బెడిసిన రంగుల రాజకీయం

ABN , First Publish Date - 2020-06-05T05:56:37+05:30 IST

రాజకీయ స్థాయిలోనే కాకుండా ఉన్నతాధికారుల స్థాయిలోను బాధ్యతాయుత దృక్పథం, జవాబుదారీ సన్నగిల్లడం రాష్ట్రాభివృద్ధికి శాపమైంది. పరిపాలనా రంగంలో అధికార యంత్రాంగం అత్యంత కీలకమైనది...

బెడిసిన రంగుల రాజకీయం

ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడం, రంగులు తొలగించడం విషయమై కోర్టుల్లో వాదించడానికి చేసిన మొత్తం ఖర్చు వేలకోట్లలో ఉంటుందని అంచనా. ఈ ఖర్చును పోలవరం నిర్మాణానికి పెట్టివుంటే పోలవరం మరో 8 శాతం పూర్తి అయివుండేది. ఈ ప్రజాధనం వృధా కావడానికి ఎవరు బాధ్యులు?


రాజకీయ స్థాయిలోనే కాకుండా ఉన్నతాధికారుల స్థాయిలోను బాధ్యతాయుత దృక్పథం, జవాబుదారీ సన్నగిల్లడం రాష్ట్రాభివృద్ధికి శాపమైంది. పరిపాలనా రంగంలో అధికార యంత్రాంగం అత్యంత కీలకమైనది. పరిపాలనకు అనువుగా వివిధ స్థాయిలలో అధికార వ్యవస్థ ఏర్పాటు అయినది. మొదట ఐఏఎస్, తరువాత ఐపీఎస్, ఐ ఎఫ్ఎస్ ఇతర అఖిల భారత సర్వీసులను ప్రాధాన్య పరంగా గుర్తిస్తారు. అఖిల భారత సేవల చట్టం ప్రకారం ఈ అధికారులకు విశేషాధికారాలు వున్నాయి. అఖిల భారత సర్వీసు అధికారులు సర్వీసులో చేరే ముందు రాజ్యాంగాన్ని, చట్టాలను కాపాడతామని ప్రమాణం చేస్తారు. ప్రజాప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షిస్తూ, రాజ్యాంగ నిబంధనలు పాటించాల్సిన అవసరాన్ని ఐ ఏ ఎస్ అధికారులు గుర్తించక పోవడం భాధాకరం. అఖిలభారత సర్వీసు అధికారులకు రాజ్యాంగ నిర్మాతలు కల్పించిన హక్కులు,అధికారాలు సామాన్యమైనవి కావు.


ముఖ్యమంత్రి స్థాయిలో మంత్రి వర్గం నిర్ణయం తీసుకున్నా అడ్డుపడే అధికారం బిజినెస్ రూల్స్ రూపంలో ఐ ఏ ఎస్ అధికారులకు దఖలు పడింది. ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడాన్ని కోర్టులు తప్పు పడతాయని తెలిసికూడా నిబంధనలు పాటించకుండా అధికారులు వేలకోట్లు వ్యయం చేయడం బాధ్యతా రాహిత్యం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫోటోతో పాటు వైసీపీ మూడు రంగులు వేయాలని ఆదేశిస్తు మెమో నెంబర్ 751 పంచాయితీ రాజ్ కమిషనర్ గిరిజా శంకర్ విడుదల చేశారు. దీని పై కొందరు హైకోర్టుకు వెళ్ళడంతో ఈ రంగుల పై కమిషనర్ జారీ చేసి మెమో రద్దు చేసి పది రోజుల్లో పార్టీ రంగులు తొలగించాలని, ప్రధాన కార్యదర్శి మా ఆదేశాలు అమలు చేస్తున్నట్లు ఆధారాలతో సహ నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది మార్చి 10న దీంతోరాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు వెళ్లింది.


సుప్రీంకోర్టు కోర్టు కూడా మూడురంగులు వెయ్యడాన్ని తిరస్కరించి హైకోర్టు తీర్పును సమర్ధించింది మార్చి 23న. కానీ రాష్ట్ర ప్రభుత్వం లెక్క చెయ్యకుండా మరో రూపంలో మూడు రంగులకు మరొక రంగు మట్టి రంగు కలిపి వేయాలని 623 జీఓ జారీ చేసింది. దీని పైనా హైకోర్టు రెండవసారి మే 22న తప్పు పట్టి నాలుగు రంగుల నమూనాను తిరస్కరించి 623 జీఓ రద్దు చేసింది. మే 28 కల్లా రంగులు తొలగించకపోతే కోర్టు ధిక్కరణ కింద పరిగణించాల్సి వస్తుందని హైకోర్టు హెచ్చరించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పీటీషన్ పై లావు నాగేశ్వర రావు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపి మూడు రంగులు నాలుగు వారాల్లో తొలగించాల్సిందే అని బుధవారంనాడు తీర్పు చెప్పి రెండవ సారి తప్పుపట్టింది. ఏపీ ప్రభుత్వం వేసిన పిటీషన్ను కొట్టివేసింది. 


హైకోర్టు తీర్పును అమలు చెయ్యకూడదన్న ఉద్దేశంతోనే కొత్త జీఓ లను తేవడాన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టింది. ప్రభుత్వం ఇచ్చే పాలనా పరమైన ఆదేశాలు ఏవైనా న్యాయ సమీక్షకి లోబడే వుండాలని, వాటి పై తీర్పు ఇచ్చిన తరువాత ప్రభుత్వం పాటించాల్సిందే అని,కోర్టు ఆదేశాలు పాటించక పోతే చట్టాన్ని ఉల్లంఘించినట్లే అని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఈ కేసులు కోర్టు ధిక్కరణ ఎదుర్కొంటున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, ఇతర అధికారులు రెండు సార్లు న్యాయస్థానం ముందు హాజరు కావాల్సి వచ్చింది. ప్రభుత్వ కార్యాలయాలకు రంగులు వేయడం పై ప్రభుత్వం కానీ, అధికారులు కానీ అంత మొండిగా పోవాల్సిన అవసరం ఏమిటో తెలియదు. ప్రభుత్వం కార్యాలయాలకు రంగులువేయడం వల్ల ప్రజల అవసరాలు, ఆకలి తీరుతాయా? ప్రజాధనం దుర్వినియోగం తప్ప ప్రజలకు పైసా ప్రయోజనం వున్నదా?రంగులు వేయడానికి,రంగులు తొలగించడానికి,ఈ విషయం పై కోర్టుల్లో వాదించడానికి చేసిన మొత్తం ఖర్చు రూ4,000 వేల కోట్లు వుంటుందని సమాచారం.


ఈ ఖర్చును పోలవరం నిర్మాణానికి పెట్టివుంటే పోలవరం మరో 8 శాతం పూర్తి అయి వుండేది. పైగా రివర్స్ టెండర్స్ ద్వారా ప్రజాధనం ఆదా చేస్తున్నామని గొప్పలు చెప్పుకొంటున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేసి రూ నాలుగు వేల కోట్లు ప్రజాధనం బూడిదలో పొయ్యడమేనా మీరు చేసే ఆదా? మరి రూ.4 వేలకోట్లు ప్రజాధనం వృధా కావడానికి ఎవరు బాధ్యులు? వృధా చేసిన వారి పై ఎందుకు చర్యలు తీసుకోకూడదు? సీయం జగన్మోహన్ రెడ్డి వద్ద మన్ననలు పొందేందుకు కొందరు అధికారులు అడ్డగోలు విధానాలు రూపొందిస్తున్నారు. ప్రభుత్వ పెద్దల కోర్కెలు తీర్చేందుకు ఎన్ని సార్లు అయినా కోర్టులతో చివాట్లు తినడానికి కూడా సిద్ధపడుతున్నారు. చట్ట పరిధిలో వారి బాధ్యతలు నిర్వహించాల్సిన వారే చట్ట ధిక్కార చర్యలతో కోర్టుల చుట్టూ తిరుగుతూ రాష్ట్ర ప్రతిష్టను దిగజారుస్తున్నారు. వైసీపీ జెండా మూడు రంగులు వేయాలని వివాదాస్పద మెమో ఇచ్చిన ఘనత పంచాయితీ రాజ్ అధికారులకే దక్కింది.ఈ వికృత ధోరణి అధికారులు మార్చుకోక పోతే ఏదో ఒక రోజు ప్రభుత్వం మూల్యం చెల్లించాల్సి వస్తుంది.


 గతంలో ఏ ప్రభుత్వం 68 సార్లు కోర్టులతో అక్షింతలు వేయించుకొన్న దాఖలాలు లేవు. హైకోర్టు తీర్పులను ప్రభుత్వాలు గౌరవించాలి. ప్రజలు తనను అధిక స్థానాల్లో గెలిపించారని, కోర్టు తీర్పులను ధిక్కరిస్తూ తాము ఏది చేసినా చెల్లు బాటుకావాలని, తాము అనుకొన్నది జరిగి తీరాలని, తాము చట్టాలకు, రాజ్యాంగానికి, న్యాయస్థానాలకు అతీతులం అన్న విధంగా వ్యవహరించడం సమర్ధనీయం కాదు. రంగులరాజ్యం, రద్దులరాజ్యం, రాయితీల రాజ్యం రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుంది. ప్రజా ప్రయోజనాలకు పెద్ద పీట వెయ్యాల్సిన ప్రభుత్వం స్వార్ధ రాజకీయ ప్రయోజనాలకు పెద్ద పీట వేయడం వల్లనే కోర్టులతో ప్రభుత్వం తలంటించు కోవాల్సి వచ్చింది. గతంలో ప్రభుత్వ విధాన నిర్ణయాలపై వచ్చిన హైకోర్టు వ్యతిరేక తీర్పులపై ముఖ్యమంత్రులు, మంత్రులు బాధ్యత వహించిన సందర్భాలు వున్నాయి. బాధ్యత మాట ఎలా వున్నా ప్రభుత్వం ఇప్పటికైనా మూర్ఖపు నిర్ణయాలు తీసుకోకుండా ప్రజాప్రయోజనాలు, రాష్ట్ర ప్రయోజనాలే ధ్యేయంగా నిర్ణయాలు తీసుకొంటుందని, ఇప్పటివరకు తీసుకొన్న నిర్ణయాలపై ప్రభుత్వం ఆత్మ శోధన చేసుకొంటుందని ఆశిద్దాం.

నీరుకొండ ప్రసాద్

Updated Date - 2020-06-05T05:56:37+05:30 IST