Abn logo
Mar 27 2020 @ 05:42AM

ఎక్కడికక్కడ కట్టుదిట్టం

తగ్గిన జనసంచారం..పెరిగిన చైతన్యం

ఉదయం 6 గంటల నుంచి 1 వరకే

నిత్యావసర సరుకుల విక్రయాలు 

వాహనాలను నిలుపుదల చేసిన పోలీసులు

గ్రామాల్లో బహిరంగ ప్రదేశాల్లో కూరగాయల విక్రయం


ఏలూరు రూరల్‌, మార్చి 26 : కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు అమల వుతున్న లాక్‌డౌన్‌ నాలుగో రోజుకు చేరింది. గురువారం పోలీసులు నిబంధనలను మరింత కఠినతరం చేశారు. ఉదయం 6 గంటల నుంచి ఒంటి గంట వరకు మాత్రమే నిత్యావసరాల విక్రయాలను అనుమతించారు. ఆ తరు వాత దుకాణాలను మూయించి రాకపోకలు కట్టడి చేశారు. ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఇటు గ్రామాల్లో ప్రజల రాకపోకలను నిషేధిస్తూ రహదారులను పూర్తిగా మూసి వేశారు. ముఖ్య రహదార్లలో బారికేడ్లను అడ్డుపెట్టి రాకపోకలను నిషేధించారు. ప్రజల్లో  వైరస్‌ తీవ్రతపై చైతన్యం వస్తోంది. పోలీసు చర్యలతో ప్రజలు ఇళ్ల నుంచి బయటికి రావడం తగ్గించారు.  


 ఇళ్లకే పరిమితం

కరోనా వైరస్‌ నిరోధానికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో ప్రజలు ఐదు రోజులుగా ఇళ్లకే పరిమితమయ్యారు. బ్యాంకులు మినహా ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు పని చేయలేదు. ఉదయం 6 గంటల నుంచి నిత్యాసవర దుకా ణాల వద్ద రద్దీ నెలకొంది. హైవేపై పోలీసులు వాహన తనిఖీలు చేశారు. రోడ్ల పైకి రావద్దంటూ వాహనదారులకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. 


ఒంటి గంట వరకే అనుమతి 

నిత్యావసర సరుకులు, కూరగాయల దుకాణాలకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ అనుమతించారు. ఇంటికి ఒకరు మాత్రమే వచ్చి వారికి కావాల్సిన వస్తువులు కొనుగోలు చేయాలని అధికారులు సూచించారు. రైతు బజార్లోనే కాకుండా గ్రామాల్లోనూ బహిరంగ ప్రదేశాల్లో కూరగాయలు విక్రయించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. గ్రామాల్లోని ప్రధాన సెంటర్‌లో కూరగాయల విక్రయం ఏర్పాటు చేసి ఆ గ్రామాల ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒకరికొకరు మూడు మీటర్లు దూరాన్ని పాటించాలని మైక్‌ ద్వారా ప్రచారం చేశారు.  


 గ్రామాల్లో స్తబ్ధత 

కరోనా వైరస్‌ నియంత్రణ కోసం లాక్‌డౌన్‌ ప్రకటించడంతో  గ్రామాలన్నీ స్తబ్ధుగా మారాయి. గురువారం నుంచి అధికారులు చర్యలు మరింత కఠినతరం చేశారు. ఉదయం నుంచి ఇళ్ల నుంచి ఏ ఒక్కరు బయటికి రాకుండా ఉండే విధంగా గ్రామాల్లోనే తిష్ఠ వేశారు. ద్విచక్ర వాహనదారులు కనపడితే వారిపై కేసు నమోదు చేసి జరిమానాలు విధిస్తున్నారు. లారీలు వస్తే సీజ్‌ చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలు అమలు చేసే విధానంలో ఏమాత్రం వెనుకాడడం లేదు.  


ఏలూరు మండలంలోని 15 గ్రామాలకు చెందిన కొందరు ఇతర దేశాల్లో ఉద్యోగాలు, ఇతర దేశాలకు ఉపాధి నిమిత్తం వెళ్లారు. కొద్ది రోజులుగా కరోనా వైరస్‌ ప్రపంచం మొత్తం విజృంభిస్తున్న నేపథ్యంలో ఇతర దేశాల్లో నివాసం ఉంటున్నవారు తిరిగి ఇళ్లకు వస్తున్నారు. ఇలా గ్రామాలకు వచ్చిన వారి వివరాలు పోలీసులకు, రెవెన్యూ, వైద్యశాఖ అధికారులకు సమాచారం అందిం చాలని గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. 


Advertisement
Advertisement
Advertisement