`సార్.. మా కూతురి బారి నుంచి మమ్మల్ని కాపాడండి`.. ఎస్పీని ఆశ్రయించిన వృద్ధ తల్లిదండ్రులు!

ABN , First Publish Date - 2022-04-20T18:38:53+05:30 IST

అతని వయసు 103 సంవత్సరాలు.. అతని భార్య వయసు 95 ఏళ్లు.. 75 ఏళ్ల వైవాహిక జీవితం వారిది..

`సార్.. మా కూతురి బారి నుంచి మమ్మల్ని కాపాడండి`.. ఎస్పీని ఆశ్రయించిన వృద్ధ తల్లిదండ్రులు!

అతని వయసు 103 సంవత్సరాలు.. అతని భార్య వయసు 95 ఏళ్లు.. 75 ఏళ్ల వైవాహిక జీవితం వారిది.. ఒక్కగానొక్క కూతురిని గారాభంగా పెంచారు.. పెద్దయ్యాక తమకు కొండంత అండగా నిలుస్తుందనుకున్నారు.. అయితే ఆమె కూడా కొడుకులకు ఏ మాత్రం తీసిపోనని నిరూపించింది.. చివరి దశలో ఉన్న తల్లిదండ్రులకు నరకం చూపిస్తోంది.. ఆస్తి కోసం వేధింపులకు గురిచేస్తోంది.. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. 


మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో రాయ్ కాలనీకి చెందిన నారాయణ్ (103), విమల (95) దంపతులు తాజాగా జిల్లా ఎస్పీకి ఆఫీస్‌కు వెళ్లి తమ కూతురిపై ఫిర్యాదు చేశారు. `మాకు కొంత వ్యవసాయ భూమి, అద్దె వచ్చే ఇల్లు ఉంది. వాటి నుంచి వచ్చే రాబడి మాకు అందకుండా కూతురు లాగేసుకుంటోంది. మాకు కనీస అవసరాలకు కూడా డబ్బులు ఇవ్వడం లేదు. అడిగితే భౌతికంగా, మానసికంగా వేధిస్తోంది. చంపేస్తానని బెదిరిస్తోంది. బూతులు తిడుతోంది. దయచేసి మా కూతురి నుంచి మమ్మల్ని కాపాడండి` అని ఆ వృద్ధ దంపతులు ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. 


ఆ వృద్ధ దంపతులకు తోడుగా మనవలు కూడా పోలీస్ స్టేషన్‌కు రావడం విశేషం. తమ అమ్మ తమను కూడా టార్చర్ పెడుతోందని వారు పోలీసులకు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. 

Updated Date - 2022-04-20T18:38:53+05:30 IST