UK పౌరులను భారతీయులు ప్రేమించి పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటే..

ABN , First Publish Date - 2021-09-29T05:03:14+05:30 IST

బ్రిటన్‌ పౌరులను పెళ్లిచేసుకుంటున్నారా.. అయితే..ఈ వీసా గురించి తెలుసుకోండి

UK పౌరులను భారతీయులు ప్రేమించి పెళ్లి చేసుకుని అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటే..

ఇంటర్నెట్ డెస్క్:  అమ్మాయిది బ్రిటన్.. అబ్బాయిది భారత్. వారిది లవ్ ఎట్ ఫస్ట్ సైట్.  వారి వివాహం భారత్‌లోనే అంగరంగ వైభవంగా జరిగిపోయింది. ఇంకేముంది..కథ కంచికి.. వాళ్లేమో బ్రిటన్‌కీ..అని అనుకుంటున్నారా.. నో ఛాన్స్! వాస్తవానికి ఆ తరువాతే వారి బంధానికి అసలు పరీక్ష మొదలవుతుంది. తమ ప్రేమ నిజమైనదని ఆ జంట రుజువు చేసుకోగలిగితేనే .. అబ్బాయికి వీసా రూపంలో బ్రిటన్ ప్రభుత్వం ఆశీర్వాదం లభిస్తుంది! అయితే.. ఈ వీసా పొందటం అంత ఆషామాషీ వ్యవహారం కాదని నిపుణులు చెబుతున్నారు. అసలు ఈ వీసా కథేంటో వివరంగా తెలుసుకుందాం పదండి..


స్పౌస్ వీసా..

బ్రిటన్ పౌరులతో జీవితం పంచుకోవాలనుకునే ఇతర దేశాల వారి కోసం ఉద్దేశించినదే స్పౌస్ వీసా. ఇదో తరహా ఫ్యామిలీ వీసా. బ్రిటన్ పౌరసత్వం ఉన్న వారి భర్త, భార్య లేదా సహజీవనంలో ఉన్న వారికి ఈ వీసా ఇస్తారు. ఎంగేజ్‌మెంట్ తరువాత కూడా ఈ వీసా ద్వారా బ్రిటన్‌కు వెళ్లవచ్చు. అంతేకాకుండా.. ఈ వీసా ద్వారా ముందు బ్రిటన్‌కు వెళ్లి ఆ తరువాత  భాగస్వామితో కలిసి కొత్త జీవితం మొదలు పెట్టవచ్చు. 


అత్యంత కఠినమైన నిబంధనలు ఉన్న వీసా కేటగిరీల్లో స్పౌస్ వీసా కూడా ఒకటి. ఇది కావాలనుకున్న వారు తమ బంధం నిజమైనదని నిరూపించే బలమైన ఆధారాలను బ్రిటన్ అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. పెళ్లి పేరిట జరిగే మోసాలను నిరోధించేందుకు ప్రభుత్వం స్పౌస్ వీసా విషయంలో కఠిన నిబంధనలు రూపొందించింది.  2013 నాటి ప్రభుత్వ నివేదిక ప్రకారం.. ఏటా సగటున 4 నుంచి 10 వేల స్పౌస్ వీసా దరఖాస్తులు తిరస్కరణకు గురవుతుంటాయి. నకిలీ బాంధవ్యాలు అడ్డుపెట్టుకుని బ్రిటన్‌లో కాలు పెట్టాలనుకునే వారి వల్ల బ్రిటన్ వలస విధానానికే ప్రమాదం పొంచి ఉందని కూడా ఆ నివేదిక అభిప్రాయపడింది. 


అయితే..ఈ వీసాకు అప్లై చేసే వారు తమ బంధం నిజమైనదని రుజువు చేసుకోవడంతో పాటూ తమకు బ్రిటన్‌లో కనీస కుటుంబ ఆదాయం కూడా ఉన్నట్టు చూపించాలి. ఈ మొత్తం భారీగానే ఉండటంతో ఎన్నో వివాదాలు తలెత్తాయి. కొన్ని న్యాయాస్థానాలకూ చేరాయి. ఇక స్పౌస్ వీసాకు దరఖాస్తు చేయదలిచిన వారు 18 ఏళ్లు పూర్తి చేసుకుని ఉండాలి. ఆ వ్యక్తి జీవితభాగస్వామి బ్రిటన్ లేదా ఐర్లాండ్ పౌరుడై ఉండాలి. ఈ వీసా జారీ ప్రక్రియకు 1200 పౌండ్ల వరకూ ఖర్చవుతుంది. అన్నీ సవ్యంగా ఉంటే.. దరఖాస్తు చేసుకున్న మూడు నుంచి ఆరు నెలలోపు వీసా జారీ అయ్యే అవకాశం ఉంది. అధికారులు అభ్యంతరాలేమైనా చెబితే..వీసా జారీ మరింత ఆలస్యం కావచ్చు. బంధం నిజమైనదని నిరూపణ కాకపోవడం, ఆర్థిక కారణాలు,  విదేశీ భాగస్వామికి ఇంగ్లీషు భాషా నైపుణ్యాలు లేకపోవడం వంటి పరిస్థితులు దరఖాస్తు తిరస్కరణకు దారితీయచ్చు. 

Updated Date - 2021-09-29T05:03:14+05:30 IST