీ కెనాల్‌ ద్వారా బోల్‌చెరువు నింపాలి

ABN , First Publish Date - 2021-03-04T06:37:27+05:30 IST

వేలాది ఎకరాల వ్యవసాయ భూములకు నీరందించే బోల్‌చెరువును ఎస్సారెస్పీ డి-53 కెనాల్‌ ద్వారా నింపాలని జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ఎస్సారెస్పీ కెనాల్‌ ద్వారా బోల్‌చెరువు నింపాలి
ధర్మపురిలో మాట్లాడుతున్న అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

 డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ డిమాండ్‌

ధర్మపురి, మార్చి 3: వేలాది ఎకరాల వ్యవసాయ భూములకు నీరందించే బోల్‌చెరువును ఎస్సారెస్పీ డి-53 కెనాల్‌ ద్వారా నింపాలని జగిత్యాల డీసీసీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. ధర్మపురి పట్టణం లోని కాంగ్రెస్‌ నేత వేముల రాజేష్‌ స్వగృహంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లా డారు. ప్రస్తుతం బోల్‌చెరువులో నీరు తక్కువగా ఉందని, దీని వల్ల ఆ చెరువు కింది కమలాపూర్‌, రామయ్యపల్లె, తిమ్మాపూర్‌, బూరుగుపల్లె, రాయపట్నం తదితర గ్రామాలకు చెందిన 5వేల ఎకరాల వ్యవసాయ భూములకు సాగు నీరందడం ఇబ్బందిగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టు బ్యాక్‌ వాటర్‌ను రామయ్యపల్లె మీదుగా కమలాపూర్‌ సమీపంలో గల బోల్‌చెరువులో నింపితే వేసవి పంటకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అలాగే ధర్మపురి మండలంలోని అనేక గ్రామాలకు చెందిన రైతులకు రోళ్లవాగు, బోల్‌చెరువు ద్వారా ఏళ్ల తరబడి నుంచి సక్రమంగా సాగు నీరండం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు, పాలకులు స్పందించి వెంటనే ఆ రెండు చెరువుల ద్వారా సక్రమంగా సాగు నీరందించి రైతులను ఆదుకోవాలని లేకపోతే రాబోవు ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. అంతకుముందు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ బోల్‌చెరువును కాంగ్రెస్‌ నేతలతో కలిసి పరిశీలించారు. చెరువు పరిస్థితి గురించి సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు. సమావేశంలో మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగనభట్ల దినేష్‌, ఉపాధ్యక్షుడు వేముల రాజేష్‌, నియోజకవర్గ యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు సింహరాజు ప్రసాద్‌, పట్టణ అధ్యక్షుడు అయ్యోరు మహేష్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2021-03-04T06:37:27+05:30 IST