మరొకరికి కరోనా పాజిటివ్‌

ABN , First Publish Date - 2020-05-25T09:58:48+05:30 IST

షాద్‌నగర్‌ పట్టణంలో రెండు రోజుల క్రితం విజయ్‌నగర్‌ కాలనీకి చెందిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం విధితమే.

మరొకరికి కరోనా పాజిటివ్‌

 11 మంది క్వారంటైన్‌ కేంద్రానికి తరలింపు

భయాందోళనలో పట్టణ ప్రజలు

కంటైన్‌మెంట్‌లోకి మరిన్ని కాలనీలు


షాద్‌నగర్‌: షాద్‌నగర్‌ పట్టణంలో రెండు రోజుల క్రితం విజయ్‌నగర్‌ కాలనీకి చెందిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో అతనికి సంబంధించిన 22 మంది కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులను శనివారం కట్టడి కేంద్రానికి తరలించారు. వారిలో పట్టణంలోని ఈశ్వర్‌ కాలనీకి చెందిన మరో యువకుడికి ఆదివారం కరోనా పాజిటివ్‌ అని తేలింది. మరో 21 మంది రిపోర్టులు రావాల్సి ఉంది. ఆదివారం పాజిటివ్‌ వచ్చిన యువకుడు ఇటీవల హైదరాబాద్‌లో రెడ్‌జోన్‌గా ఉన్న జియాగూడలో ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందగా అతని అంత్యక్రియల్లో పాల్గొన్నట్లు తెలిసింది. రెండు రోజుల తరువాత అతడు అస్వస్థతకు గురయ్యాడు.  విజయ్‌నగర్‌ కాలనీకి చెందిన యువకుడికి ఇతడు సన్నిహితమైన స్నేహితుడు కావడంతో ఇతనికీ వైరస్‌ సోకినట్టు తెలిసింది.


పోలీసు అధికారులు, వైద్య సిబ్బంది ఇద్దరు యువకులు సంచరించిన ప్రాంతాలతో పాటు కొన్ని ఇళ్లను నిశితంగా పరిశీలిస్తున్నారు. కట్టడి కేంద్రానికి తరలించిన మిగతా వారు కూడా ఎక్కడెక్కడ తిరిగారు..? ఎవరెవరితో కలిశారన్న కోణంలో విచారణ చేపట్టారు. అలాగే ఆదివారం ఉదయం ఇద్దరు యువకులకు సంబంధించిన మరో 11 మందిని క్వారంటైసన్‌ కేంద్రానికి తరలించారు. శనివారం స్థానిక మెయిన్‌రోడ్‌తో పాటు వినాయక్‌గంజ్‌, విజయ్‌నగర్‌ కాలనీ, ఈశ్వర్‌కాలనీలను కంటైన్‌మెంట్‌ జోన్లుగా ప్రకటించగా... సోమవారం నుంచి 14 రోజుల పాటు పట్టణంలోని అన్ని దుకాణాలను మూసివేయిస్తున్నట్లు మున్సిపల్‌ కమిషనర్‌ లావణ్య తెలిపారు. ఇద్దరి యువకుల వివరాలను షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌, మున్సిపల్‌ చైర్మన్‌ కె.నరేందర్‌, ఎంపీపీ ఖాజీఇద్రీస్‌లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ సురేందర్‌ మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని కోరారు. 


గౌరారంలో గుబులు..  

కరోనా వైరస్‌ షాద్‌నగర్‌ లింకుతో వికారాబాద్‌ జిల్లా బొంరాస్‌పేట్‌ మండలం గౌరారం ప్రజల్లో గుబులు రేగింది. గ్రామానికి చెందిన ఓ కిరాణ దుకాణ యజమాని బండివెల్కిచర్లలో జరిగిన శుభకార్యంలో షాద్‌నగర్‌ పాజిటివ్‌ వ్యక్తితో కలవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దౌల్తాబాద్‌ మండల పరిధిలోని అంతారం గ్రామంలో కరోనా అనుమానితుల నమూనాలు సేకరించారు. ఆదివారం గ్రామంలో నలుగురి శాంపిల్స్‌ సేకరించి, ఎనిమిది కుటుంబాలను హోం క్వారంటైన్‌కు ఆదేశించారు. 

Updated Date - 2020-05-25T09:58:48+05:30 IST