మార్గాంతరం?

ABN , First Publish Date - 2020-04-09T06:06:03+05:30 IST

దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ 14వతేదీతో ముగియాల్సి ఉన్నా, దానిని కొనసాగిస్తారేమోన్న అనుమానం ప్రజల్లో ఇప్పటికే బలీయంగా ఉన్నది. గత రెండురోజులుగా దీనిచుట్టూ సాగుతున్న...

మార్గాంతరం?

దేశవ్యాప్తంగా అమలవుతున్న లాక్‌డౌన్‌ 14వతేదీతో ముగియాల్సి ఉన్నా, దానిని కొనసాగిస్తారేమోన్న అనుమానం ప్రజల్లో ఇప్పటికే బలీయంగా ఉన్నది. గత రెండురోజులుగా దీనిచుట్టూ సాగుతున్న చర్చతో పాటు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం చేసిన వ్యాఖ్యలతో కొనసాగింపు దాదాపు ఖాయమని నిర్థారణ అయిపోయింది. వైరస్‌మీద దీర్ఘకాలిక పోరాటం అవసరమనీ, కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పడం లేదని అంటూ ఏప్రిల్‌ 14తో దేశవ్యాప్త లాక్‌డౌన్‌ ఎత్తివేయడం సాధ్యం కాదని మోదీ సూచన ప్రాయంగా ప్రకటించారు. పలు రాష్ట్రాలు, పరిపాలనా వ్యవస్థలు, నిపుణులు ఇదేమాట చెబుతున్నారని కూడా వివిధ రాజకీయపార్టీల నేతలతో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్సులో వ్యాఖ్యానించారు. పదకొండవ తేదీన ముఖ్యమంత్రులతో మాట్లాడిన తరువాతే ఏ నిర్ణయమూ చేస్తామని ప్రధాని అంటున్నప్పటికీ, ప్రభుత్వాలూ, ప్రజలూ కూడా కొనసాగింపునకు సిద్ధపడాల్సిన వాతావరణమే కనిపిస్తున్నది. 


రాజకీయపార్టీల ఫ్లోర్‌ లీడర్లతో నిర్వహించిన సమావేశంలో సైతం అత్యధికులు లాక్‌డౌన్‌ కొనసాగింపునకే ఓటేశారట. దీని కారణంగా సంభవిస్తున్న ఆర్థికనష్టం ఊహించని స్థాయిలో ఉన్నప్పటికీ, ప్రజల ప్రాణాలు రక్షించాలంటే అదొక్కటే మార్గమని ఇప్పటికే అనేకమంది ముఖ్యమంత్రులు అంటున్నారు. ఆర్థికరంగాన్ని ఎప్పుడైనా గాడినపెట్టవచ్చు, పోయిన ప్రాణాలు తేలేము కదా, కరోనామీద యుద్ధం ఇలాగే పటిష్ఠంగా సాగాలంటే మరిన్ని రోజుల లాక్‌డౌన్‌ వినా మరో మార్గం లేదని తెలంగాణ ముఖ్యమంత్రి ముందే స్పష్టంచేశారు. కొత్తకేసులు చేరుతూ, వ్యాప్తి పెరుగుతున్న స్థితిలో మార్గాంతరం కూడా లేనందున, అది ఎంతకాలమైనా కనీసం మరో విడతకు ప్రజలు మానసికంగా సిద్ధపడక తప్పదు. లాక్‌డౌన్‌ విధానం రోగవ్యాప్తిని ఎంతోకొంత నిరోధించగలిగినమాట వాస్తవం. హాట్‌స్పాట్‌లుగా అనుకుంటున్నవి దేశంలో గణనీయంగా ఉన్న స్థితిలో, రోగనిర్థారణ పరీక్షలు, ఆసుపత్రులు ఇత్యాది ఏర్పాట్లు గరిష్ఠ స్థాయిలో సిద్ధం చేసుకొనేందుకు లాక్‌డౌన్‌ ఉపకరిస్తుంది. దాదాపు నెలరోజులనుంచీ లాక్‌డౌన్‌లో ఉన్న స్పెయిన్‌, ఇటలీ వంటి దేశాల్లో మూడువారాలు దాటిన తరువాత కానీ, రోగ వ్యాప్తి తగ్గలేదు. భారతదేశంలో మొదట అంతటి తీవ్రత లేకున్నా, మూడోవారంలోకి అడుగుపెడుతున్న దశలో పరిస్థితిలో ఒక్కసారిగా మార్పు వచ్చి భయం హెచ్చింది. సామాజిక వ్యాప్తి లేదని అంటున్నప్పటికీ, కొన్ని హాట్‌స్పాట్‌లలో స్థానిక వ్యాప్తి జరుగుతున్నదన్న వార్తలు కూడా వినవస్తున్నాయి.


వైరస్‌ వ్యాప్తి నిరోధానికి లాక్‌డౌన్‌ అవసరమన్నది ఎవరూ కాదనలేరు కానీ, అది ప్రస్తుత రీతిలోనే కొనసాగించవలసిన అవసరం ఉన్నదా అన్నది ఆలోచించవచ్చు. చాలా రాష్ట్రాల్లో పరిశ్రమలు కేంద్రీకృతమైన ప్రాంతాలు, ఎస్‌ఈజడ్‌లు ఉన్న చోట కేసులు పరిమితంగా ఉంటూ, వైరస్‌ నియంత్రణలోనే ఉన్నందున వాటిని మూసి ఉంచాల్సిన అవసరం లేదనీ, తగిన జాగ్రత్తలతో నడిపించవచ్చునని కొందరి వాదన. వ్యవస్థీకృత రంగంలోని తయారీ యూనిట్లపై ప్రభుత్వ పర్యవేక్షణ సులభమే కనుక, భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించేట్టు చూస్తూ వాటిని నడిపించవచ్చని అంటున్నారు. ప్రజా రవాణాకు ఎటూ అవకాశం లేదు కనుక, పూర్తి దిగ్బంధాన్ని హాట్‌స్పాట్‌లకు పరిమితం చేస్తే సరిపోతుందని కొందరి సలహా. లాక్‌డౌన్‌ గడువు ముగుస్తున్న దశలో ప్రభుత్వం ముందుకు అనేక ప్రతిపాదనలు రావడం సహజం. ఈ మూడువారాల లాక్‌డౌన్‌ అనుభవాలనుంచి ప్రభుత్వం మంచిచెడులను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం అవసరం. అత్యవసర సేవల నిర్వచనాన్ని సవరించుకొని సామాజిక దూరాన్ని పాటించగలిగే అవకాశమున్న రంగాలను తెరవచ్చు. లాక్‌డౌన్‌ అన్నది ప్రజలకు భద్రతకు సంబంధించిన భరోసానిస్తే, కార్యకలాపాలు ఎంతోకొంతమేర ఆరంభం కావడమన్నది భవిష్యత్తుపట్ల నమ్మకాన్నిస్తాయి.

Updated Date - 2020-04-09T06:06:03+05:30 IST