రాజుకుంటున్న రాజకీయ వేడి..

ABN , First Publish Date - 2022-08-08T06:27:05+05:30 IST

ఎన్నికలకు ఇంకా రెండేళ్ల కాలపరిమితి ఉన్నా ఇప్పటి నుంచే రాజకీయ పక్షాల్లో ఎన్నికల వేడి రగులుతోంది. ఎన్నికల కోసం పార్టీలు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. జనంతో మమేకమై ప్రజా సమస్యలపై పోరాటం చేసి ప్రజలకు దగ్గరైన వారికే టికెట్లు

రాజుకుంటున్న రాజకీయ వేడి..

బాదుడే బాదుడు పేరిట జనంలోకి టీడీపీ

నవరత్నాలు అంటూ గడపగడపకు వైసీపీ 

యువ సంఘర్షణ పేరుతో బీజేపీ ర్యాలీలు 

రెండేళ్ల ముందే ఎన్నికల వేడి 

(కడప - ఆంధ్రజ్యోతి) : ఎన్నికలకు ఇంకా రెండేళ్ల కాలపరిమితి ఉన్నా ఇప్పటి నుంచే రాజకీయ పక్షాల్లో ఎన్నికల వేడి రగులుతోంది. ఎన్నికల కోసం పార్టీలు ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నాయి. జనంతో మమేకమై ప్రజా సమస్యలపై పోరాటం చేసి ప్రజలకు దగ్గరైన వారికే టికెట్లు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు స్పష్టంగా చెబుతున్నారు. ఈసారి ఎలాంటి మొహమాటాలకు తావు ఇవ్వనని పనితీరు, సర్వే ఆధారంగా టికెట్లు ఇస్తానని ఇప్పటికే చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. ఇక గడపగడపకు ప్రభుత్వాన్ని సీఎం జగన్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. సర్వే ఆధారంగానే టికెట్లు ఇస్తానంటూ చెప్పుకొచ్చారు. ఇక బీజేపీ కూడా తాము సైతం అంటూ రంగంలోకి దిగింది. బీజేపీ సంఘర్షణ పేరుతో ర్యాలీలు నిర్వహిస్తోంది. టీడీపీ బాదుడే బాదుడు పేరుతో జనంలోకి వెళ్లిపోతోంది. గడపగడపకు ప్రభుత్వం అంటూ వైసీపీ ఎమ్మెల్యేలు ఇల్లిల్లు తిరుగుతున్నారు. వెరసి జిల్లాలో రాజకీయ వేడి రగులుకుంటోంది. 2019లో జరిగిన ఉమ్మడి జిల్లా సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ క్వీన్‌ స్వీప్‌ చేసింది. పది అసెంబ్లీ , రెండు ఎంపీ స్థానాలు కైవసం చేసుకుంది. ఇక ఏడాది క్రితం జరిగిన స్థానిక సంస్థ ఎన్నికల్లో వన్‌సైడ్‌ విజయం కోసం బెదిరింపులు, ప్రలోభాలకు తెరలేపింది. కార్పొరేషన్‌, మున్సిపల్‌, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో చాలా చోట్ల టీడీపీ పోటీ చేయలేని పరిస్థితి నెలకొంది. పార్టీల రహితంగా జరిగే పంచాయతీ ఎన్నికల్లోనూ ఏకగ్రీవాల కోసం వైసీపీ కుయుక్తులు పన్నింది. చివరకు కొన్నిచోట్ల టీడీపీ అభ్యర్థులు కూడా గెలుపొందారు. 


బాదుడే బాదుడుతో టీడీపీ

మూడేళ్ల వైసీపీ పాలనలో అభివృద్ధి నిల్‌, కేవలం బటన్‌ నొక్కుడు, గ్రామాల్లో అభివృద్ధి నిల్‌, రోడ్లు, డ్రైనేజీలు లేవు, అభివృద్ధి లేక జనం అవస్థలు పడుతున్నారు. కేవలం గ్రామాల్లో నిర్మించిన సచివాలయ భవనాలు, రైతు భరోసా కేంద్రాలనే ప్రభుత్వం అభివృద్ధిగా చెప్పుకుంటోంది. ఆయా కేంద్రాలకు జనం ఏడాదికి నాలుగుసార్లు పోవడం కూడా గగనమే. అయితే దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ఇస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతోంది. అయితే సంక్షేమం మాటున పన్నుల భారం జనంపై మోపింది. పొరుగు రాష్ట్రాలు పెట్రోల్‌ డీజల్‌పై పన్నులు తగ్గిస్తే వైసీపీ ప్రభుత్వం మాత్రం తగ్గేదేలా అంటూ తగ్గించలేదు. ఇక పట్టణాల్లో జనం ఆస్తి, చెత్త పన్ను పెంపును వద్దే వద్దన్నా లెక్క చేయకుండా పన్నులు పెంచేశారు. దీంతో పాటు ఆర్టీసీ బస్సు చార్జీలు, కరెంట్‌ చార్జీలు పెరిగిపోయాయి. డీజల్‌, పెట్రోల్‌ ధరల పెంపుతో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. మూడేళ్ల క్రితం రూ.2 వేలతోనే నెలసరి సరుకులు తెచ్చుకోవాల్సిన కుటుంబాలు ఇప్పుడు అంతకు రెండింతలు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆస్తి పన్ను పెంపుతో ఇంటి అద్దెలు పెరిగిపోయాయి. చెత్త పన్నుపై కడప జనం కదం తొక్కారు. పన్ను కట్టమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2019 ఎన్నికల్లో జగన్‌కు అప్పటి టీడీపీ సర్కార్‌పై బాదుడేబాదుడు అంటూ ధరల పెంపుపై ప్రచారం చేశారు. ఇప్పుడు ఆ స్లోగన్‌ జగన్‌కు రివర్స్‌ అయ్యింది. జగన్‌ పాలనలో జనంపైన మోపిన భారాన్ని ఇంటింటికీ తెలియజేసేందుకు బాదుడేబాదుడు కార్యక్రమం పేరిట టీడీపీ ఇంటింటికి వెళుతోంది. ఇప్పటికే జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం చేపట్టారు. చంద్రబాబు హయాంలో ఉన్న ధరలు, వైసీపీ పాలనలో ఉన్న ధరలు, దేనిపై పన్నులు మోపారన్న దానిని కరపత్రాలు ముద్రించి ఇంటింటికీ వెళుతున్నారు. నవరత్నాలు కొందరికి వస్తే పన్నుల భారం మాత్రం అందరిపై పడింది. దీంతో టీడీపీ బాదుడే బాదుడుకు మంచి స్పందన వస్తోంది. దీంతో ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా జనాల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేశారు. మండల స్థాయిలో కూడా బాదుడే బాదుడు కార్యక్రమాన్ని తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఇక వ్యవసాయ మోటార్లకు మీటర్ల ఏర్పాటును అడ్డుకునేందుకు రైతులతో కలిసి పోరాటం చేసేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే రాయలసీమ జిల్లాకు చెందిన టీడీపీ నేతలతో బద్వేలులో రైతు పోరు సదస్సు నిర్వహించారు. 


నవరత్నాలపై వైసీపీ ఆశలు

అన్ని నొప్పులకు ఒకటే మందు అంటూ ఒకప్పుడు ఒక యాడ్‌ వచ్చేది. ఆ విధంగా నవరత్నాలతోనే జనం వైసీపీ ప్రభుత్వం వైపు ఉంటున్నారని సీఎం జగన్‌ మొదలుకుని ఇతర మంత్రులు విశ్వసిస్తున్నారు. నవరత్నాలతో జనం వైసీపీకీ అండగా ఉంటున్నారని భావిస్తున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ప్రకృతి వైపరీత్యాలప్పుడు పంట నష్టపోతే అందే పరిహారం ఇతర వర్గాల్లోని పేదలకు ఆయా శాఖల ద్వారా ఆర్థిక సాయం అందించేది. అయితే ఇప్పుడు జగన్‌ సర్కార్‌ వాటన్నింటిని క్రోడీకరించి మూడేళ్ల వైసీపీ పాలనలో మీ కుటుంబానికి ఇంత లబ్ధి జరిగిందంటూ గడపగడప పేరిట ఇంటింటికి వెళ్లి చెబుతున్నారు. అయితే దీనికంత స్పందన లేదని వైసీపీ నేతలు అంటున్నారు. ఇసుకంతైనా అభివృద్ధి లేకపోవడం. కేవలం సచివాలయం, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం తప్ప ఎక్కడా అభివృద్ధి జరగడం లేదు. గ్రామాల్లో కనీసం రోడ్లు కూడా లేని పరిస్థితి నెలకొంది. జిల్లాలో కొన్ని చోట్ల జనం నిలదీస్తుండడం వైసీపీని ఎంతో కలవరపరుస్తోంది. డిప్యూటీ సీఎం మొదలుకొని ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, గడపగడపకు ప్రభుత్వమని ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇంటి బాట పట్టారు. బీజేపీ కూడా యువ సంఘర్షణ పేరుతో గత నాలుగు రోజులుగా ర్యాలీలు నిర్వహిస్తోంది. వచ్చే ఎన్నికలో జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తానని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఇలా ఆయా పార్టీలు ప్రజా క్షేత్రంలోకి వెళ్లడంతో రాజకీయ వేడి రగులుకుంటోంది.



Updated Date - 2022-08-08T06:27:05+05:30 IST