ఉద్యమ యాత్రికుడి కవితా ప్రయాణం

ABN , First Publish Date - 2021-03-22T06:52:57+05:30 IST

ఒక కవిని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి అతని సృజనతో పాటు, అతని జీవన నేపథ్యమూ తెలియడమూ అవసరమనుకుంటాను....

ఉద్యమ యాత్రికుడి కవితా ప్రయాణం

ఒక కవిని సమగ్రంగా అర్థం చేసుకోవడానికి అతని సృజనతో పాటు, అతని జీవన నేపథ్యమూ తెలియడమూ అవసరమనుకుంటాను. ‘‘నిఖిలేశ్వర్‌’’గా ప్రసిద్థుడైన కుంభం యాదవరెడ్డి 1938లో వీరవల్లి అనే గ్రామంలో కన్ను తెరిచాడు. పుట్టిన సంవత్సరమే తండ్రిని కోల్పోయాడు. బతుకు తెరువు కోసం హైద్రాబాద్‌కు వచ్చి ఫ్యాక్టరీ కూలీగా పనిచేసిన తల్లి శ్రమను చిన్ననాడే తెలుసుకున్నాడు. కష్టపడి చదువుకున్నాడు. హిందీ, ఆంగ్ల భాషల మీద శ్రద్థపెట్టి ఆ భాషా సాహిత్యాల్ని అధ్యయనం చేయడం ఆరంభించాడు. ఇరవయేళ్లు నిండక మునుపే హిందీ కవితల్ని రాయడం మొదలెట్టాడు. అట్లా సాహిత్య సృజనకారుడిగా మొదలైన నిఖిలేశ్వర్‌ గత అరవయేళ్లుగా వెనుదిరగక, ధ్యాస మరల్చక, వివిధ ప్రక్రియల్లో తన రచనల్ని చేస్తూ వచ్చాడు. 


1965లో ‘దిగంబర కవులు’గా ముందుకొచ్చిన ఆరుగురు కవుల్లో ఒకడిగా నిఖిలేశ్వర్‌ ప్రసిద్థుడు. ఆయన రాసిన దిగంబర కవిత్వాన్నీ, ఆ తదుపరి రాసిన విప్లవ సామాజిక కవిత్వాన్నీ ప్రాతిపదికగా చేసుకుని ఆయన సృజనను సాహిత్య సమాజం అంచనా వేేస ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో 1960-1965 మధ్య కాలంలో తన సొంత పేరు (యాదవరెడ్డి)తో ఆయన రాసిన కవిత్వం కొంత విస్మరణకు గురయింది. తన యవ్వనారంభ కాలంలో ఆయన రాసిన ఆ కవితల్లో చిక్కనైన ప్రేమ భావనలూ, తనవైన అనుభూతులూ, కొన్ని స్ఫుటమైన సమాజ దృశ్యాలూ అగుపడతాయి. యాదృచ్ఛికమే కావచ్చుకానీ 1961లోనే ఆయన రాసిన ‘కోపంతో వెనక్కి చూడు’ అతని మున్ముందు ప్రయాణ మార్గాన్ని సంకేతించేలా వుంది. 


1960-65 కాలంలో నిఖిలేశ్వర్‌ రాసిన కవితల్లోని భాషా సౌష్ఠవం, ఊహాశాలిత్వం, వినూత్న వ్యక్తీకరణ నిర్మాణానికి బిగినీ, అర్థవంతమైన కూర్పునూ ఇచ్చాయి. ‘‘నా నీడ నాకన్నా ఆకర్షణీయంగా ఉంది’’, ‘‘దిసమొలల్తో ఆజానుబాహుల్లా నిలుచున్న తాడి చెట్ల పొడుగాటి కాళ్ళ మధ్య తలదించుకుని పల్లపు భూమిలోకి గబగబా నడిచి పోతున్నాడు సూరీడు’’, ‘‘నీకు నాకు తప్ప ఎవ్వరికీ అర్థం కాని అనురాగపు అను నయంలో ఒక్కసారి ‘మనం’ అయిన క్షణం సూర్యుడు అంబరంలో ఆనందపు రక్తపు పూలు విరజిమ్మాడు’’ లాంటి వ్యక్తీకరణలు ఆ కవితల్లో తళుక్కుమంటాయి. పాల్‌ గాగా అనే ఫ్రెంచి చిత్రకారుణ్ణి ‘‘ఒక ప్రగాఢ వర్ణరేఖవి’’ అంటాడు చిక్కగా. పండిట్‌ రవిశంకర్‌ సితార్‌ నాదాన్ని ఆస్వాదించిన అనుభవం నుంచి ఆయన రాసిన కవితలోని ప్రతిపాదమూ కళాకాంతిని పొదుగుకుంది. తొలి కాలపు ఆ కవితల్లో అక్కడక్కడ పూర్వ, సమకాలీన కవుల ఛాయలు అగుపడతాయి. 


‘నిఖిలేశ్వర్‌’ పేరుతో దిగంబర కవిగా ఆయన రాసిన కవిత్వం అంతకు మునుపు రాసిన దానికంటె వస్తుపరంగానూ, రూపపరం గానూ పూర్తిగా భిన్నమైంది. ఒక్క ‘‘ఆత్మయోని’’ కవితలో తప్ప మిగతా కవితల్లో ఆయన వాడిన దిగంబర భాష అత్యల్పమే. ఐతే గరుకు వాక్యాలు ఎక్కువే. సౌందర్య ఛాయలకు తావులేని ఆగ్రహోద్వేగమూ, నిలదీసేధోరణి ఆ కవితల్లో కనిపిస్తాయి. ‘‘ేస్నహం ఇవ్వలేని దేశంలో స్నేహం లేని ప్రతివాడూ ఒక్కొక్క ద్వీపం’’ లాంటి వాక్యాల్లో దిగం బరత్వం కనపడదు. ‘‘సూర్యముఖి పువ్వులా వేలాడుతున్న చంద్రుడు ఒక తెల్లగబ్బిలం’’ లాంటి వ్యక్తీకరణలో ప్రయోగాత్మక నవ్యత కనపడుతుంది. నిఖిలేశ్వర్‌ కవితా ప్రయాణంలో దిగంబర మార్గం ఒక కీలకేౖన మలుపు ఎందుకంటే ఇక్కడ కొంత వొదులుకోవడం వుంది, కొంత పొందడం వుంది. వొదులుకోవడమేమో కొంత రూప కాంతిని. పొందడమేమో కొంత ఆగ్రహప్రసార నైపుణ్యాన్ని. 


నిఖిలేశ్వర్‌ దిగంబర కవితల్లో కొన్ని చోట్ల వియత్నాం ప్రస్తావన ప్రస్ఫుటంగా కనపడుతుంది. ముప్ఫయేళ్లు రాకమునుపే ఈ కవి తన చుట్టూ పరుచుకున్న దు:ఖమయ వాతావరణాన్నే కాక, ఎల్లలు దాటిన చూపుతో ఆవలి ఖండాల మనిషి గోడునూ, పోరాటాన్నీ పట్టించుకున్నాడని గమనించొచ్చు. ఈ ‘‘చూపు విస్తరణ’’ నిఖిలేశ్వర్‌ తదుపరి ప్రయాణానికి ఎంతో ఉపకరించింది. దిగంబరపు దారి నుంచి మలుపు తీసుకుని ఐచ్ఛికంగా ‘విరసం’లో భాగస్వామి అయాక 1970 నుంచి నిఖిలేశ్వర్‌ కంఠస్వరం మారింది. భావనలోనే కాదు, కవిత్వ భాషలోకి ‘వర్గం’, ‘వర్గరహిత సమాజం’, ‘దోపిడి’, ‘వ్యవస్థ’, ‘హింస’, ‘ప్రతిహింస’ లాంటి మాటలు విరివిగా వచ్చి చేరాయి. పదాల పొందిక కన్నా పదునైన భావమ్మీదే ధ్యాస పెట్టిన దశ అది. ఆ దశలో నిఖిలేశ్వర్‌ రాసిన కవితల్లో వర్గ దృష్టి కనపడుతుంది. ‘భయం’, ‘ఏనాటికీ చావనిది’ లాంటి బలమైన కవితలు ఆ కాలంలో వచ్చినవే. 1971లో పి.డి. చట్టం కింద అరెస్టయినపుడు జైల్లో జైలు మీద ఆయన రాసిన కవితలో తన విప్లవ నిబద్థత కనపడుతుంది. 


సిద్థాంత విభేదాల మూలంగా విరసం నుంచి బయటికొచ్చాక నిఖిలేశ్వర్‌ జనసాహితిలో పని చేశాడు. ఆ మలుపు దగ్గర మౌలిక సృజనతోపాటు అనుసృజన మీద కూడా ధ్యాసం పెట్టడం ద్వారా ఆయన ప్రయాణానికి అదనపు కాంతి చేకూరింది. జనసాహితి నుంచి కూడా నిష్క్రమించాక నిఖిలేశ్వర్‌ ఏ సంస్థలోనూ చేరకపోయినా, స్థూలంగా తనలో ఇమిడిపోయిన నిర్దిష్ట సామాజిక చింతనను కాపాడుకుంటూనే తనదైన దారిలో ప్రయాణిస్తూ వచ్చాడు. ఆయన కవిత్వమంతా ‘దిగంబరం’ అనే ముద్ర వేయలేం. దానిలో విస్తృతీ, లోతూ వున్నాయి. మానవ వేదన ఎక్కడున్నా దాన్ని అధ్యయనం చేసి తన బాణీలో వ్యక్తీకరించడం, అదే సందర్భంలో పోరాటాల అవసరాన్ని చెప్పడం- ఇదీ నిఖిలేశ్వర్‌ కవిత్వ కేంద్రాంశం. వియత్నాం, ఆఫ్ఘన్‌, భాగల్పూర్‌ ఉదంతం, ప్రెస్‌ బిల్‌ రాజకీయం, ఇంద్రవెల్లి వెల్లువ, గోద్రా ఘటన, రైతుల ఆత్మహత్యలు, మతకల్లోలాలు- ఇట్లా పలు సందర్భాల్ని నిఖిలేశ్వర్‌ కవిత్వీకరించాడు. ‘‘ఇక్కడి ప్రజాస్వామ్యం ఇప్పటికీ ఉడుకుతున్న అన్నం’’ అని ఆయన అనడం వెనుక ప్రజల కింకా అందుబాటుకు రాలేదనే ధ్వని వుంది. 71, 72 కాలంలో అడవిని, ‘‘రాజీపడని జ్వాలల గాలి’’ని గానం చేసిన నిఖిలేశ్వర్‌ ఆ తర్వాతి కాలంలో పోరాటాలకు కొత్త అర్థాన్నిచ్చుకున్నాడు. ప్రజలతో మమేకమైన పోరాటాల వల్లనే సమాజానికి మేలు జరుగుతుందని భావించి ‘‘జనం ప్రాణ వాయువు లేకుండా చివరకు బూడిదగా మారే ఉద్యమాన్ని’’ అని వ్యక్తీకరించాడు. మత రాజకీయాల డొల్లతనాన్నీ, మతం పేరిట జరిగే అమానవకాండనూ తీవ్రంగా ఎండగట్టాడు నిఖిలేశ్వర్‌. హైదరాబాద్‌తో దశాబ్దాలపాటు తనకున్న గాఢానుబంధాన్ని నెమరేసుకుని, ఇదే నగరంలో వివిధ సందర్భాల్లో జరిగిన మత ఘర్షణల మీద విస్తారంగా కవితలు రాశాడు. ‘‘మన మతగ్రస్తమైన పట్నాన్ని మనం తప్ప ఏ అతీతశక్తి కాపాడగలదు?’’ అని 1990లో నగరంలో జరిగిన అల్లర్ల సందర్భంగా వ్యాఖ్యానించాడు.


నిఖిలేశ్వర్‌ ఒక యాత్రికుడు. దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్ళాడు సాహిత్య సంచారిగా. అమెరికాకూ వెళ్ళాడు. అక్కడ వివిధ ప్రాంతాలను దర్శించి వచ్చాక, వాటి విలక్షణతను చెబుతూ ఆయన రాసిన కవితల్లో ఎన్నో చారిత్రక, సాంస్కృతిక అంశాల్ని ఇమిడ్చాడు. అందుకే ఆయన యాత్రా కవితల్లో సౌందర్యాతిశయం కన్న గరుకు వాస్తవికతే కొట్టొచ్చినట్లు కనపడుతుంది. న్యూయార్కును చూసొచ్చి దాన్ని ‘‘యంత్రనగరి’’గా అభివర్ణిస్తూ ‘‘ఇక్కడ ఘనీభవించిన విశ్వ సంపదలో తన వేగానికి తానే బానిస’’ అనడం నిఖిలేశ్వర్‌ కవితా ముద్ర. 


దోపిడీ స్వభావం గురించి అధ్యయనం ద్వారా, పరిశీలన ద్వారా స్పష్టత ఏర్పరచుకున్న నిఖిలేశ్వర్‌ సహజంగానే రైతులకనుకూలంగా గొంతు విప్పాడు. ‘‘ధాన్యం పండించేవాడికి ఆకలిని పంచిపెడుతున్న పుణ్యాత్ములున్న ఈ దేశంలో’’ అంటూ వ్యంగ్యంగా పలికాడు. ‘‘ఇపుడిక సమిష్టి ఆయుధమే భూమి పుత్రుల ధైర్యం, ఆత్మహత్యలకు బదులు ఆత్మవిశ్వాసంతో చేయూతనిచ్చే ఉద్యమాలు రగలాలి’’ అని రైతు ఉద్యమాల ఆవశ్యకతను చెప్పాడు. 


తెలంగాణ ఉద్యమం (తొలిదశ) 1969లో మొదలైనపుడు నిఖిలేశ్వర్‌ దిగంబర రహదారి నుంచి మరో విస్తారమైన రహదారికి వెళ్ళబోయే దశలో వున్నాడు. తెలంగాణ ఉద్యమాన్ని అస్తిత్వకోణం నుంచి కాక వర్గ చింతనలోంచి చూసి ‘‘ప్రత్యేక దోపిడి ప్రాంతం కోసం కాదు/ మనుష్యుల్ని నిలువునా నరికే/ కొల్లగొట్టే వర్గాలను పాతిపెట్టాలి/ అక్కడే వుంది అసలైన పోరాటం’’ అంటూ ఆ ఉద్యమం పట్ల తన అననుకూలతను ప్రకటించాడు. ముప్పయేళ్ల తర్వాత తెలంగాణ మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున లేచినపుడు దానికి అనుకూలుడైనాడు. అయితే ఆ ఉద్యమ సందర్భంలో ఉద్యమకారులు ట్యాంకుబండ్‌ మీద వున్న విగ్రహాల్ని ధ్వంసం చేయడాన్ని ఆయన సమర్థించలేదు. ‘‘విధ్వంసకేళి అన్ని వేళలా ఆశించిన నిర్మాణానికి దారి తీయదు’’ అని సుస్పష్టంగానే ఓ కవితలో చెప్పాడు. ఉద్యమ సందర్భంలోనే ‘‘అన్నదమ్ముల్లా విడిపోవటమంటే అనుబంధాల అంతం కానేకాదు’’ అని మైత్రీ భావంతో నుడివాడు. దానికి కొనసాగింపుగా ‘‘పెత్తందారీ ఆధిపత్యాన్ని తుదముట్టించే అన్నదమ్ముల నిరంతర జీవన సమరం ఎంతో దూరం సాగవలిేస వుంది’’ అనడం నిఖిలేశ్వర్‌ ప్రత్యేకత. చుట్టూ వున్న వారి అంగీకారం కోసం కాక, తను విశ్వసించే ఆలోచనా మార్గంలో వెళ్ళడానికే నిఖిలేశ్వర్‌ ఇష్టపడతాడని ఆయన కవిత్వం చెబుతుంది. 


కుటుంబ వాతావరణం నుంచి కవితల్ని సృజించినపుడు నిఖిలేశ్వర్‌ స్వరం ఆత్మీయంగా పలికింది. తనకోసం ఎంతోశ్రమించిన తల్లి అస్తమించినపుడు ‘‘డ్యూటీ కోసం ఉదయాస్తమయాల ఆకాశ ధూళిలో సర్వత్రా వ్యాపించింది’’ అంటూ ఆమె శ్రమను విస్తారమైన కేన్వాస్‌ మీద చూపాడు. తన మనవడు ‘ప్రతీక్‌’ కోసం రాసిన ఓ కవితలో ‘‘వాడి చెడ్డీలో ఎప్పుడు వాన కురుస్తుందో చెప్పలేం’’ అని చమత్కరించాడు. మరో మనవడు ‘సాత్విక్‌’ కోసం రాసిన కవితలో ‘‘చిట్టి దేహమందిరంలో ప్రకృతి సారాన్ని నింపిన సృష్టి రహస్యాలు ఎన్నెన్నో’’ అంటూ మృదువైన చింతన చేశాడు. 


నిఖిలేశ్వర్‌కు బాహ్యదృష్టి ఎంత వుందో అంతర్‌ దృష్టి అంత వుంది. ఆ ఆత్మానుశీలత ఆయన కవితల్లో మనం చూడొచ్చు. ‘‘మనలోని అనేక ఆకృతులను ఎప్పుడైనా దర్శించుకున్నామా?’’ అంటాడొక కవితలో. ‘‘ఇంతకీ మనస్సాగర అనుభవంలోని నిర్విరామ అంతర్‌ ఘోషకర్థమేది?’’ అన్నాడు మరో చోట. ‘‘నిశ్శబ్దమంతా నాదమయమే’’ అని అనడంలో పరిణతి చెందిన చింతన వుంది. 


నిఖిలేశ్వర్‌ చాలా కవితలు సుదీర్ఘమైనవి కావు. ఒకే ఒక భావ శకలంతో పది పన్నెండు పంక్తుల్లో ఒదిగిన కవితలూ, కొంచెం విస్తారమైన వస్తువుతో ముప్పై నలభై పాదాల్తో ముగిసిన కవితలూ. కవితల్లోని పాదాలు కురచవే. సగటున నాలుగైదు మాటల్తో పాదం ముగుస్తుంది. సామాజిక చింతన నుంచి ఆయన రాసిన కవితల్లో శాస్త్ర పరిభాష ఎక్కువగా కనబడుతుంది. వైయక్తిక అనుభవాల్ని మేళవించి చెప్పినపుడు ఆ పరిభాష అంతగా కనపడదు. నిఖిలేశ్వర్‌ భాషా పటిమ ఆయన తొలినాళ్ళ కవిత్వం (1961-65)లో ఇట్టే కనబడుతుంది. భావ ప్రాధాన్యత సాగే కవితల్లో శైలి చదునుగా వున్నట్లనిపించినా వాటిలో అక్కడక్కడ నూత్న వ్యక్తీకరణలు కనపడతాయి. ‘‘అటూ ఇటూ ఊగుతున్న ఒక్కొక్క ఆకుపై దీపాలను వెలిగీంచిన వాన’’, ‘‘చెరువులో చేతులను ముంచుతున్నప్పుడు సూర్యుడు లోకం ముఖాన్ని కసిగా వేడి గోళ్ళతో రక్కుతున్నాడు’’, ‘‘రోడ్డు ఆక్వేరియంలో రంగు రంగు చేపల సంచారం’’, ‘‘ఎగిరే రంగుల రెక్కల జెండా’’ (సీతాకోక), ‘‘సగం కట్టిన ఇళ్ళకి పహరా కాస్తున్న తాడిచెట్లు/ వెన్నెలని తిని అంత పొడుగు పెరిగాయంటే/ అంతా వొట్టి భ్రమ’’


నిఖిలేశ్వర్‌ను కేవలం దిగంబర కవిగా చూడడం పాక్షిక దృష్టే అవుతుంది. 1960లో రాసిన తొలి కవితల నుంచి ఇప్పటి దాకా రాసిన కవితలన్నింటినీ సాకల్యంగా పరిశీలించినపుడే ఆయన కవితా ప్రయా ణాన్ని సమగ్రంగా చూడగలము. అట్లా చూసినపుడు పల్లెటూరి పేద రికపు నేపథ్యం నుంచి పట్టుదలతో, సాధనతో, నిరంతర అధ్యయనంతో, సృజనాసక్తితో, వివిధ ఉద్యమ మార్గాల్లో అంచెలంచెలుగా సాగుతూ, స్వీయచింతనను కాపాడుకుంటూ, వ్యక్తీకరిస్తూ తెలంగాణతనంతో సుదీర్ఘ ప్రయాణం చేసిన కళా మానవుడిగా ఆయనను అర్థం చేసు కోవచ్చు. ‘‘అగ్నిశ్వాస’’ అంతరార్థం తెలిసిన ఆయనకు 2020 సంవత్సరా నికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించడం ముదా వహం. ఆయనకు గౌరవపూర్వకమైన అభినందన!

దర్భశయనం శ్రీనివాసాచార్య

94404 19039

Updated Date - 2021-03-22T06:52:57+05:30 IST