పెట్రోల్‌ బంకులో చోరీ కేసును ఛేదించిన పోలీసులు

ABN , First Publish Date - 2022-08-13T05:57:04+05:30 IST

మండలంలోని ఇరువాడ పంచాయతీ పరిధిలో జాతీయ రహదారి పక్కన వున్న ఒక పెట్రోల్‌ బంకులో బుధవారం రాత్రి జరిగిన నగదు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి, రూ.2.43 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.

పెట్రోల్‌ బంకులో చోరీ కేసును ఛేదించిన పోలీసులు
నగదు చోరీ అయ్యింది ఈ పెట్రోల్‌ బంకులోనే..

నలుగురి అరెస్టు, రూ.2.43 లక్షలు స్వాధీనం

నిందితులు కోనసీమ, కాకినాడ, హైదరాబాద్‌ జిల్లాల వాసులు

విశాఖ, అరకులోయ సందర్శించి తిరిగి వెళుతూ నగదు చోరీ

సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా నిందితులను పట్టుకున్న పోలీసులు


సబ్బవరం, ఆగస్టు 12: మండలంలోని ఇరువాడ పంచాయతీ పరిధిలో జాతీయ రహదారి పక్కన వున్న ఒక పెట్రోల్‌ బంకులో బుధవారం రాత్రి జరిగిన నగదు చోరీ కేసును పోలీసులు ఛేదించారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి, రూ.2.43 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.  దీనికి సంబంధించి సీఐ పి.రంగనాథం తెలిపిన వివరాలు...

కోనసీమ జిల్లా ఆలమూరుకు చెందిన బాడితబోయిన గణేశ్‌, సీఎస్‌ఎస్‌ఆర్‌. లక్ష్మణచౌదరి, కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన గీసాల వెంకటేశ్‌, హైదరాబాద్‌కు చెందిన వై.ఫణికిరణ్‌.. మిత్రులు. వీరంతా హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. విశాఖ, అరకులోయ ప్రాంతాలను సందర్శించేందుకు ఈ నెల 9న కారులో వచ్చారు. 10వ తేదీన తిరిగి హైదరాబాద్‌ వెళుతూ, దారిలో సబ్బవరం మండలం ఇరువాడ పంచాయతీ పరిధిలోని ఒక పెట్రోల్‌ బంకు (సత్యసాయి ఎంటర్‌ప్రైజెస్‌ ఫిల్లింగ్‌ స్టేషన్‌)లో పెట్రోల్‌ పోయించుకున్నారు. ఈ సమయంలో గణేశ్‌, వెంకటేశ్‌ కలిసి మంచినీరు తాగడానికి పెట్రోల్‌ బంకులోని ఆఫీసు గదిలోకి వెళ్లారు. నీరు తాగిన తరువాత వెంకటేశ్‌ బయటకు వచ్చేశాడు. గణేశ్‌ అక్కడ టేబుల్‌పై ఉన్న రూ.500 నోట్ల కట్టలు 5 (ఒక్కొక్కటి రూ.50 వేలు) తీసుకుని బయటకు వచ్చాడు. అంతా కలిసి కారు ఎక్కి వెళ్లిపోయారు. 

కాగా వీరు రావడానికి కొద్దిసేపటి ముందు పెట్రోల్‌ బంకు మేనేజర్‌ ఎస్‌.రాంబాబు పెట్రోలు అమ్మగా వచ్చిన సొమ్ము రూ.3.5 లక్షలు (రూ.500 నోట్ల కట్టలు ఏడు) ఆఫీస్‌ టేబుల్‌పై పెట్టి బయటకు వెళ్లాడు. కొద్దిసేపటి తరువాత వచ్చి చూసేసరికి  రెండు కట్టలు (రూ.లక్ష) మాత్రమే వున్నాయి. మిగిలిన ఐదు కట్టలు (రూ.2.5 లక్షలు) కనిపించలేదు. యజమాని సంతోష్‌కుమార్‌ తీసి వుంటారని భావించి ఆయనను అడిగాడు. తాను తీయలేదని యజమాని చెప్పడంతో చోరీ జరిగినట్టు నిర్ధారించుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా కారు నంబరును గుర్తించి దర్యాప్తు చేపట్టారు.

ఇదిలావుండగా పెట్రోల్‌ బంకులో రూ.2.5 లక్షల నగదు చోరీ చేసిన విషయాన్ని గణేశ్‌ మిగిలిన ముగ్గురికి చెప్పడంతో రూ.7 వేలు ఖర్చుచేసి మద్యం సేవించారు. మళ్లీ అరకులోయలో ఎంజాయ్‌ చేద్దామంటూ తిరిగి అనకాపల్లి వైపు బయలుదేరారు. కారు నంబర్‌ ఆధారంగా అప్పటికే నిఘా పెట్టిన పోలీసులు గురువారం రాత్రి అసకపల్లి జంక్షన్‌ వద్ద కారును ఆపి నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 2.43 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను శుక్రవారం కోర్టులో హాజరుపరిచారు.


Updated Date - 2022-08-13T05:57:04+05:30 IST