అసలైన తాపసి

ABN , First Publish Date - 2021-12-03T07:09:32+05:30 IST

తలలు బోడులైన తలపులు బోడులా?’ అని ప్రశ్నించాడు వేమన. ‘ఇట్టి వేషములన్ని పొట్ట కూటికె కాద’ అని తీర్మానించాడు కూడా! తపస్సులు అనేక రకాలు.

అసలైన తాపసి

లలు బోడులైన తలపులు బోడులా?’ అని ప్రశ్నించాడు వేమన. ‘ఇట్టి వేషములన్ని పొట్ట కూటికె కాద’ అని తీర్మానించాడు కూడా! తపస్సులు అనేక రకాలు. వాటిలో కొన్ని కఠోర తపస్సులు. బుద్ధుని కాలంలో తాపసులకు విశేష గౌరవం ఉండేది. ఆనాటికే అరవై నాలుగు రకాల తాపస విధానాలు ఉండేవని బౌద్ధ సాహిత్యం చెబుతోంది. ‘‘కేవలం శరీరాన్ని బాధించడం తపస్సు కాదు. మనస్సును మంచి మార్గంలో మలచుకోవడమే తపస్సు’’ అని బుద్ధుడు చెప్పాడు. చాలామంది తాపసులు ‘మేమే గొప్పవాళ్ళం. ఇతరులు తమకన్నా తక్కువవారు’ అనే అహంకారంతో ఉండేవారు. ఆహారాదులు సమర్పించే సమయంలో ఏది తక్కువ చేసినా కోపించేవారు. తాము అతీతులమని భావించి, మిగిలిన వారిని తక్కువగా ఎంచేవారు. ఇలాంటి మనోరుగ్మతల్లో పడి... ఎన్ని కఠోర తపస్సులు చేసినా తామసాన్ని మాత్రం వదిలిపెట్టేవారు కాదు. ఒకనాడు బుద్ధుడు మగధ రాజధాని రాజగృహ నగరం పక్కన ఉన్న పక్షి పర్వతం మీద ఉన్నాడని తెలిసి... సంధానుడు అనే పెద్ద వ్యాపారి అక్కడకు బయలుదేరాడు. ఆ దారిలోనే ఉదంబరిక అనే ఆరామం ఉంది. అక్కడ మూడువేల మంది శిష్యులతో నిగ్రోధుడు అనే తాపసి ఉన్నాడని తెలిసి, అక్కడకు వెళ్ళాడు. తమ వైపు వస్తున్న సంధానుణ్ణి చూసి - 

‘‘గొడవ చేయకండి. చప్పుడు ఆపండి. గౌతమ బుద్ధుని అభిమాని అయిన సంధానుడు వస్తున్నాడు. బుద్ధ అనుయాయులు అల్లరిని, సభలో చప్పుళ్ళనూ ఒప్పుకోరు’’ అని మందలించాడు నిగ్రోధుడు. 


అందరూ నిశ్శబ్దంగా సర్దుకొని కూర్చున్నారు. నిగ్రోధుడు కఠోర తాపసి. తాపసులందరిలో తానే గొప్పవాడిననే అహంభావి. అతను, సంధానుడు కొంతసేపు తపస్సు గురించి మాట్లాడుకున్నారు. 

‘‘సంధానకా! పద! ఈ రోజు నీ సమక్షంలోనే గౌతముణ్ణి ఓడిస్తాను. ఖాళీ కుండను పగులగొట్టినంత తేలిగ్గా బుద్ధుడి వాదాన్ని పగులగొట్టేస్తాను’’ అంటూ శిష్యగణంతో బయలుదేరాడు నిగ్రోధుడు.

వారు వెళ్ళే సమయానికి బుద్ధుడు సుమగధ దగ్గర నెమళ్ళకు మేత వేసే చోటులో ఉన్నాడు. మేత పెడుతున్న ఆయన చుట్టూ నెమళ్ళు చేరాయి. అవి మేత పూర్తి చేసి వెళ్ళాక... బుద్ధునితో నిగ్రోధుడు వాదానికి దిగాడు ప్రశ్నలు కురిపించాడు. కఠోర తపస్సుల గురించి వివరించాడు.


అప్పుడు బుద్ధుడు... ‘‘నిగ్రోధా! దిగంబరంగా ఉండడం, ఒంటికాలు మీదా, ముని వేళ్ళ మీదా నిలబడడం తపస్సు కాదు. నాచు తినడం, తవుడు, మలమూత్రాలు భక్షించడం తపస్సు కాదు. ముళ్ళ మీదా, మొనదేలిన రాళ్ళ మీదా పడుకోవడం కూడా తపస్సు కాదు. ఇవన్నీ తపోసారాన్ని మన మనసుల్లోకి చేర్చలేవు. ఎవరైనా ఇంత కఠోర తపస్సు చేసి... లాభ సత్కారాలు ఆశించినా... కోరినవి ఇవ్వకపోతే దూషించినా, తపోమైకంలో ఉండి అనైతిక కార్యాలకు పాల్పడినా, కోపం, వైరం, అహంభావాలను విడువకపోయినా, మిధ్యాదృష్టిని వదలకపోయినా అతను చేసింది తపస్సూ కాదు, అతను తాపసీ కాదు. నిగ్రోధా! ఇలాంటి సాధనాలన్నీ తపోసారాన్ని మన అంతరంగానికి అందించలేవు. చెట్టు మీద పడిన నీరు చెట్టు బెరడును మాత్రమే తాకుతుంది. చెట్టులోకి ఇంకదు. ఇదీ అంతే. ఎవరైతే ప్రాణాలను తీయరో, తీయించరో, తీయడాన్ని సమ్మతించరో వారే అసలైన తాపసులు. అలాగే ఎవరు దొంగతనం చేయరో, చేయించరో, చేసినదాన్ని సమర్థించరో వారే నిజమైన తాపసులు. ఎవరైతే అబద్ధాలు ఆడరో, ఆడించరో, సమర్థించరో, ఎవరు ఇంద్రియ సుఖాలు కోరుకోరో, కోరేట్టు చేయరో, కోరినవారిని వెనకేసుకొని రారో వారే స్వచ్ఛమైన తాపసులు. ఈ నాలుగు విధానాలనూ పాటించడమే తపస్సు. అవి పాటించేవారే తాపసులు’’ అన్నాడు.

అలాంటి సాధనే వేరు పీల్చిన నీరులా చెయ్యు మొత్తానికి చేరుతుందని నిగ్రోధుడు గ్రహించాడు. అతని శిష్యులూ అర్థం చేసుకున్నారు. బుద్ధుని మార్గానికి మళ్ళారు.

బొర్రా గోవర్ధన్‌


లోకానుకంపన

బుద్ధుడు చెప్పిన ప్రబోధాలలో ఇది అత్యున్నతమైది ‘బహుజన హితాయ, బహుజన సుఖాయ, లోకానుకంపాయ’ అనేది. మనం అందరి హితం కోసం ఉండాలి. అందుకోసమే కృషి చెయ్యాలి. ఎందుకంటే అందరి సుఖంలో మన సుఖం, అందరి హితంలో మన హితం ఉంటాయి. అలాంటి సుఖ-హితాలే శ్రేయోదాయకాలు. అవి దుఃఖాన్ని తెచ్చిపెట్టవు. ఇతరులను బాధపెట్టి మనం సుఖం పొందితే... ఆ సుఖం చివరకు దుఃఖాన్నే ఇస్తుంది. బహుజన సుఖం అలా కాదు. అది లోక సుఖం. అలాంటి స్థితికి మనం చేరాలంటే... మనలో ‘లోకానుకంపన’ ఉండాలి. ‘అనుకంపన’ అంటే ప్రతిస్పందన. ఎదుటి దానికి తగిన విధంగా కంపించడం, చలించడం. ‘లోకానుకంపన’ అంటే లోకంతో పాటు స్పందించడం. లోకుల దుఃఖాన్ని చూసి మనమూ దుఃఖానుభూతికి లోనుకావడం. అప్పుడే ఆ దుఃఖనివారణ కోసం నడుస్తాం. అలా లోకజనుల సుఖ దుఃఖాలను తనలో దర్శించుకోగల వ్యక్తి లోకహితుడు అవుతాడు. లోకం సుఖ దుఃఖాలను పంచుకోవడమే లోకానుకంపన.

Updated Date - 2021-12-03T07:09:32+05:30 IST