నిరంకుశ పాలనకు పరాకాష్ఠ జీవో 317

ABN , First Publish Date - 2022-01-20T05:42:05+05:30 IST

ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు ఇష్టానుసారంగా పాలన సాగిస్తూ వనరులను దోచుకుంటున్నారని, ప్రధానంగా తెలంగాణ ప్రాంత ఉద్యోగాల్ని సైతం తమ ప్రాంతంవారితో...

నిరంకుశ పాలనకు పరాకాష్ఠ జీవో 317

ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు ఇష్టానుసారంగా పాలన సాగిస్తూ వనరులను దోచుకుంటున్నారని, ప్రధానంగా తెలంగాణ ప్రాంత ఉద్యోగాల్ని సైతం తమ ప్రాంతంవారితో నింపుకుంటూ స్థానిక తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నారని తెలంగాణ రాష్ట్రం కోసం దీర్ఘకాలం కొట్లాడినం. ఈ క్రమంలోనే మనకు కొన్ని చట్టబద్ధ రక్షణలు దొరికాయి. అందులో భాగంగానే 1974లో 32వ రాజ్యాంగ సవరణ ద్వారా 371(డి) తీసుకువచ్చారు. ఇది తెలంగాణ ప్రాంత బిడ్డల హక్కులకు కొంత రక్షణ కవచంగా మిగిలి ఉంది.


తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పరిపాలనా సౌలభ్యం కోసం, ప్రజలకు అందుబాటులో పాలన అనే కోణంలో కొత్త జిల్లాల ఏర్పాటు చేసుకోవాలని ఉద్యమ సమయంలోనే భావించాం. కానీ రాష్ట్ర పాలకులు తమ రాజకీయ అవసరాల ప్రాతిపదికన శాస్త్రీయత ఏమీ లేకుండా అస్తవ్యస్తంగా జిల్లాల ఏర్పాటు చేశారు.


జీవో 317 ప్రకారం కొత్త జోన్లు, జిల్లాల అనుగుణంగా చేయతలపెట్టిన ఉద్యోగ ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ కొందరి కుటుంబ జీవితాలను, పిల్లల జీవితాలను, ప్రణాళికలను తలకిందులు చేసింది. కొత్త అంతర్గత వలసలను సృష్టించే, వాటిని స్థానికతగా స్థిరీకరణ చేసే నిర్ణయాన్ని నిరంకుశంగా ఉద్యోగులపై ఉపాధ్యాయులపై రుద్దింది ప్రభుత్వం.


మొదటగా రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు కోసం అంటూ తీసుకువచ్చిన జీవో 124నే తప్పుల తడకగా ఉంది. ఈ జీవోలో పేరా నాలుగులో 1 నుండి 7 వరకు పేర్కొన్న అంశాలలో స్థానికత అన్న అంశమే లేదు. దీనికి కొనసాగింపుగా వచ్చిన జీవో 317 ఉద్యోగ ఉపాధ్యాయులను పెనం మీంచి పొయ్యిలో నెట్టినట్లుగా ఉంది. వర్కింగ్ పోస్టులు, వేకెన్సీలు ఎన్ని ఉన్నాయో తెలుపకుండా, ప్రమోషన్ లిస్టు తయారు చేయకుండా, ఉపాధ్యాయులతో కనీసం చర్చించకుండా తీసుకువచ్చిన జీవో 317లో రూల్ ఆఫ్ రిజర్వేషన్లు, క్యాడర్‌స్ట్రెంథ్‌లు, ఏజెన్సీ ప్రాంతంలో పౌరులకు రాజ్యాంగబద్ధంగా సంక్రమించిన రక్షణలు కూడా తుంగలో తొక్క బడ్డాయి. సీనియర్లకు లాభం జరిగింది అనే ఒక భ్రమను కలిపించారు. పుట్టుకతో ఏర్పడిన స్థానిక బంధాన్ని, పెనవేసుకుపోయిన సాంస్కృతిక జీవన విధానాన్ని విధ్వంసం చేసే జీవో 317ను రద్దు చేయాలని జీవో 124ను సవరణ చేయాలని తెలంగాణ జనసమితి కోరుతుంది.


కేసీఆర్ ప్రభుత్వం ఏకపక్షంగా తన రాజకీయ ప్రయోజనాలే ప్రధానంగా విధానాలను రూపొందిస్తూ నిరంకుశ పాలనను సాగిస్తున్నారు. పూర్తిస్థాయి అధ్యయనం లేకుండా నిపుణులతో చర్చలు చేయకుండా ఆదరాబాదరాగా తీసుకుంటున్న నిర్ణయాల వల్ల అన్ని వ్యవస్థలు కుదేలవుతున్నాయి. ఈ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఏకమై పోరాడాల్సిన ఆవశ్యకత తెలంగాణ సమాజం ముందు ఉంది. 

కుంట్ల ధర్మార్జున్

Updated Date - 2022-01-20T05:42:05+05:30 IST