చెరువునే కప్పేశారు!

ABN , First Publish Date - 2021-07-28T04:28:01+05:30 IST

చెరువునే కప్పేశారు!

చెరువునే కప్పేశారు!
పలాసలో కూలగొట్టిన షాపుల వ్యర్థాలతో చెరువును కప్పేసిన దృశ్యం

పలాసలో షాపుల వ్యర్థాలతో నింపేసిన వైనం 

పలాస, జూలై 27: పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటిలో కేటీ రోడ్డును 80 అడుగులుగా విస్తరిస్తున్నారు. ఈ క్రమంలో రహదారికి ఇరువైపులా ఉన్న అనేక దుకాణాలను తొలగిస్తున్నారు. వాటి వ్యర్థాలను ఎక్కడ పారబోయాలో తెలియక.. ఏకంగా చెరువునే కప్పివేశారు. వివరాల్లోకి వెళితే.. పలాస శివారున ఉల్లాసపేట సమీపంలో కంబిరిగాం రోడ్డులో 60 సెంట్ల విస్తీర్ణంలో ఒకప్పుడు బంద ఉండేది. గతంలో ఈ చెరువులో నీరు నిల్వ చేసుకొని సమీప పొలాలకు వినియోగించుకునేవారు.  క్రమేపీ ఈ బందలో కొంత స్థలాన్ని స్థానికులు ఆక్రమించి గృహాలు నిర్మించారు. గత టీడీపీ హయాంలో ఎన్టీయార్‌ సుజలధార కింద తాగునీటి పథకం, బస్‌షెల్టర్‌ను ఒక సెంటు స్థలంలో నిర్మించారు. మిగిలిన బందలో.. రహదారి విస్తరణలో భాగంగా శిథిలమైన గోడలు, ఇతర వ్యర్థాలన్నీ పడేశారు. ఈ చెరువును పూర్తిగా కప్పేశారు. చెరువులు కాపాడాల్సిన అధికారులే దాన్ని కప్పివేయడం  చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై మునిసిపల్‌ కమిషనర్‌ రాజగోపాలరావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా, చెరువు ఇప్పటికే ఆక్రమణలకు గురైందని, ఉన్నది కాపాడేందుకు చెరువులో వ్యర్థాలను వేస్తున్నామని తెలిపారు. దీన్ని ప్రజల అవసరాలకు వినియోగిస్తామన్నారు. పట్టణ ఆరోగ్య కేంద్రం లేదా, అంగన్‌వాడి కేంద్రాన్ని నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ స్థలంలో ఇతరులు ఆక్రమణకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారుల ఆలోచన బాగానే ఉన్నా, బందను కప్పివేయడంపై స్థానికులు పెదవి విరుస్తున్నారు. 

 

Updated Date - 2021-07-28T04:28:01+05:30 IST