పీపుల్స్‌ వార్‌ పేరుతో బెదిరింపు లేఖలు పంపిన వ్యక్తి అరెస్ట్‌

ABN , First Publish Date - 2022-07-02T05:10:16+05:30 IST

పీపుల్స్‌వార్‌ పేరుతో సింగరాయకొండలోని ఇద్దరు వ్యక్తులకు బెదిరింపులు లేఖలు పంపిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌లో బెట్టింగులు ఆడి అప్పులపాలై వాటిని తీర్చేందుకు ఈ చర్యకు ఒడిగట్టినట్లు తేల్చారు.

పీపుల్స్‌ వార్‌ పేరుతో బెదిరింపు లేఖలు పంపిన వ్యక్తి అరెస్ట్‌
వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ నాగరాజు,పక్కన సీఐ లక్ష్మణ్‌, ఎస్సై సంపత్‌

ఆన్‌లైన్‌లో బెట్టింగులకు పాల్పడి అప్పులపాలు

వాటిని తీర్చేందుకు లెటర్లు

సీసీ కెమెరాల ఫుటేజ్‌ ద్వారా నిందితుడి గుర్తింపు

వివరాలను వెల్లడించిన డీఎస్పీ నాగరాజు

సింగరాయకొండ, జూలై 1 : పీపుల్స్‌వార్‌ పేరుతో సింగరాయకొండలోని ఇద్దరు వ్యక్తులకు బెదిరింపులు లేఖలు పంపిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌లో బెట్టింగులు ఆడి అప్పులపాలై వాటిని తీర్చేందుకు ఈ చర్యకు ఒడిగట్టినట్లు తేల్చారు. కేసు వివరాలను ఒంగోలు డీఎస్పీ నాగరాజు సోమవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో విలేకరులకు వెల్లడించారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ సెంటర్‌లోని అప్పల రఘుకు చెందిన  స్టూడియో షట్టర్‌ వద్ద గత నెల 27వ తేదీ రాత్రి గుర్తుతెలియని వ్యక్తి ఒక కవర్‌ వేసి వెళ్లాడు. మరుసటి రోజు ఉదయం 9గంటలకు రఘు స్టూడియోకు వెళ్లి షట్టర్‌ తీస్తున్న సమయంలో ఆ కవర్‌ కంటపడింది. దానిని తెరిచి చూడగా పీపుల్స్‌ వార్‌ దళసభ్యుడు వెంకటరెడ్డి అనే పేరుతో లేఖ ఉంది. అందులో రూ.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో నీ కుటుంబానికి హెచ్‌ఐవీ వైరస్‌ ఎక్కిస్తామని, నీ కుటుంబ సభ్యులు, స్టుడియోపై దాడులు చేస్తామని హెచ్చరించారు. దీంతో రఘు ఈనెల 28తేదీ స్థానిక పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై సంపత్‌కుమార్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రఘుకు వచ్చిన బెదిరింపు లేఖపై ఈనెల 29న పత్రికల్లో వార్త ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో సింగరాయకొండ ఎంపీటీసీ-2 భర్త మసనం వెంకట్రావు తనకు కూడా వారం క్రితం ఇలాగే బెదిరింపులేఖ వచ్చిందని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. ఈ రెండు లేఖల సమాచారాన్ని పోలీసులు ఎస్పీ మలికగర్గ్‌కు ఇచ్చారు. సీరియ్‌సగా తీసుకున్న ఆమె కేసు దర్యాప్తునకు సీసీఎస్‌ సీఐ దేవప్రభాకర్‌ నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపారు. ఒంగోలు డీఎస్పీ నాగరాజు సూచలతో సీఐ దేవప్రభాకర్‌, సింగరాయకొండ సీఐ మర్రి లక్ష్మణ్‌, ఎస్‌ఐ సంపత్‌కుమార్‌ స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను క్షుణ్ణంగా పరిశీలించారు. వాటి ఆధారంగా జరుగుమల్లి మండలం బిట్రగుంట గ్రామానికి చెందిన నిమ్మకాయల శ్రీనివాసరావు నిందితుడని గుర్తించారు. శుక్రవారం ఉదయం జాతీయ రహదారిపై ఉన్న కలికివాయి ఫ్లైఓవర్‌ బ్రిడ్జి వద్ద అతడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం శ్రీనివాసరావును విచారించగా ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌లు ఆడటం ద్వారా సుమారు రూ.4.80లక్షలు పోగొట్టుకున్నట్లు తెలిపాడు. ఆ మొత్తాన్ని కొంత బంగారం కుదవపెట్టి, మరికొంత అప్పులు తీసుకొన్నట్లు చెప్పాడు. అప్పు ఇచ్చిన వారు ఒత్తిడి చేయడంతో యూట్యూబ్‌లో మావోయిస్టుల ఇంటర్వ్యూ చూసి ఈజీగా డబ్బులు సంపాదించడానికి పీపుల్స్‌వార్‌ దళ సభ్యుడి పేరున బెదిరింపు లేఖలు రాసినట్లు అంగీకరించాడని డీఎస్పీ తెలిపారు అనంతరం నిందితుడిని కందుకూరు కోర్టుకు తరలించినట్లు ఆయన చెప్పారు. 

Updated Date - 2022-07-02T05:10:16+05:30 IST