పాచిపోయిన అన్నం పెడుతున్నారు

ABN , First Publish Date - 2021-05-07T09:29:28+05:30 IST

‘రెండు రోజుల క్రితం నా తల్లితో పాటు కొవిడ్‌ ఆస్పత్రిలో చేరాను. పాచిపోయిన భోజనం పెడుతున్నారు. నాకు పారాసిట్మాల్‌ మాత్రలు ఇచ్చారు

పాచిపోయిన అన్నం పెడుతున్నారు

కార్పొరేట్‌ ఆస్పత్రిలో దుస్థితిపై

డిప్యూటీ తహసీల్దార్‌ సెల్ఫీ వీడియో 


వజ్రపుకొత్తూరు, మే 6: ‘రెండు రోజుల క్రితం నా తల్లితో పాటు కొవిడ్‌ ఆస్పత్రిలో చేరాను. పాచిపోయిన భోజనం పెడుతున్నారు. నాకు పారాసిట్మాల్‌ మాత్రలు ఇచ్చారు. మా అమ్మకు ఇంకా చికిత్సే ప్రారంభించలేదు’... ఏ సామాన్య వ్యక్తో కాదు మండల డిప్యూటీ తహసీల్దార్‌ వ్యక్తం చేసిన ఆవేదన ఇది.  కొవిడ్‌ ఆస్పత్రిలో నిర్లక్ష్య వైఖరిపై ఆయన తీసిన సెల్ఫీ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు డిప్యూటీ తహసీల్దార్‌ బి.మురళీకష్ణకు పాజిటివ్‌గా తేలింది. ఆయన తల్లికి కూడా వైరస్‌ సోకినట్టు నిర్ధారణ అయింది. శ్రీకాకుళంలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రిలో రెండు రోజుల కిత్రం చేరారు. ఇక్కడ తమకు సరిగా వైద్య సేవలు అందడం లేదని ఆయన సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘శ్రీకాకుళంలోని కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరాం. రెండు రోజులైనా ఇంతవరకు డ్యూటీ డాక్టర్‌ వచ్చి పరిశీలించలేదు. నాకు సెలైన్‌ పెట్టి పారాసిట్మాల్‌ మాత్రలు ఇచ్చారు. మా అమ్మకు చికిత్స ప్రారంభించలేదు. ఆస్పత్రిలో చేరిన మరుసటి రోజు మధ్యాహ్నం అందించిన భోజనాన్నే, రాత్రి కూడా పెట్టారు. కంపు కొడుతోంది. వాటర్‌ బాటిల్‌ అడిగితే రాత్రి 12 గంటలు అయినా ఇవ్వలేదు. ఒక మండల డిప్యూటీ తహసీల్దార్‌కే ఇలాంటి దారుణమైన సేవలు అందుతుంటే.. సామాన్యుల పరిస్థితి అంచనా వేయవచ్చు’’ అని సెల్ఫీ వీడియోలో మురళీకృష్ణ కోరారు. కాగా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి రుంకు అప్పారావుకు మురళీకష్ణ స్వయానా అల్లుడు. 

Updated Date - 2021-05-07T09:29:28+05:30 IST