విద్వేష రాజకీయాలు

ABN , First Publish Date - 2022-08-16T08:46:11+05:30 IST

ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

విద్వేష రాజకీయాలు

కేంద్ర పెద్దలవి దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే ధోరణులు

రాష్ట్రాలను బలహీనపరిచేందుకు కుట్రలు

కేంద్రం అసమర్థతతో కుంటుపడిన ఆర్థికాభివృద్ధి

ఆకాశాన్నంటుతున్న నిత్యావసరాల ధరలు

సంక్షేమ పథకాలను ఉచితాలనడం అవమానం

అప్పులపై కొంతమంది ఉద్దేశపూర్వక దుష్ప్రచారం

కేంద్రంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్రహం

బలీయమైన ఆర్థికశక్తిగా రూపొందిన తెలంగాణ

దేశ వృద్ధిరేటు కన్నా తెలంగాణ వృద్ధిరేటు ఎక్కువ

నేటి నుంచి మరో 10 లక్షల మందికి పింఛన్లు

డయాలసిస్‌పై జీవించే కిడ్నీ రోగులకూ ఆసరా

స్వాత్రంత్య్ర దినోత్సవ ప్రసంగంలో సీఎం వెల్లడి

గోల్కొండ కోటలో జాతీయ పతాకావిష్కరణ


హైదరాబాద్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కేంద్రం అసమర్థత వల్లే దేశ ఆర్థికాభివృద్థి కుంటుపడిందని, ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని ఆరోపించారు. అంతర్జాతీయ విపణిలో రూపాయి విలువ ఎన్నడూ లేనంతగా పడిపోయిందన్నారు. కేంద్రంలో రాజ్యాంగ బద్ధమైన పదవుల్లో ఉన్న పెద్దలే విద్వేష రాజకీయాలకు, దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే ధోరణులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సోమవారం భారత 76వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గోల్కోండ కోటలో జాతీయ పతాకాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత అన్నారు. కానీ, కేంద్రం ఆ బాధ్యతను సక్రమంగా నిర్వహించకపోగా పేదలకు అందించే సంక్షేమ పథకాలకు ‘ఉచితాలు’ అనే పేరును తగిలించి అవమానించడం గర్హనీయమన్నారు. పసిపిల్లలు తాగే పాల నుంచి శ్మశానవాటికల నిర్మాణం వరకు ప్రజల అవసరాలపై కేంద్రం ఎడాపెడా పన్నులు విధిస్తోందని, పేద, మధ్యతరగతి ప్రజలపై విపరీతమైన భారం మోపుతోందని ధ్వజమెత్తారు. ప్రపంచవ్యాప్తంగా భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశంగా భారతదేశం ప్రశంసలందుకుందని, అలాంటి దేశ ప్రతిష్ఠను దెబ్బతీసే ధోరణులు ప్రస్తుతం చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోనూ మత చిచ్చురేపి..శాంతిని, సామరస్య వాతావరణాన్ని దెబ్బతీసేందుకు, తద్వారా అభివృద్ధిని ఆటంకపరిచేందుకు విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలోని మేధావి లోకం, యువత, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి ఈ శక్తుల కుట్రలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు. 


కేంద్రం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే..

దేశంలో నిరుద్యోగం తీవ్రరూపం దాలుస్తోందని సీఎం కేసీఆర్‌ అన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు తమ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజిస్తూ నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎందరో మహానుభావుల కృషి ఫలితంగా ఏర్పడ్డ స్వతంత్ర భారత దేశంలో భిన్న మతాలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతులతో ఏకత్వ భావన పాదుకుందని తెలిపారు. తరతరాలుగా భారతదేశం నిలబెట్టుకుంటూ వస్తున్న శాంతియుత, సహజీవనాన్ని విచ్ఛిన్నం చేేసందుకు రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారే నేడు ఫాసిస్టు దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ దుర్మార్గాన్ని చూసి స్వాతంత్య్ర సమరయోధుల ఆత్మలు ఘోషిస్తాయన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జోడు గుర్రాల్లాగా ప్రగతి రథాన్ని నడిపించాలని రాజ్యాంగవేత్తలు కోరుకుంటే.. ప్రస్తుతం ఢిల్లీ గద్దెపై ఉన్న ప్రభుత్వం సమాఖ్య విలువలకు తూట్లు పొడుస్తూ రాష్ట్రాలను ఆర్థికంగా బలహీనపరిచే కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం పన్నుల రూపంలో వసూలు చేసే ఆదాయంలో నుంచి రాష్ట్రాలకు న్యాయబద్ధంగా 41 శాతం వాటా చెల్లించాల్సి ఉంటుందన్నారు. కానీ, కేంద్రం దురుద్దేశంతో ఈ వాటాను కుదించేందుకు పన్నుల రూపంలో కాకుండా సెస్సుల విధింపు రూపంలో దొడ్డిదారిన ఆదాయం సమకూర్చుకుంటోందన్నారు. తద్వారా రాష్ట్రాలకు 2022-23లో రావాల్సిన ఆదాయంలో 11.4 శాతం గండి పెడుతోందని, 29.6 శాతం మాత్రమే ఇచ్చి అన్యాయం చేస్తోందని తెలిపారు. ఇది చాలదన్నట్లు రాష్ట్రాల ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీస్తూ నిరంకుశంగా ఆంక్షలు విధిస్తోందని విమర్శించారు. 


రాజ్యాంగ స్ఫూర్తిని అపహాస్యం చేస్తున్నాం..

సహకార సమాఖ్య స్ఫూర్తి అంటూ ఆదర్శాలు వల్లించే కేంద్ర ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం అధికారాల కేంద్రీకరణకు పాల్పడుతోందని సీఎం కేసీఆర్‌ ఆరోపించారు. భారతదేశం రాష్ట్రాల సమాహారం అని పేర్కొన్న రాజ్యాంగం తొలి అధికరణాన్నే కేంద్రం అపహాస్యం చేస్తోందన్నారు. ఉమ్మడి జాబితాలోని అంశాలపై రాష్ట్రాలను సంప్రదించకుండానే నిర్ణయాలు తీసుకొని.. తమపై రుద్దుతోందని విమర్శించారు. రైతు వ్యతిరేక చట్టాలనూ ఇలాగే రుద్దే ప్రయత్నం చేస్తే.. దేశ రైతాంగం తిరగబడిందని, దీంతో కేంద్రం తోక ముడిచిందని ఎద్దేవా చేశారు. దేశంలోని 28 రాష్ర్టాల్లో 22 రాష్ర్టాలు తెలంగాణ కన్నా ఎక్కువ అప్పులు తీసుకున్నాయని తెలిపారు. మన రాష్ట్ర జీఎ్‌సడీపీలో అప్పుల నిష్పత్తి 23.5 శాతం కాగా, జీడీపీలో దేశం అప్పుల నిష్పత్తి 50.4 శాతం ఉందన్నారు. ఎఫ్‌ఆర్‌బీఎం. చట్ట పరిమితిలోనే రాష్ట్రం అప్పులున్నాయని, ఈ వాస్తవాన్ని గమనించకుండా బురదజల్లడమే లక్ష్యంగా కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 2014లో తెలంగాణకు సంక్రమించిన అప్పు రూ.75,577 కోట్లు ఉండగా.. తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పు రూ.1,49,873 కోట్లు అని తెలిపారు. ఈ నిధులను ప్రాజెక్టుల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు పెట్టుబడి వ్యయంగానే వినియోగించామని చెప్పారు. 75 ఏళ్లుగా దేశాన్ని పాలించిన ప్రభుత్వాలు తమ చేతకానితనంతో ప్రజలకు స్వచ్ఛమైన మంచినీళ్లు కూడా ఇవ్వలేదని విమర్శించారు. తెలంగాణలో మాత్రం మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ స్వచ్ఛమైన నీటిని ఉచితంగా సరఫరా చేస్తున్నామన్నారు. 


మహనీయుల త్యాగాలు చిరస్మరణీయం..

స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు జరుపుకొంటున్న ఈ సందర్భం ప్రతి భారతీయుని హృదయం ఉప్పొంగిపోయే విశిష్ట సందర్భమని సీఎం కేసీఆర్‌ అన్నారు. ఈ నెల 8న ప్రారంభమైన వజ్రోత్సవాలను 22వ తేదీ వరకు దేశభక్తిని చాటేలా పలు కార్యక్రమాలతో రాష్ట్రమంతటా జరుపుకొంటున్నట్లు తెలిపారు. మహాత్మాగాంధీ, సుభాష్‌ చంద్రబోస్‌, భగత్‌ సింగ్‌, ఝాన్సీలక్ష్మీబాయి, బాలగంగాధర తిలక్‌ వంటి ఎందరో మహనీయుల త్యాగఫలాన్ని దేశ ప్రజలు అనుభవిస్తున్నారని ఈ సందర్భంగా కేసీఆర్‌ గుర్తు చేశారు. నవభారత నిర్మాణంలో మహోన్నతమైన పాత్ర పోషించిన తొలిప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ, తొలి హోంమంత్రి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌, భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ వంటి మహానుభావుల ేసవలు చిరస్మరణీయమన్నారు. భారత స్వాతంత్య్ర పోరాటంలో తెలంగాణకు చెందిన తుర్రేబాజ్‌ఖాన్‌, రాంజీ గోండు, మౌల్వీ అలావుద్దీన్‌, సరోజినీ నాయుడు, సంగెం లక్ష్మీబాయి, రామానంద తీర్థ, పీవీ నర్సింహారావు వంటి మహోన్నతుల పోరాటం ప్రజల గుండెల్లో నిలిచిపోయిందన్నారు. స్వాతంత్రోద్యమ సమయంలో హైదరాబాద్‌ను సందర్శించిన గాంధీజీ తెలంగాణ ప్రజల సామరస్య జీవనశైలిని గంగా జమునా తెహజీబ్‌గా అభివర్ణించడం మనకు గర్వకారణమన్నారు. అదే జాతీయోద్యమ స్ఫూర్తి, అహింసా మార్గంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని తెలిపారు. 


సీఎం ప్రసంగంలోని మరికొన్ని అంశాలు..

‘‘దేశ నిర్మాణంలో తెలంగాణ అద్భుతమైన పాత్ర పోషిస్తూ బలీయమైన ఆర్థికశక్తిగా రూపొందింది. అన్ని రంగాలకు 24 గంటలు విద్యుత్తు అందిస్లూ ఆదర్శ రాష్ట్రంగా నిలిచింది. గొర్రెల పెంపకంలో దేశంలోనే నెంబర్‌వన్‌. గ్రామీణ జీవన ప్రమాణాల్లోనూ మొదటి స్థానంలో ఉంది. ఐటీ రంగ ఎగుమతుల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా 26.14 శాతం వృద్ధిరేటుతో రాష్ట్రం దూసుకుపోతోంది. గత ఏడేండ్లుగా రాష్ట్రం సొంత పన్నుల ఆదాయం (ఎస్‌వోటీఆర్‌)లో 11.5 శాతం వృద్ధిరేటు సాధించింది. ఈ విషయాన్ని కాగ్‌ నివేదిక వెల్లడించింది. భారతదేశ వృద్ధిరేటు కంటే తెలంగాణ వృద్ధి రేటు 27 శాతం అధికంగా ఉంది. 2021-22 నాటికి రాష్ట్రంలో తలసరి ఆదాయం రూ.2.75 లక్షలకు పెరిగింది. ప్రస్తుత జాతీయ తలసరి ఆదాయం రూ.1.50 లక్షలు మాత్రమే ఉంది. ఆసరా పథకంలో భాగంగా మరో 10 లక్షల మంది లబ్ధిదారులకు పింఛన్లు ఇస్తాం. దీంతో రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 46 లక్షలకు చేరుతుంది. దళితుల అభ్యున్నతి లక్ష్యంగా దళితబంధు పథకాన్ని అమల్లోకి తెచ్చాం. ప్రతి దళిత కుటుంబానికీ రూ.10 లక్షలు ఆర్థిక సహాయం అందిస్తున్నాం. దళితులు వ్యాపార రంగంలో ఎదిగేందుకు ప్రభుత్వ లైసెన్సులతో ఏర్పాటు చేసే వ్యాపారాల్లో 10 శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తున్నాం. 


గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యేలా..

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు అన్నిరకాల వృత్తిదారులకు ప్రయోజనం కలిగించే పథకాలను అమలు చేస్తున్నాం. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు బీమా, పంట సాగుకోసం రైతు బంధు ద్వారా ఆర్థిక సాయం అందిస్తున్నాం. పంజాబ్‌ తర్వాత దేశంలో అత్యధికంగా వరిని పండిస్తున్న రాష్ట్రంగా తెలంగాణ చరిత్ర సృష్టించింది. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలకు ప్రాధాన్యం కల్పిస్తున్నాం. రాబోయే రెండేళ్లలో ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను, నర్సింగ్‌ కళాశాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల రేటు 2014లో 30శాతం మాత్రమే ఉండగా.. ఇప్పుడు 52 శాతానికి పెరిగింది. ప్రసూతి మరణాల రేటు 2014లో ప్రతి లక్షకు 92 ఉండగా.. 2021 నాటికి 56కు తగ్గింది. ప్రతి వెయ్యి జననాల్లో శిశు మరణాల రేటు 2014లో 39 ఉండగా, 2021 నాటికి 21కి తగ్గింది. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా మరో మానవీయమైన నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. డయాలసి్‌సపై ఆధారపడి జీవిస్తున్న కిడ్నీ రోగులకు సైతం ఇక నుంచి ఆసరా పింఛన్‌ అందజేస్తాం. రాష్ట్రంలో ఇప్పటివరకు 1.32 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. ప్రస్తుతం 91,142 ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేసుకుంటున్నాం. తెలంగాణ అభ్యర్థులకే 95 శాతం ఉద్యోగాలు దక్కేవిధంగా లోకల్‌ క్యాడర్‌ వ్యవస్థను రూపొందించుకున్నాం.   


కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌తో ఖ్యాతి..

శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఇటీవల కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ప్రారంభించాం. ఇది తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేసింది. పరిశ్రమల స్థాపనకు అత్యంత సులభతరంగా అనుమతులు అందిస్తున్న ఏకైక రాష్ట్రం. అందుకే తెలంగాణకు అంతర్జాతీయ పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఎనిమిదేళ్లలో రూ.2,32,111 కోట్ల పెట్టుబడులు తరలి రావడంతోపాటు 16.50 లక్షల ఉద్యోగాల కల్పన జరిగింది’’ అని సీఎం కేసీఆర్‌ వివరించారు. కామన్వెల్త్‌ క్రీడల్లో 61 పతకాలను సాధించిన భారత క్రీడాకారులను అభినందించారు. రాష్ట్రానికి 6 పతకాలను సాధించి పెట్టిన తెలంగాణ క్రీడాకారులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. అంతకుముందు గోల్కొండ కోటలో నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన ముఖ్యమంత్రి.. ముందుగా పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు

Updated Date - 2022-08-16T08:46:11+05:30 IST