పోలీసు వ్యూహం సక్సెస్‌

ABN , First Publish Date - 2022-07-04T16:28:52+05:30 IST

రెండు రోజులుగా మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి

పోలీసు వ్యూహం సక్సెస్‌

 బీజేపీ సమావేశాలు ప్రశాంతం 

 సిబ్బందిని అభినందించిన సీపీ 

హైదరాబాద్‌ సిటీ: రెండు రోజులుగా మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీలో జరిగిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా బీజేపీ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రు లు, మంత్రులు ఇతర ప్రముఖులు సహా రాష్ట్ర బీజేపీ నా యకులు వందలాది మంది సమావేశాలకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర ఆధ్వర్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. హెచ్‌ఐసీసీ నుంచి సుమారు 5 కిలోమీటర్ల మేర 144 సెక్షన్‌ అమలు చేశారు. భద్రతా ఏర్పాట్లు, పర్యవేక్షణ విషయంలో ఎస్పీజీ, బ్లూబుక్‌కు కట్టుబడి ప్రణాళికలు రూపొందించారు.


యాక్సెస్‌ కంట్రోల్‌తో పాటు, విధ్వంస నిరోధక జాగ్రత్తలు, దేశ నలుమూలల నుంచి నగరానికి వస్తున్న వీవీఐపీల రక్షణ, శాంతి భద్రతల పరిరక్షణను పరిగణలోకి తీసుకున్నారు. విఽధి నిర్వహణలో ఉన్న పోలీసులంతా టీమ్‌గా పనిచేయడంతోనే ఇంత పెద్ద ఈవెంట్‌ విజయవంతం అయిందని ఉన్నతాధికారులు వెల్లడించారు. సిబ్బందిని సీపీ స్టీఫెన్‌ రవీంద్ర అభినందించారు. సమావేశాలకు 24 గంటల ముందే హెచ్‌ఐసీసీని, చుట్టుపక్కల 3 కిలోమీటర్ల పరిధిని ఎస్పీజీ తమ అధీనంలోకి తీసుకుంది. హెచ్‌ఐసీసీ, నోవాటెల్‌ చుట్టుపక్కన 5 కిలోమీటర్ల పరిధి మేర డ్రోన్స్‌, మైక్రో లైట్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌పై నిషేధం విధించారు. బాంబు, డాగ్‌ స్క్వాడ్‌తో పాటు క్లూస్‌ టీమ్‌ సిబ్బంది అన్ని ప్రాంతాలనూ క్షుణ్నంగా తనిఖీ చేశారు. 


ఆధునిక టెక్నాలజీ

భద్రతా పర్యవేక్షణలో ఆధునిక టెక్నాలజీని వినియోగించారు. గూగుల్‌ మ్యాప్‌లు కాకుండా డ్రోన్ల ద్వారా కార్యక్రమం జరిగే ప్రాంతాన్నంతా వీడియో తీస్తూ రియల్‌ టైమ్‌లో 3డీ మ్యాపింగ్‌, వీడియో గ్రాఫింగ్‌ చేశారు. పార్కింగ్‌లు, భవనాలు ఓపెన్‌ స్థలాలు, రోడ్లను 3డీ మ్యాప్‌తో జియోగ్రాఫికల్‌ ఏరియాగా గుర్తించారు. తదనుగుణంగా అంచెలుగా బందోబస్తు ఏర్పాటు చేశారు. త్రీడీ మ్యాపింగ్‌తో ఎక్కడ ఎంత మంది సిబ్బందిని ఉంచాలి, ఏ విభాగాన్ని ఎక్కడ మోహరించాలి అనేది ప్రణాళికలు రచించారు. కమాండ్‌ కంట్రోల్‌లో దాదాపు ఒకే సారి 200 కెమెరాల దృశ్యాలను చూసేలా పెద్ద స్ర్కీన్‌ను ఏర్పాటు చేశారు. ప్రజలను ముందుగానే అలర్ట్‌ చేయడంతో ఎక్కడా ట్రాఫిక్‌ సమస్యలు తలెత్త లేదు. ఆదివారం సాయంత్రం 4:30 గంటల నుంచి ప్రముఖులంతా హెచ్‌ఐసీసీ నుంచి భారీ పోలీస్‌ బందోబస్తు మధ్య సికింద్రాబాద్‌లో పరేడ్‌గ్రౌండ్‌లో జరుగుతున్న బహిరంగ సభకు బయల్దేరి వెళ్లారు.

Updated Date - 2022-07-04T16:28:52+05:30 IST